టీమిండియాను విమర్శించిన పాక్‌ అభిమానులు.. కనేరియా దిమ్మతిరిగే కౌంటర్‌!

21 Aug, 2022 15:29 IST|Sakshi
జింబాబ్వేతో రెండో వన్డేలో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌(PC: BCCI)

India Tour Of Zimbabwe 2022- ODI Series- 2nd ODI: జింబాబ్వేతో రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌ను విమర్శించిన పాకిస్తాన్‌ జట్టు అభిమానుల తీరును ఆ దేశ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా తప్పుబట్టాడు. టీమిండియా స్థానంలో గనుక పాక్‌ జట్టు ఉంటే మ్యాచ్‌ను 50వ ఓవర్ల వరకు సాగదీసేదంటూ చురకలు అంటించాడు. కాగా మూడు వన్డేలు ఆడేందుకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా హరారే వేదికగా శనివారం(ఆగష్టు 20) ఇరు జట్లు రెండో వన్డేలో తలపడ్డాయి. టాస్‌ గెలిచిన భారత్‌.. జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టు 161 పరుగులు చేసి 38.1 ఓవర్లకే ఆలౌట్‌ అయింది. 

ఐదు వికెట్లు కోల్పోయి!
ఇక లక్ష్య ఛేదనకు దిగిన రాహుల్‌ సేన 25.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 167 పరుగులు సాధించి జయకేతనం ఎగురువేసింది. అయితే, జింబాబ్వేతో మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కీలక బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితం కావడాన్ని కొంతమంది పాక్‌ అభిమానులు ట్రోల్‌ చేశారు.


డానిష్‌ కనేరియా

మన జట్టు అయితే!
ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్‌ మాజీ లెగ్‌స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా.. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి గెలుపొందడాన్ని చాలా మంది పాకిస్తానీ అభిమానులు విమర్శించారు. నిజానికి.. భారత ఆటగాళ్లు పూర్తి దూకుడైన ఆటతో ముందుకు సాగారు.

సుమారు 25 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశారు. మన జట్టు ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే గనుక 50 ఓవర్ల పాటు తంటాలు పడేది’’ అని కనేరియా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా మొదటి వన్డేలో 10 వికెట్లు, రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు జింబాబ్వేతో సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య సోమవారం(ఆగష్టు 22) నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.

అంతా మీరే చేశారు!
ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మక ఆసియా కప్‌-2022 టోర్నీకి ముందు పాక్‌ కీలక బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది గాయపడిన నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తీరును కనేరియా విమర్శించాడు. విశ్రాంతి ఇవ్వకుండా అతడిని కష్టపెట్టారని.. అందుకే మెగా ఈవెంట్‌కు ముందు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఆగష్టు 27 నుంచి ఆసియా కప్‌ టోర్నీ ఆరంభం కానుండగా.. ఆ మరుసటి రోజు చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌ తలపడనున్నాయి. 

చదవండి: Ind Vs Zim: పాపం.. కనీసం ఆఖరి వన్డేలోనైనా వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లే!
Sanju Samson: అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా అంతే! నాకైతే గొప్పగా అనిపిస్తోంది!

మరిన్ని వార్తలు