90 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయి 181 పరుగులకు టీమిండియా ఆలౌట్‌.. చిత్రంగా విండీస్‌ మాత్రం!

31 Jul, 2023 09:53 IST|Sakshi

West Indies vs India, 2nd ODI- ICC ODI WC 2023- బ్రిడ్జ్‌టౌన్‌: స్వదేశంలో త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు ముందు కరీబియన్‌ పర్యటనకు వచ్చిన భారత జట్టు టెస్టు సిరీస్‌ గెలిచేంత వరకు బాగానే ఉంది. కానీ మెగా టోర్నీ సన్నాహాకమైన కీలక వన్డే సిరీస్‌లో టీమిండియా ఆట ఏమాత్రం బాగోలేదు. తొలి వన్డేలో అర్థంలేని ప్రయోగాలను రెండో వన్డేలోనూ చేసింది. మొదటి మ్యాచ్‌లో గెలిచేందుకు కష్టపడింది.

కానీ రెండో మ్యాచ్‌లో టీమిండియా ఎంత కష్టపడినా నెగ్గలేకపోయింది. తమ కెరీర్‌లో ఆఖరి వన్డే ప్రపంచకప్‌ అనుకుంటున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిలకు ప్రతీ మ్యాచ్‌ కీలకం కాగా... వీళ్లిద్దరు విశ్రాంతి పేరిట దూరమైన వైనం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. అందుకేనేమో మెగా ఈవెంట్‌కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్‌ జట్టు చేతిలో టీమిండియా అపహాస్యం కావాల్సి వచ్చింది.

ఇషాన్‌ ఒక్కడే
భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రెండో వన్డేలో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విండీస్‌ చేతిలో పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని భారత్‌ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్‌), శుబ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) మాత్రమే బాగా ఆడారు.

టీమిండియా పసలేని బౌలింగ్‌పై..
తర్వాత పసలేని బౌలింగ్‌పై సులువైన లక్ష్యాన్ని వెస్టిండీస్‌ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్‌ షై హోప్‌ (80 బంతుల్లో 63 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కీసీ కార్టీ (65 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు) విండీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌నకు వికెట్‌ దక్కింది. సిరీస్‌ విజేతను నిర్ణయించే వన్డే మంగళవారం(ఆగష్టు 1) టరోబాలో జరుగుతుంది.  

శార్దుల్‌ రాణించినా... 
భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ తన పేస్‌తో నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్లో జోరుమీదున్న ఓపెనర్లు మేయర్స్‌ (28 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రాండన్‌ కింగ్‌ (23 బంతుల్లో 15; 3 ఫోర్లు)లను అవుట్‌ చేశాడు. కాసేపటికే వన్‌డౌన్‌లో వచి్చన అతనెజ్‌ (6)కూ శార్దుల్‌ క్రీజులో నిలిచే అవకాశమివ్వలేదు. 72 పరుగులకే టాపార్డర్‌ వికెట్లన్నీ పడ్డాయి.

90 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయి.. చిత్రంగా విండీస్‌ మాత్రం
వంద పరుగుల్లోపు మరో వికెట్‌ హెట్‌మైర్‌ (9) రూపంలో పడింది. కుల్దీప్‌నకు ఈ వికెట్‌ దక్కింది. 17 ఓవర్లలో విండీస్‌ స్కోరు 91/4. ఈ దశలో భారత్‌కు గెలిచే అవకాశం కనిపించింది. కానీ కెపె్టన్‌ షై హోప్, కార్టీతో కలిసి ప్రత్యర్థి జట్టుకు ఆ చాన్సు ఇవ్వకుండా క్రీజ్‌లో పాతుకుపోయాడు.

ఈ క్రమంలో హోప్‌ 70 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా... ఇద్దరు కలిసి అబేధ్యమైన ఐదో వికెట్‌కు 91 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌ విచిత్రమేంటంటే... భారత్‌ 90 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయి 181 పరుగులకు ఆలౌటైంది. కానీ అదే విండీస్‌ 91 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయాక మళ్లీ వికెట్‌నే చేజార్చుకోలేదు. 

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: 181; వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: బ్రాండన్‌ కింగ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్‌ 15; మేయర్స్‌ (సి) ఉమ్రాన్‌ (బి) శార్దుల్‌ 36; అతనెజ్‌ (సి) ఇషాన్‌ (బి) శార్దుల్‌ 6; షై హోప్‌ (నాటౌట్‌) 63; హెట్‌మైర్‌ (బి) కుల్దీప్‌ 9; కార్టీ (నాటౌట్‌) 48; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (36.4 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–53, 2–54, 3–72, 4–91. 

బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్యా 6.4–0–38–0, ముకేశ్‌ 3–0–17–0, ఉమ్రాన్‌ మాలిక్‌ 3–0–27–0, శార్దుల్‌ ఠాకూర్‌ 8–0–42–3, కుల్దీప్‌ యాదవ్‌ 8–0–30–1, జడేజా 6–0–24–0, అక్షర్‌ పటేల్‌ 2–1–4–0.  
చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! 
కావాలనే రోహిత్‌, కోహ్లి లేకుండా! మ్యాచ్‌ ఓడిపోతేనే! ఆసియా కప్‌ తర్వాత ఇద్దరూ అవుట్‌?

మరిన్ని వార్తలు