IND vs ZIM 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్‌ గురి

22 Aug, 2022 04:50 IST|Sakshi

నేడు జింబాబ్వేతో మూడో వన్డే

మధ్యాహ్నం గం. 12:45 నుంచి

సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

హరారే: ఇప్పటికే 2–0తో సిరీస్‌ సొంతం చేసుకున్న భారత క్రికెట్‌ జట్టు క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వేతో తలపడనుంది. ప్రధాన బౌలర్ల గైర్హాజరీలో దీపక్‌ చహర్, సిరాజ్, శార్దుల్‌ ఠాకూర్, ప్రసిధ్‌ కృష్ణ, అక్షర్‌ పటేల్‌ రాణించి జింబాబ్వేను కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో శుబ్‌మన్‌ గిల్, శిఖర్‌ ధావన్‌ ఆకట్టుకోగా... తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్, ఇషాన్‌ కిషన్‌ ఈ మ్యాచ్‌లో రాణించి ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నారు.

రెండు వన్డేల్లో టాస్‌ గెలిచి జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన కెప్టెన్‌ రాహుల్‌ ఈసారి టాస్‌ గెలిస్తే భారత బ్యాటర్లకు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కోసం తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశముంది. ఇప్పటికే సిరీస్‌ ఫలితం తేలిపోవడంతో ఆఖరి వన్డేలో భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆల్‌రౌండర్‌ షహబాజ్‌ అహ్మద్‌కు తొలిసారి అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. మరోవైపు జింబాబ్వే జట్టు అన్ని విభాగాల్లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోంది. సొంతగడ్డపై భారత జట్టుపై 2010లో చివరిసారి వన్డేలో గెలిచిన జింబాబ్వే మళ్లీ గెలుపు రుచి చూడాలంటే అద్భుతమే చేయాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు