Ind Vs WI: 458 పరుగులు.. 17 వికెట్లు.. ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి.. ఆ ఇద్దరికి బంపర్‌ ఛాన్స్‌.. ఏకంగా విండీస్‌తో సిరీస్‌తో..

26 Jan, 2022 11:15 IST|Sakshi

India Vs West Indies Series 2022: దక్షిణాఫ్రికా పర్యటనతో పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన సిరీస్‌ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులోకి రానుండగా.. దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. సౌతాఫ్రికాతో టూర్‌లో తుది జట్టు కూర్పు.. తదనంతర ఫలితాలు దృష్టిలో పెట్టుకుని సమతౌల్యమైన జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఆల్‌రౌండర్‌ రిషి ధావన్‌, షారుఖ్‌ ఖాన్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

458 పరుగులు.. 17 వికెట్లు..
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో హిమాచల్‌ ప్రదేశ్‌ కెప్టెన్‌ రిషి ధావన్‌ అద్భుత ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే.  బ్యాటర్‌గా.. బౌలర్‌గా రిషి ధావన్‌ అత్యుత్తమంగా రాణించాడు.ఈ  టోర్నీలో మొత్తంగా 458 పరుగులు చేయడంతో పాటుగా 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలతో పాటు ఒక 4 వికెట్‌ హాల్‌ కూడా ఉండటం విశేషం. 

ఇలా ఆటగాడిగా.. సారథిగా హిమాచల్‌ ప్రదేశ్‌ మొట్టమొదటి సారిగా ఈ మెగా ఈవెంట్‌లో విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రిషి సుదీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్‌ ఉంది. విండీస్‌తో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి..
మరోవైపు... తమిళనాడు ఆటగాడు షారుఖ్‌ ఖాన్‌ సైతం దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో రాణించాడు. ముఖ్యంగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఫైనల్‌లో ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టి తమిళనాడును విజేతగా నిలిపి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఈ ప్రదర్శన దృష్ట్యా విండీస్‌ టీ20 సిరీస్‌కు షారుఖ్‌ను సెలక్ట్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా... దక్షిణాఫ్రికా టూర్‌లో ఘోరంగా వైఫల్యం చెందిన వెంకటేశ్‌ అయ్యర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తదితరులపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గాయం కారణంగా టూర్‌కు దూరమైన అక్షర్‌ పటేల్‌, కరోనా కారణంగా వన్డే సిరీస్‌ మిస్సైన వాషింగ్టన్‌ సుందర్‌.. వీరితో పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: రాహుల్‌, పంత్‌కు ప్రమోషన్‌.. రహానే, పుజారాలకు డిమోషన్‌!

మరిన్ని వార్తలు