Ind Vs Zim: తుది జట్ల అంచనా! పిచ్‌ వాతావరణం! జింబాబ్వే ఆఖరిసారి ఎప్పుడు గెలిచిందంటే!

18 Aug, 2022 10:45 IST|Sakshi
ట్రోఫీతో  కెప్టెన్లు రెగిస్‌ చకాబ్వా, కేఎల్‌ రాహుల్‌(PC: BCCI)

India tour of Zimbabwe, 2022- 1st ODI: టీమిండియా మరో సిరీస్‌ వేటకు సిద్ధమైంది. మూడు వన్డేలు ఆడేందుకు జింబాబ్వేలో పర్యటిస్తోంది. కాగా ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లను 2-1తో గెలిచిన భారత జట్టు..  వెస్టిండీస్‌ గడ్డ మీద శిఖర్‌ ధావన్‌ సారథ్యంలో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌(3-0) చేసిన విషయం తెలిసిందే.

అదే విధంగా విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ టూర్లలో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(విండీస్‌తో వన్డే సిరీస్‌), వెస్టిండీస్‌తో ఆఖరి టీ20కి హార్దిక్‌ పాండ్యా సారథులుగా వ్యవహరించారు.

ఇక జింబాబ్వే పర్యటనకు తొలుత శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ.. పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అందుబాటులోకి రావడంతో గబ్బర్‌ను తప్పించి.. రాహుల్‌కు పగ్గాలు అప్పగించారు.

గతంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో వైట్‌బాల్‌ క్రికెట్‌ సిరీస్‌కు సారథ్యం వహించిన రాహుల్‌.. ప్రొటిస్‌ గడ్డపై ఘోర పరాభవం చవిచూశాడు. అయితే, ఇప్పుడు జింబాబ్వే టూర్‌ రూపంలో అతడికి కెప్టెన్‌గా సిరీస్‌ గెలిచే సువర్ణావకాశం వచ్చింది. అయితే.. ఆతిథ్య జట్టు సైతం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను వన్డే, టీ20 సిరీస్‌లలో 2-1తో మట్టికరిపించి ఆత్మవిశ్వాసంతో ఉంది. టీమిండియాకు పోటీనిస్తామని ధీమాగా చెబుతోంది.

ఈ రెండు జట్ల మధ్య హరారే వేదికగా గురువారం(ఆగష్టు 18) నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది. మధ్యాహ్నం గం. 12:45 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం జరుగబోతోంది.  ఈ నేపథ్యంలో మొదటి వన్డేకు తుది జట్ల అంచనా, పిచ్‌, వాతావరణం, ముఖాముఖి రికార్డులు తదితర అంశాలు పరిశీలిద్దాం.

జింబాబ్వే వర్సెస్‌ భారత్‌ మొదటి వన్డే
తుది జట్లు (అంచనా)
టీమిండియా: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, శుబ్‌మన్‌ గిల్, సంజూ సామ్సన్, దీపక్‌ హుడా, శార్దుల్ ఠాకూర్‌, అక్షర్ పటేల్‌, కుల్దీప్ యాదవ్‌, దీపక్‌ చహర్, ప్రసిధ్‌ కృష్ణ/అవేశ్‌ ఖాన్, మహ్మద్‌ సిరాజ్‌.

జింబాబ్వే: రెగిస్‌ చకాబ్వా (కెప్టెన్‌), మరుమని, కైటానో, కయా, వెస్లీ మదెవెర్‌/సీన్‌ విలియమ్స్, సికందర్‌ రజా, టోని మన్యొంగా, ల్యూక్‌ జాంగ్వే, బ్రాడ్‌ ఇవాన్స్, విక్టర్‌ న్యాయుచి, చివాంగ.

పిచ్, వాతావరణం
జింబాబ్వే రాజధాని హరారేలోని హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా ఈ వన్డే సిరీస్‌ జరుగనుంది. ఇక బంగ్లాదేశ్‌తో జింబాబ్వే ఇటీవలే ఈ పిచ్‌ మీద ఆడింది. పర్యాటక బంగ్లా నమోదు చేసిన 303, 290 భారీ స్కోర్లను సైతం జింబాబ్వే అవలీలగా ఛేదించింది. దీనిని బట్టి చూస్తే బ్యాటర్లు చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

కాబట్టి పరుగుల వరద పారుతుందడనంలో సందేహం. అభిమానులకు పండగే. ఇక వాతావరణం విషయానికొస్తే.. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు.

టీమిండియా- జింబాబ్వే ముఖాముఖి రికార్డులు:
టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 63 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్‌ 51, జింబాబ్వే 10 గెలిచాయి. మరో రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి.

ఇక జింబాబ్వే గడ్డపై ఆ జట్టుతో 23 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. సొంతగడ్డపై జింబాబ్వే చివరిసారి 2010లో భారత్‌పై వన్డేలో గెలిచింది.

చదవండి: జింబాబ్వేకు బీసీసీఐ ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’... మరో సిరీస్‌ వేటలో భారత్‌! కళ్లన్నీ వాళ్ల మీదే!  
Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..!
IRE VS AFG 5th T20: ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్‌ కైవసం
Deepak Hooda: ప్రపంచ రికార్డుకు చేరువలో దీపక్‌ హుడా.. భారత్‌ తరపున తొలి ఆటగాడిగా

మరిన్ని వార్తలు