Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు'

7 Aug, 2022 08:40 IST|Sakshi

టీమిండియాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో వెస్టిండీస్‌ ఒక మ్యాచ్‌ గెలిచిందంటే అదంతా ఒబెద్‌ మెకాయ్‌ పుణ్యమే. రెండో టి20లో విండీస్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మెకాయ్‌ ఆరు వికెట్లతో చెలరేగి టీమిండియా పతనాన్ని శాసించాడు. రోహిత్‌ శర్మను గోల్డెన్‌ డక్‌ చేయడం సహా మరో ఐదు కీలక వికెట్లు తీశాడు. అంతలా భయపెట్టిన ఈ వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ తాజాగా మాత్రం టీమిండియా బ్యాటర్స్‌కు భయపడ్డాడు.  ముఖ్యంగా భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌లు మెకాయ్‌ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నారు.

ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో మెకాయ్‌ వేసిన తొలి బంతినే రోహిత్‌ శర్మ సిక్సర్‌ బాదగా.. ఆ తర్వాత ఓవర్‌ చివరి బంతిని సూర్యకుమార్‌ సిక్సర్‌తో ముగించాడు. మధ్యలో మరొక సిక్సర్‌, ఫోర్‌ సహా మొత్తం 25 పరుగులు వచ్చాయి. సూర్య కొట్టిన రెండు సిక్సర్లలో ఒకటి హెలికాప్టర్‌ సిక్స్‌  ఉండడం విశేషం. ఈ దెబ్బతో మెకాయ్‌ మొహం ఒక్కసారిగా మాడిపోయింది. అంతేకాదు 4 ఓవర్లలో రెండు వికెట్లు తీసినప్పటికి.. 66 పరుగులు సమర్పించుకోవడం విశేషం. ''మొన్న భయపెట్టిన బౌలర్‌.. ఇవాళ భయపడ్డాడు'' అంటూ క్రికెట్‌ అభిమానులు కామెంట్స్‌ చేశారు. కాగా మెకాయ్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఓవర్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. వెస్టిండీస్‌ను వన్డే సిరీస్‌లో చిత్తు చేసిన భారత్‌ టి20 సిరీస్‌ను కూడా 3–1తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 59 పరుగులతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (31 బంతుల్లో 44; 6 ఫోర్లు), రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజు సామ్సన్‌ (23 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (14 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.

విండీస్‌ బౌలర్‌ మెకాయ్‌ 4 ఓవర్లలో 66 పరుగులిచ్చాడు. అనంతరం విండీస్‌ 19.1 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. పూరన్‌ (24), రావ్‌మన్‌ పావెల్‌ (24) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3 వికెట్లు పడగొట్టగా... అవేశ్‌ ఖాన్, రవి బిష్ణోయ్, అక్షర్‌ పటేల్‌ తలా 2 వికెట్లు తీశారు. చివరిదైన ఐదో టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. 

చదవండి: IND vs WI: టి20 క్రికెట్‌లో రోహిత్‌ సేన కొత్త చరిత్ర..

IND VS WI 4th T20: అఫ్రిదిని అధిగమించి, క్రిస్‌ గేల్‌కు చేరువైన హిట్‌మ్యాన్‌

మరిన్ని వార్తలు