వహ్వా అనిపించిన కోహ్లి.. వారిద్దరు ఉసూరుమనిపించినా!

29 Mar, 2021 14:37 IST|Sakshi
విరాట్‌ కోహ్లి- శార్దూల్‌ ఠాకూర్‌(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

పట్టలేరకున్న క్యాచ్‌లు పట్టారు.. పడతారనుకున్నవి వదిలేశారు!

పుణె: టీమిండియా- ఇంగ్లండ్‌ ఆఖరి వన్డేలో కొంతమంది భారత ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడిచిన విధానం అభిమానులకు చిరాకు తెప్పించింది. ముఖ్యంగా గెలుపుపై కోహ్లి సేన ధీమాగా ఉన్న సమయంలో చెలరేగి ఆడుతూ మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చిన సామ్‌ కరన్‌ ఇచ్చిన క్యాచ్‌ను నటరాజన్‌ డ్రాప్‌ చేయగానే చాలా మంది తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడుతున్న సమయంలో 49వ ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్‌‌, నటరాజన్‌ చేసిన తప్పిదాలు ఫ్యాన్స్‌ సహనానికి పరీక్ష పెట్టాయి. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో మార్క్‌వుడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను శార్దూల్‌, సామ్‌ కరన్‌ ఇచ్చిన క్యాచ్‌ను నటరాజన్‌ డ్రాప్‌ చేశారు.  అయితే, ఆ వెంటనే నటరాజన్‌ బౌలింగ్‌లో సింగిల్స్‌ తీసే క్రమంలో వుడ్‌ రనౌట్‌ కాగానే అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఇక మ్యాచ్‌లో పలు కీలక క్యాచ్‌లు జారవిడిచినప్పటికీ, అదే సమయంలో ఓపెనర్‌ శిఖర్ ధావన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పట్టిన అద్భుతమైన క్యాచ్‌లు ప్రేక్షకులకు అంతే థ్రిల్‌ను ఇచ్చాయి కూడా. స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను ధావన్‌(పదకొండో ఓవర్‌లో), ఆదిల్‌ రషీద్‌ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి ఒడిసిపట్టారు. ముఖ్యంగా, 40 ఓవర్‌లో శార్దూల్‌ బౌలింగ్‌లో కోహ్లి పట్టిన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. తద్వారా మ్యాచ్‌ మరోసారి టీమిండియా చేతుల్లోకి వచ్చినట్లయింది. ఎనిమిదో వికెట్‌గా ఆదిల్‌ వెనుదిరగడంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. ఇ​క వీటితో పాటు మొయిన్‌ అలీని హార్దిక్‌ పాండ్యా క్యాచ్‌ రూపంలో అవుట్‌ చేసిన తీరు కూడా హైలెట్‌ అయ్యింది. కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లి సేన, మూడో వన్డేలో 7 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ల విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. 

చదవండి: స్టోక్స్‌ అవుట్‌.. హార్దిక్‌​ రియాక్షన్‌ మామూలుగా లేదుగా!
ఆ నిర్ణయం చూసి షాక్‌కు‌ గురైన విరాట్‌ కోహ్లి !

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు