Sanju Samson: నేను, నా భార్య ఖాళీగా ఉన్నపుడు చేసే పని అదే! నా ముద్దు పేరు..

17 Aug, 2022 12:37 IST|Sakshi
భార్య చారులతతో సంజూ శాంసన్‌(PC: Sanju Samson)

India Vs Zimbabwe ODI Series- Sanju Samson: టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే పర్యాటక దేశానికి చేరుకున్న ఈ కేరళ ఆటగాడు తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ర్యాపిడ్‌ ఫైర్‌ సెషన్‌లో భాగంగా తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది.  

వీడియో ప్రకారం.. పలు ప్రశ్నలకు సంజూ సరదాగా సమాధానమిచ్చాడిలా!
నా ముద్దు పేరు ఏమిటంటే?!
►బప్పు

మీకు ఇష్టమైన ఆహారం? కానీ ఇప్పుడు తినలేకపోతున్నది?
►చాకొలెట్లంటే నాకు ఇష్టం. అయితే, ఈ పర్యటన వల్ల చాలా రోజుల నుంచే అవి తినడం మానేశాను. నిజానికి మా అమ్మ చేతి వంట అంటే నాకు మహాప్రీతి. అయితే, ఇప్పుడు ఇక్కడున్న కారణంగా ఆమె వంటలు తినే పరిస్థితి లేదు కదా!

ఇష్టమైన ప్రదేశాలు
►మా స్వస్థలం కేరళలో నదీజలాలు ఎక్కువ. బీచ్‌లలో సమయం గడపటం అంటే నాకెంతో ఇష్టం.

మీకు ఇష్టమైన ఆటగాడు?
►చాలా మంది ఉన్నారు. వారిలో ఎంఎస్‌ ధోని నా ఫేవరెట్‌.

ఒకవేళ మీకు సూపర్‌ పవర్స్‌ వస్తే!
►నాకు ఇష్టమైన ప్రదేశాలన్నింటిని క్షణకాలంలో చుట్టేసి వస్తా. వెంటనే వాటిని మాయం చేస్తా కూడా! 

టీమిండియా క్రికెటర్లలో ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లను ఆకర్షించే కంటెంట్‌ కలిగి ఉండేది ఎవరు?
►మన సూపర్‌ స్టార్‌ యజువేంద్ర చహల్‌.

ఖాళీగా ఉన్నపుడు మేము చేసే పని అదే!
►నేను, నా భార్య ఇంట్లో ఖాళీగా కూర్చున్నపుడు శిఖర్‌ భాయ్‌ రీల్స్‌ చూస్తూ ఉంటాం. నిజంగా అవెంతో ఆసక్తికరంగానూ.. సరదాగానూ ఉంటాయి. 

2015లో అడుగుపెట్టి..
కాగా 1994, నవంబరు 11న త్రివేండ్రంలోని పల్లువిలలో జన్మించిన సంజూ శాంసన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఎదిగాడు. కుడిచేతి వాటం గల 27 ఏళ్ల సంజూ 2015లో జింబాబ్వేతో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

ఇక గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని జట్టుకు ఎంపికైన సంజూ శాంసన్‌.. వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇటీవలి వెస్టిండీస్‌ టూర్‌లో వన్డే సిరీస్‌లో ఆడిన ఈ కేరళ బ్యాటర్‌.. టీ20 సిరీస్‌లోనూ భాగమయ్యాడు.

అదే విధంగా 2013లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అడుగుపెట్టిన సంజూ.. ప్రస్తుతం రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో బ్యాటర్‌గానూ.. కెప్టెన్‌గానూ కీలక పాత్ర పోషించాడు. 

ఇదిలా ఉంటే.. ప్రతిభావంతుడైన ఆటగాడిగా నిరూపించుకున్నప్పటికీ సంజూకు టీమిండియాలో తగినన్ని అవకాశాలు రాలేదనే చెప్పాలి. పలు సందర్భాల్లో అతడు రాణించినప్పటికీ సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. దీంతో.. అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తూ సంజూకు మద్దతుగా నిలిచారు.

కాగా జింబాబ్వే టూర్‌కు ఎంపికైన సంజూ.. ఆసియా కప్‌-2022 ఆడే భారత జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక సంజూ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... తన స్నేహితురాలు చారులతను ప్రేమించిన అతడు 2018, డిసెంబరులో ఆమెను వివాహమాడాడు.

చదవండి: Ind VS Zim 1st ODI: ఓపెనర్లుగా వాళ్లిద్దరే! ఇషాన్‌కు నో ఛాన్స్‌! త్రిపాఠి అరంగేట్రం!
India Tour Of Zimbabwe: విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్‌

మరిన్ని వార్తలు