Ind Vs Wi T20 Series- Pollard: అతడు వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్‌.. అందరూ తనను చూసి నేర్చుకోవాలి: పొలార్డ్‌

21 Feb, 2022 13:44 IST|Sakshi

Ind Vs Wi T20 Series- మిగతా ఆటగాళ్లతో పోలిస్తే ఎంట్రీ కాస్త లేటయినా... అవకాశం వచ్చిన ప్రతిసారి తనను నిరూపించుకుంటూనే ఉన్నాడు టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లోనూ సత్తా చాటాడు ఈ ముంబైకర్‌. మూడు మ్యాచ్‌లలో కలిపి 107 పరుగులు సాధించాడు. సగటు 53.50. స్ట్రైక్‌రేటు 194.55. ముఖ్యంగా ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో 31 బంతుల్లోనే 65 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో ఒక ఫోర్‌, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు సూర్యకుమార్‌ సొంతమయ్యాయి. 

ఈ క్రమంలో విండీస్‌తో సిరీస్‌లో సూర్యకుమార్‌ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక వెస్టిండీస్‌ కెప్టెన్‌, ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ కూడా సూర్యను ప్రశంసల్లో ముంచెత్తడం గమనార్హం. ఆదివారం నాటి వర్చువల్‌ సమావేశంలో పొలార్డ్‌ మట్లాడుతూ... ‘‘సూర్య వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌. 2011 నుంచి ముంబై ఇండియన్స్‌ జట్టులో తనతో కలిసి ఆడుతున్నాను. క్రికెటర్‌గా తన ఎదుగులను చూస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా... టీమిండియా విజయాల కోసం అతడు చేస్తున్న కృషి, ఆడుతున్న తీరు అమోఘం.

అతడు 360 డిగ్రీ ప్లేయర్‌. ప్రతి బ్యాటర్‌ తన నుంచి నేర్చుకోవాల్సి ఉంది. అతడి నుంచి స్ఫూర్తి పొందాలి’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌ మెగా వేలం నేపథ్యంలో రిటెన్షన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(రూ. 16 కోట్లు) సహా జస్‌ప్రీత్‌ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (రూ. 8 కోట్లు) , కీరన్‌ పొలార్డ్‌ (రూ. 6 కోట్లు)ను అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో భాగంగా రోహిత్‌, సూర్యకుమార్‌ అదరగొట్టగా... పొలార్డ్‌ ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా విఫలమయ్యాడు. రోహిత్‌ సేన చేతిలో పొలార్డ్‌ బృందం వన్డే, టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది.

చదవండి: Ind Vs Wi 3rd T20- Rohit Sharma: వాళ్లు జట్టులో లేకున్నా మేము గెలిచాం.. సంతోషం: రోహిత్‌ శర్మ

>
మరిన్ని వార్తలు