Ind-W Vs Aus-W: 30 ఏళ్ల తర్వాత... తొలిసారిగా..

4 Oct, 2021 07:45 IST|Sakshi

ఆస్ట్రేలియాతో టెస్టును ‘డ్రా’గా ముగించిన భారత మహిళల జట్టు

Ind W Vs Aus W Pink Ball Test: భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన ఏకైక డే–నైట్‌ ‘పింక్‌ బాల్‌’ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ను భారత్‌ ‘డ్రా’గా ముగించడం విశేషం. 1991 జనవరిలో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌ను భారత్‌ చివరిసారి ‘డ్రా’ చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లో భారత్‌ ఓడిపోయింది.

తాజా టెస్టులో మ్యాచ్‌ చివరి రోజు ఆస్ట్రేలియాకు భారత్‌ 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 32 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 2 వికెట్లకు 36 పరుగులు చేసింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 143/4తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 96.4 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

ఈ క్రమంలో.... 136 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 37 ఓవర్లలో 3 వికెట్లకు 135 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. షఫాలీ వర్మ (52; 6 ఫోర్లు), స్మృతి మంధాన (31; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన 25 ఏళ్ల స్మృతి మంధాన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును అందుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ గురువారం నుంచి మొదలవుతుంది.   

మరిన్ని వార్తలు