Ind Vs Zim 3rd ODI: అదేం బౌలింగ్‌ నాయనా.. ఫ్యాన్స్‌ ఫైర్‌! రజా, ఎవాన్స్‌పై ప్రశంసలు!

23 Aug, 2022 12:26 IST|Sakshi
ఆఖరి వన్డేలో జింబాబ్వే అద్బుత పోరాటం(PC: Zimbabwe Cricket)

India tour of Zimbabwe, 2022- 3rd ODI: జింబాబ్వే పర్యటనలో మొదటి వన్డేలో అలవోకగా విజయం సాధించింది టీమిండియా. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(81 పరుగులు), శుబ్‌మన్‌ గిల్‌(82 పరుగులు) అద్భుత అర్ధ శతకాలతో మెరిసి అజేయంగా నిలవడంతో ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక రెండో వన్డేలో ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసినా లక్ష్య ఛేదనలో భారత్‌ ఐదు వికెట్లు కోల్పోయింది.

అద్భుత ఆట తీరు!
ఆఖర్లో సంజూ శాంసన్‌ 43 పరుగులతో అజేయంగా నిలవడంతో 25.4 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. అయితే, ఆఖరిదైన మూడో వన్డేలో మాత్రం జింబాబ్వే నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. 

ఎవాన్స్‌ అదరగొట్టాడు.. రజా చెలరేగాడు..
టీమిండియా ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(40), కేఎల్‌ రాహుల్‌(30)తో పాటు సెంచరీ హీరో శుబ్‌మన్‌ గిల్‌(130), దీపక్‌ హుడా(1), శార్దూల్‌ ఠాకూర్‌(9) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు జింబాబ్వే బౌలర్‌ బ్రాడ్‌ ఎవాన్స్‌. ఎవాన్స్‌ ఈ స్థాయిలో చెలరేగిన నేపథ్యంలో.. నిజానికి గిల్‌ గనుక విజృంభించి ఉండకపోతే భారత్‌ ఈ మేర భారీ స్కోరు చేసే అవకాశం ఉండేది కాదు. 

ఇక లక్ష్య ఛేదనలోనూ జింబాబ్వే ఆడిన తీరు అద్బుతమనే చెప్పాలి. ముఖ్యంగా ఓపెనర్లు కైటనో, ఇన్నోసెంట్‌ కైయా వికెట్లు త్వరగానే కోల్పోయినా.. ఏమాత్రం పట్టు సడలించలేదు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సీన్‌ విలియమ్స్‌ 45 పరుగులతో రాణించగా.. సికిందర్‌ రజా 95 బంతుల్లో 115 పరుగులు సాధించి విజయంపై ఆశలు రేపాడు.

కానీ మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో 49.3 ఓవర్లకు 276 పరుగులు చేసి ఆతిథ్య జట్టు ఆలౌట్‌ అయింది. దీంతో 13 పరుగుల తేడాతో రాహుల్‌ సేన విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

అదేం బౌలింగ్‌ నాయనా!
అయితే, ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ఆట తీరు పట్ల అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు. కాస్త తేడా వచ్చినా జింబాబ్వే చేతిలో పరాజయం ఎదురయ్యేదని.. ఆతిథ్య జట్టు నిజంగా బెంబేలెత్తించిందని కామెంట్లు చేస్తున్నారు. 

169 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినా రజా అద్బుత పోరాటంతో మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకువచ్చాడని.. మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చినందుకు అతడి ధన్యవాదాలు చెబుతున్నారు. అయితే, అదే సమయంలో ఇంతవరకు రానిచ్చిన భారత బౌలర్ల తీరును కూడా సోషల్‌ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. 

ఎవాన్స్‌, రజాపై ప్రశంసల జల్లు
ఇక మ్యాచ్‌ అనంతరం జింబాబ్వే తాత్కాలిక కెప్టెన్‌ రెగిస్‌ చకబ్వా మాట్లాడుతూ.. ‘‘భారత జట్టుకు శుభాకాంక్షలు. వాళ్లు నిజంగా చాలా బాగా ఆడారు. ముఖ్యంగా రజా.. బ్రాడ్‌ అద్భుత ఆట తీరు కనబరిచారు. మా జట్టు బౌలింగ్‌ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఇది మాకు సానుకూల అంశం. కఠిన పరిస్థితుల్లోనూ మా వాళ్లు ఆడిన తీరు నిజంగా అద్భుతం. మ్యాచ్‌ ఓడినా పటిష్ట జట్టుపై ఇలాంటి ప్రదర్శన పట్ల ఆనందంగా ఉన్నాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు.

చదవండి: Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ! ద్రవిడ్‌ దూరం?!
IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. సచిన్‌ 24 ఏళ్ల రికార్డు బద్దలు!

మరిన్ని వార్తలు