Tilak Varma: స్కూల్‌లో అకౌంట్‌ సెక్షన్‌లో పనిచేశా! తిలక్‌ వల్లే ఇలా! ఇప్పుడు తను మారిపోయాడు! ఆశ్చర్యపోయా..

20 Jul, 2023 18:40 IST|Sakshi
వెస్టిండీస్‌కు బయల్దేరే ముందు స్నేహితులతో తిలక్‌ వర్మ

క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో ఒక్కసారి టీమిండియాకు ఆడే అవకాశం వచ్చిందంటే చాలు సెలబ్రిటీ అయిపోతారు. ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తే ఇక వాళ్లకు తిరుగే ఉండదు. అయితే, సాధారణ కుటుంబంలో జన్మించి క్రికెటర్‌గా ఎదిగే ప్రయాణంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు కొందరికి మాత్రమే తెలుసు!

కాగా గత కొంతకాలంగా భారత టీ20 జట్టులోకి వస్తున్న వాళ్లలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సత్తా చాటిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. అలాంటి వారిలో మన హైదరాబాదీ తిలక్‌ వర్మ కూడా ఒకడు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.

తిలక్‌ క్రీజులో ఉంటే చాలు
ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడి.. తిలక్‌ క్రీజులో ఉంటే చాలు మ్యాచ్‌ గెలిచేస్తాం అని భరోసా ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ప్రపంచానికి అతడి పేరు తెలుసు! మరి అతడిని ఈ స్థాయికి తెచ్చిన తల్లిదండ్రులు, వారు పడ్డ కష్టాల గురించి తెలుసా?

హైదరాబాద్‌లోని ఎలక్ట్రీషియన్‌ కుటుంబంలో జన్మించాడు తిలక్‌. అతడి తల్లిదండ్రులు నంబూరి నాగరాజు- గాయత్రీ దేవి. తిలక్‌ వర్మ వెస్టిండీస్‌ పర్యటనకు సెలక్ట్‌ అయిన నేపథ్యంలో సాక్షి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో వాళ్లు పంచుకున్న విషయాలు ఇవి!

ఐదారేళ్లు అత్యంత కష్టంగా తోచింది
‘‘తిలక్‌ చిన్నతనంలో ఒక ఐదారేళ్ల పాటు చాలా కష్టపడ్డాం. అయితే, నా భర్త నేను అన్ని పనులు షేర్‌ చేసుకునే వాళ్లం. అప్పటి మా ఆర్థిక పరిస్థితిని బట్టి నేను కూడా కచ్చితంగా జాబ్‌ చేయాల్సిందే! పిల్లలను స్కూలుకు పంపడం, అకాడమీకి తీసుకెళ్లి వాళ్లతో పాటు ఉండటం సాధ్యమయ్యేది కాదు. పొద్దున అక్కడ దింపేసి.. ఆఫీస్‌ ముగించుకుని మళ్లీ వెళ్లి తీసుకురావాలి. అప్పట్లో నేను స్కూళ్లో అకౌంట్‌ సెక్షన్‌లో పనిచేశాను.

ఆ పని చేసుకుంటూనే పిల్లల్ని చూసుకోవాలంటే కష్టం. పొద్దున మూడు గంటలకే నిద్రలేచి.. మా వారు, నేను చకాచకా అన్ని పనులు చేసుకునే వాళ్లం’’ అని తిలక్‌ వర్మ తల్లి.. తమ కుమారుడి ఎదుగుదలలో తమ పాత్ర గురించి వివరించారు.

తిలక్‌ నాన్‌వెజ్‌ వదిలేశాడు
ఇక తిలక్‌కు నాన్‌వెజ్‌ అంటే ఎంతో ఇష్టమన్న ఆమె.. గత రెండు నెలలుగా తను వీగన్‌ మారిపోయాడని చెప్పారు. అంత ఇష్టంగా తినే నాన్‌వెజ్‌ను తిలక్‌ పూర్తిగా వదిలేయడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. తమ పిల్లలకు జంక్‌ ఫుడ్‌ తినే అలవాటు లేదని.. ఇంట్లో చేసిన పదార్థాలే తింటారని చెప్పుకొచ్చారు. కాగా తిలక్‌ వర్మ గురువారం (జూలై 20) వెస్టిండీస్‌కు పయనమైన విషయం తెలిసిందే.

చదవండి: ఆరోజు రోహిత్‌ భార్య అన్న మాట జీవితంలో మర్చిపోలేను: తిలక్‌ వర్మ తండ్రి
 హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ కుటుంబం ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.. పూర్తి వీడియో మీకోసం...

A post shared by Tilak Varma (@tilakvarma9)

మరిన్ని వార్తలు