ధవన్‌ను అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మహ్మద్‌ కైఫ్‌ మండిపాటు

17 Aug, 2022 11:44 IST|Sakshi

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా తొలుత శిఖర్‌ ధవన్ పేరును ప్రకటించిన భారత సెలెక్టర్లు.. కొద్ది రోజుల తర్వాత కేఎల్‌ రాహుల్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో సారధ్య బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే ధవన్‌ను రాహుల్‌కు డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) కొనసాగవలసిందిగా కోరారు. 

ధవన్‌ను అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించిన ఈ ఉదంతంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుండగా, తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కూడా స్పందించాడు. ధవన్‌ విషయంలో సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జట్టులో సీనియర్‌ అయిన ధవన్‌ను అంతలా అవమానించడం సరికాదని దుయ్యబట్టాడు. 

రాహుల్ ఫిట్‌గా ఉన్నాడన్న నివేదికలు ఆలస్యంగా వచ్చి ఉంటే, ధవన్‌ నాయకత్వంలో రాహుల్‌ ఆడితే కొంపమునిగేదేం కాదని అభిప్రాయపడ్డాడు. అంతకుముందు విండీస్‌ సిరీస్‌లో టీమిండియాను 3-0 తేడాతో గెలిపించిన ధవన్‌ను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం సమంజసం కాదని అన్నాడు. సరైన కమ్యూనికేషన్‌తో ఈ పరిస్థితి తలెత్తకుండా నివారించి ఉండవచ్చని తెలిపాడు. 

ఆసియా కప్‌‌కు ముందు రాహుల్‌కు ప్రాక్టీస్ అవసరం కాబట్టి, అతన్ని జట్టులో సభ్యుడిగా ఎంపిక చేయడం తప్పేమీ కాదని పేర్కొన్నాడు. ఏది ఏమైనా అకస్మాత్తుగా కెప్టెన్సీ తొలగించడం ధవన్‌ లాంటి సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ విషయంలో సరికాదని చెప్పుకొచ్చాడు. ధవన్‌ కూల్‌ కాండిడేట్‌ కాబట్టి, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయలేదని, వేరే వాళ్ల విషయంలో ఇలాగే జరిగి ఉంటే పెద్ద రచ్చే అయ్యేదని అభిప్రాయపడ్డాడు.
చదవండి: విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్‌.. వైరల్‌ వీడియో
 

మరిన్ని వార్తలు