India Vs West Indies, 3rd ODI: గర్వంగా ఉంది! అప్పుడు.. ఇప్పుడూ కెప్టెన్‌గా ధావన్‌ సూపర్‌! విదేశీ గడ్డ మీద..

28 Jul, 2022 10:42 IST|Sakshi
శిఖర్‌ ధావన్‌(PC: BCCI)

India Tour Of West Indies 2022- ODI Series- 3rd ODI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి పరిపూర్ణ విజయం అందుకుంది ధావన్‌ సేన. ట్రినిడాడ్‌ వేదికగా బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో 119 పరుగుల తేడాతో గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌ను వారి సొంత గడ్డపై వైట్‌వాష్‌ చేసిన తొలి భారత జట్టుగా నిలిచింది. కాగా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా కీలక ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా తదితరులు లేకుండానే యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు విండీస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో విండీస్‌ గడ్డ మీద ఈ మేరకు అద్వితీయ విజయం అందుకోవడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. 

గర్వంగా ఉంది!
మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘మా జట్టులో ఉన్నది యువ ఆటగాళ్లే కావొచ్చు. అయితే, వాళ్లు ఎంతో పరిణతి ప్రదర్శించారు. మైదానంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు. అద్భుతంగా ఆడి తమను తాము నిరూపించుకున్న తీరు పట్ల నాకు గర్వంగా ఉంది. నిజంగా మాకిది శుభ శకునం’’ అని పేర్కొన్నాడు.  

ఇక ఈ సిరీస్‌లో తన ప్రదర్శన గురించి గబ్బర్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. ఈ ఫార్మాట్‌లో ఆడి చాలా రోజులు అవుతోంది. అయినా మొదటి మ్యాచ్‌లో నా ఇన్నింగ్స్‌ నాకు సంతృప్తినిచ్చింది’’ అని పేర్కొన్నాడు. ఇక తనతో పాటు ఓపెనింగ్‌ చేసిన శుబ్‌మన్‌ గిల్‌ సిరీస్‌ ఆసాంతం రాణించిన తీరును గబ్బర్‌ కొనియాడాడు. 

అదే విధంగా తమ బౌలింగ్‌ విభాగం సైతం జట్టును గెలిపించేందుకు వందకు వంద శాతం కృషి చేసిందని బౌలర్లను కొనియాడాడు. కాగా గతేడాది శ్రీలంక పర్యటనలో కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత శిఖర్‌ ధావన్‌కు జట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. 

ధావన్‌ అప్పుడు.. ఇప్పుడూ.. సూపర్‌!
ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో అతడు పునరాగమనం చేశాడు. అయితే, ఇంగ్లండ్‌ గడ్డ మీద పెద్దగా రాణించలేకపోయాడు. మొదటి వన్డేలో 31 పరుగులు చేసిన ధావన్‌.. రెండు(9), మూడో వన్డే(1)ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. అయినప్పటికీ విండీస్‌ గడ్డ మీద వన్డే సిరీస్‌కు సారథిగా ఎంపికయ్యాడు. ద్వితీయ శ్రేణి జట్టు అని భావించినప్పటికీ యువ ఆటగాళ్లతోనే కరేబియన్‌ గడ్డపై చరిత్ర సృష్టించి ఈ సిరీస్‌ను మధుర జ్ఞాపకంగా మార్చుకున్నాడు.

ఇక విండీస్‌ పర్యటనలో మూడు మ్యాచ్‌లలో శిఖర్‌ ధావన్‌ చేసిన స్కోర్లు వరుసగా 97, 13, 58. ఇదిలా ఉంటే.. శ్రీలంక పర్యటనలో ధావన్‌ సారథ్యంలోని యువ జట్టు వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచింది. అయితే, టీ20 సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో చేజార్చుకుంది. ఇక రెండు సందర్బాల్లోనూ విదేశీ గడ్డపై ధావన్‌ వన్డే సిరీస్‌ గెలవడం గమనార్హం.

వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇండియా మూడో వన్డే:
►వేదిక: క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, ట్రినిడాడ్‌
►టాస్‌: ఇండియా- బ్యాటింగ్‌
►మ్యాచ్‌కు వర్షం ఆటంకి
►ఇండియా స్కోరు: 225-3 (36 ఓవర్లు)
►డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి(డీఎల్‌ఎస్‌)లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యం 257 పరుగులు
►వెస్టిండీస్‌ స్కోరు: 137-10 (26 ఓవర్లు)
►విజేత: ఇండియా- డీఎల్‌ఎస్‌ పద్ధతిలో 119 పరుగుల తేడాతో గెలుపు
►మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన ఇండియా
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: శుబ్‌మన్‌ గిల్‌(98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు- నాటౌట్‌)
►ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌: శుబ్‌మన్‌ గిల్‌(64, 43, 98 పరుగులు)
చదవండి: Shubman Gill: మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు తిట్టుకున్నాడు.. కట్‌చేస్తే
Shubman Gill: సెంచరీ మిస్‌ అయినా దిగ్గజాల సరసన చోటు

మరిన్ని వార్తలు