భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సమర్‌ బెనర్జీ మృతి

21 Aug, 2022 04:48 IST|Sakshi

కోల్‌కతా: అలనాటి మేటి ఫుట్‌బాలర్, 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సమర్‌ ‘బద్రూ’ బెనర్జీ కన్ను మూశారు. 92 ఏళ్ల సమర్‌ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. హైదరాబాదీ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ కోచ్‌గా, సమర్‌ బెనర్జీ కెప్టెన్‌గా మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ ఆడిన భారత్‌ 4–2తో ఆస్ట్రేలియాను ఓడించింది.

సెమీస్‌లో 1–4తో యుగోస్లావియా చేతిలో ఓడిన భారత్‌...  కాంస్య పతక మ్యాచ్‌లో 0–3తో బల్గేరియా చేతిలో ఓడిపోయింది. దేశవాళీ ఫుట్‌బాల్‌లో విఖ్యాత మోహన్‌ బగాన్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన సమర్‌ బెనర్జీ తన క్లబ్‌ జట్టుకు డ్యూరాండ్‌ కప్‌ (1953), రోవర్స్‌ కప్‌ (1955)లలో విజేతగా నిలిపారు. జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ సంతోష్‌ ట్రోఫీలో బెంగాల్‌ జట్టుకు రెండుసార్లు (1953, 1955) టైటిల్‌ అందించారు. అనంతరం సమర్‌ కోచ్‌గా మారి 1962లో బెంగాల్‌ జట్టు ఖాతాలో మరోసారి సంతోష్‌ ట్రోఫీని చేర్చారు. 

మరిన్ని వార్తలు