Shreyas Iyer: చరిత్రలో నిలిచిపోయే చాన్స్‌ మిస్‌.. వైరల్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ విన్యాసం

30 Jul, 2022 12:25 IST|Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దినేశ్‌ కార్తిక్‌ ఫినిషర్‌గా అదరగొడితే.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయితే వీటన్నింటిని మించి శ్రేయాస్‌ అయ్యర్‌ చేసిన ఫీల్డింగ్‌ విన్యాసం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఒకవేళ ఇది గనుక క్యాచ్‌గా అందుకొని ఉంటే మాత్రం అయ్యర్‌ పేరు చరిత్రలో నిలిచిపోయేది.

విషయంలోకి వెళితే.. రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ తొలి బంతిని నికోలస్‌ పూరన్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా తరలించాడు. బంతి ఎక్కువ హైట్‌లో వెళ్లడంతో పూరన్‌ సహా అంతా సిక్స్‌ అని భావించారు. కానీ బౌండరీలైన్‌ వద్ద శ్రేయాస్‌ అయ్యర్‌ గాల్లోకి ఎగిరి శరీరాన్ని విల్లులా మార్చుకొని ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే అతని కుడి కాలు బౌండరీలైన్‌కు ఇంచు దూరంలో ఉండడం.. బ్యాలెన్స్‌ గాక క్యాచ్‌ అందుకోవడం కష్టమైంది. దీంతో బంతిని ఇవతలికి విసిరేసి తాను బౌండరీ లైన్‌ అవతలికి వెళ్లిపోయాడు. అలా క్యాచ్‌ మిస్‌ అయినా సిక్సర్‌ను తప్పించడంలో అయ్యర్‌ విజయవంతం అయ్యాడు.

అయ్యర్‌ విన్యాసానికి సంబంధించిన వీడియోను ఫ్యాన్‌కోడ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో రోహిత్‌ శర్మ 64 పరుగులతో ఆకట్టుకోగా.. ఆఖర్లో దినేశ్‌ కార్తిక్‌ మరోసారి ఫినిషర్‌ పాత్ర పోషించడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ చేదనలో చతికిలపడింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయి, రవిచంద్రన్‌ అశ్విన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలా రెండు రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్‌ కుమార్‌, జడేజాలు చెరొక వికెట్‌ తీశారు. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్‌ సోమవారం(ఆగస్టు 1న) జరగనుంది.

చదవండి: Dinesh Karthik: ఇలాంటి షాట్లు డీకేకు మాత్రమే సొంతం.. 

Sourav Ganguly: మనసు మార్చుకున్న 'దాదా'.. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో

మరిన్ని వార్తలు