Ind Vs Zim ODI Series: జింబాబ్వేకు పయనమైన టీమిండియా ఆటగాళ్లు..

13 Aug, 2022 13:52 IST|Sakshi
కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌- ప్రసిద్‌ కృష్ణ, దీపక్‌ చహర్‌, శిఖర్‌ ధావన్‌(PC: BCCI)

Ind Vs Zim ODI Series: వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న భారత క్రికెట్‌ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం జింబాబ్వేకు పయనమయ్యారు. శిఖర్‌ ధావన్‌, దీపక్‌ చహర్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తదితరులు విమానంలో బయల్దేరారు. 

వీరితో పాటు కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో టీమిండియాను విజేతగా నిలిపిన శిఖర్‌ ధావన్‌ను తొలుతు జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కోలుకోవడంతో.. గబ్బర్‌ను తప్పించి అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఈ పర్యటనలో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు బదులు వీవీఎస్‌ లక్ష్మణ్‌ భారత జట్టుకు మార్గరదర్శనం చేయనున్నాడు. జింబాబ్వే సిరీస్‌కు, ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌-2022 టోర్నీకి మధ్య తక్కువ వ్యవధి ఉండటమే ఇందుకు కారణం. 

ఇక హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18న మొదటి వన్డే, ఆగష్టు 20న రెండో వన్డే, ఆగష్టు 22న మూడో వన్డే జరుగనున్నాయి. కాగా ఇటీవల స్వదేశంలో జింబాబ్వే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తమ దేశంలో పర్యటించిన బంగ్లాదేశ్‌కు షాకిస్తూ టీ20, వన్డే సిరీస్‌లను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు సైతం గట్టి పోటీనిస్తామంటూ జింబాబ్వే కోచ్‌ డేవిడ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌.. జట్టు ఇదే

మరిన్ని వార్తలు