Ind Vs WI ODI Series: వన్డేల్లో అరంగేట్రం చేయాలి.. ఓపెనర్‌గా రావాలి! అతడికి ఆ అర్హత ఉంది!

21 Jul, 2022 13:46 IST|Sakshi
రుతురాజ్‌ గైక్వాడ్‌(PC: BCCI)

India tour of West Indies, 2022: వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటన నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌ ఓపెనింగ్‌ జోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయాలని ఆకాంక్షించాడు. శిఖర్‌ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించే అర్హత రుతుకు ఉందని ఈ మాజీ ఓపెనర్‌ అభిప్రాయపడ్డాడు.

కాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని భారత జట్టు విండీస్‌కు చేరుకుని ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున రుతురాజ్‌ గైక్వాడ్‌ గతేడాది ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిరీస్‌లో భాగంగా వన్డే జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో అదరగొట్టిన రుతుకు ఇప్పటికైనా ఛాన్స్‌ ఇవ్వాలని వసీం జాఫర్‌ అన్నాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా.. ‘‘వెస్టిండీస్‌ సిరీస్‌లో రుతురాజ్‌కు వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం రావాలి. అతడు శిఖర్‌తో కలిసి ఓపెనింగ్‌ చేయాలి.

లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ కుదురుతుంది. విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నీలో రుతు 5 ఇన్నింగ్స్‌లో 4 సెంచరీలు సాధించాడు. కాబట్టి తుదిజట్టులో చోటు దక్కించుకునే అర్హత అతడికి ఉంది’’ అని వసీం తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. 

కాగా కేఎల్‌ రాహుల్‌ గైర్హాజరీ నేపథ్యంలో రుతుకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఇషాన్‌ కిషన్‌ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక లిస్ట్‌ ఏ క్రికెట్‌లో ఈ కుడిచేతి వాటం గల బ్యాటర్‌ ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. 64 మ్యాచ్‌లలో వందకు పైగా స్ట్రైక్‌రేటుతో రుతు 3284 పరుగులు సాధించాడు.

చదవండి: Rishabh Pant: పంత్‌ చూడటానికి బాగుంటాడు.. కాస్త బరువు తగ్గితే! కోట్లలో సంపాదించవచ్చు!
India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌, జట్లు, పూర్తి వివరాలు!

మరిన్ని వార్తలు