Ind Vs Wi 1st ODI - Rohit Sharma: వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ తొలి ప్రెస్‌మీట్‌... కోహ్లికి ఆ విషయం తెలుసు.. ఓపెనర్‌గా దిగేది అతడే!

5 Feb, 2022 14:20 IST|Sakshi

Ind Vs Wi ODI Series- 1st ODI  Rohit Sharma Press Meet: వెస్టిండీస్‌తో స్వదేశంలో సిరీస్‌తో టీమిండియా పూర్తిస్థాయి వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ప్రయాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 సారథిగా న్యూజిలాండ్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన హిట్‌మ్యాన్‌.. వన్డేల్లోనూ ఇదే తరహాలో అదరగొట్టాలని భావిస్తున్నాడు. ఇక విండీస్‌తో అహ్మదాబాద్‌ వేదికగా జరుగనున్న తొలి వన్డే టీమిండియాకు వెయ్యవది కావడంతో హిట్‌మ్యాన్‌కు ఇది మరింత ప్రత్యేకంగా మారింది. 

ఈ క్రమంలో వన్డే సారథి హోదాలో తొలిసారిగా శనివారం మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా తమ ప్రణాళికలు, ఓపెనింగ్‌ జోడీ తదితర అంశాల గురించి వెల్లడించాడు. ఈ మేరకు రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... ‘‘దక్షిణాఫ్రికా పర్యటన మంచి గుణపాఠం నేర్పింది. ఒక్కొక్కరితో మాట్లాడాలి జట్టును పటిష్టం చేసుకుంటాం. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే... విరాట్‌ కెప్టెన్‌గా ఉన్నపుడు నేను వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాను. మా ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. 

తను ఎక్కడైతే నిష్క్రమించాడో అక్కడి నుంచి నేను మొదలుపెడతాను. ఒక ఆటగాడిగా తన నుంచి జట్టు ఏం ఆశిస్తుందో కోహ్లికి తెలుసు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆటగాళ్లు తమను తాము మలచుకోవాలి. నేను పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా... ‘‘శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ కరోనా నుంచి కోలుకుంటున్నారు. 

మయాంక్‌ అగర్వాల్‌ జట్టులోకి వచ్చాడు. అయితే,  నిబంధనల ప్రకారం ఇంకా ఐసోలేషన్‌ పూర్తి కాలేదు. కాబట్టి మొదటి వన్డేలో ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. ఇక కుల్‌చా(కుల్దీప్‌ యాదవ్‌- యజువేంద్ర చహల్‌) జంట మాకు మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాం’’అని రోహిత్‌ శర్మ తెలిపాడు. కాగా ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.

చదవండి: U19 WC Aus Vs Afg: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఆసీస్‌దే విజయం
U19 WC Final- Yash Dhull: జట్టులో స్టార్స్‌ లేరు.. వందకు వంద శాతం ఎఫర్ట్‌ పెడతాం.. కోహ్లి మాకు ఏం చెప్పాడంటే..

మరిన్ని వార్తలు