IND Vs NZ: మొదటి రోజు దుమ్ములేపిన భారత బ్యాటర్‌లు.. తొలి మ్యాచ్‌లోనే అయ్యర్ అర్ధ సెంచరీ

26 Nov, 2021 05:02 IST|Sakshi
గిల్, శ్రేయస్, జడేజా

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 258/4

అయ్యర్, గిల్, జడేజా అర్ధ సెంచరీలు

రాణించిన జేమీసన్‌

కాన్పూర్‌ టెస్టు మ్యాచ్‌  

టెస్టుల్లో సొంతగడ్డపై టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ అంటే భారత్‌కు తిరుగులేదనేది వాస్తవం...అయితే గ్రీన్‌ పార్క్‌లో మందకొడిగా ఉన్న పిచ్, తక్కువ ఎత్తులో వస్తున్న బంతితో టీమిండియా కూడా స్వేచ్ఛగా ఆడలేకపోయింది... జేమీసన్‌ పదునైన బౌలింగ్‌తో ఒక దశలో బ్యాటింగ్‌లో కొంత తడబాటు కూడా కనిపించింది...అయితే మూడో సెషన్‌లో చక్కటి ఆటతో మొదటి రోజును భారత్‌ మెరుగైన స్థితిలో ముగించింది. గిల్, జడేజాలతో పాటు అరంగేట్రంలోనే అయ్యర్‌ సాధించిన అర్ధ సెంచరీతో న్యూజిలాండ్‌పై తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. కివీస్‌ ముగ్గురు స్పిన్నర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

కాన్పూర్‌: భారత్, న్యూజిలాండ్‌ మధ్య గురువారం తొలి టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. భారత్‌ సాధించిన పరుగులు చూస్తే తక్కువగానే కనిపిస్తున్నా... పరిస్థితులను బట్టి చూస్తే దీనిని మొదటి రోజు సురక్షిత స్కోరుగానే పరిగణించవచ్చు. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.  కొత్త ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (136 బంతుల్లో 75 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (93 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రవీంద్ర జడేజా (100 బంతుల్లో 50 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి సీమర్‌ కైల్‌ జేమీసన్‌ (3/47) భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.  

శుబ్‌మన్‌ అర్ధ శతకం
భారత్‌ బ్యాటింగ్‌ మొదలయ్యాక ఎనిమిదో ఓవర్లోనే మయాంక్‌ అగర్వాల్‌ (13) అవుటయ్యాడు. జేమీసన్‌ నుంచి దూసుకొచ్చిన బంతి మయాంక్‌ బ్యాట్‌కు తాకీతాకనట్లుగా కీపర్‌ బ్లండెల్‌ చేతుల్లో పడింది. అనంతరం చతేశ్వర్‌ పుజారా (88 బంతుల్లో 26; 2 ఫోర్లు) క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో మరో వికెట్‌ కోసం కివీస్‌ బౌలర్ల ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి.  పుజారా నెమ్మదిగా ఆడితే... గిల్‌ మాత్రం చూడచక్కని బౌండరీలతో స్కోరుబోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే అతను 81 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా 82/1 స్కోరు వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు. గిల్‌ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎల్బీకి అవకాశం ఉన్నా... కివీస్‌ అప్పీల్‌ కూడా చేయలేదు. రీప్లేలో అది కచ్చితంగా అవుట్‌ అయ్యేదని తేలింది.  

బెదరగొట్టిన జేమీసన్‌
ఈ సెషన్‌లో ఆట రూటు మారింది. అప్పటి దాకా పరుగుల బాట పట్టగా... సీమర్‌ జేమీసన్‌ బౌలింగ్‌తో కీలకవికెట్లను కోల్పోయి భారత్‌ కష్టాల్లో పడింది. లంచ్‌ తర్వాత మొదలైన తొలి ఓవర్లోనే క్లీన్‌బౌల్డ్‌ చేసి గిల్‌ ఆటను జెమీసన్‌ ముగించాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటిన కాసేపటికే భారత్‌ను సౌతీ మరో దెబ్బ తీశాడు. క్రీజులో పాతుకుపోయిన పుజారాను కీపర్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో రహానేకు అయ్యర్‌ జతయ్యాడు. రహానే బౌండరీలతో అలరించినా, అతని ఆట ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 145 పరుగుల వద్ద అతన్ని జేమీసన్‌ బౌల్డ్‌ చేశాడు. అలా నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయిన భారత్‌ ఆత్మరక్షణలో పడింది. 154/4 వద్ద టీ బ్రేక్‌ తీసుకున్నారు.

ఆదుకున్న అయ్యర్, జడేజా  
శ్రేయస్, జడేజా ఇద్దరు ప్రత్యర్థి పేస్, స్పిన్‌ బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కోవడంతో మూడో సెషన్‌ బ్యాటింగ్‌ వైపు మళ్లింది. శ్రేయస్‌ అయ్యర్‌ ఆదుకునే టెస్టు ఇన్నింగ్స్‌ ఆడాడు. నిలబడిన తీరు, ఎంచుకున్న ప్లేస్‌మెంట్స్, కచ్చితమైన షాట్లు అతన్ని, జట్టును నిలబెట్టాయి. ఈ క్రమంలోనే 94 బంతుల్లో (6 ఫోర్లు) అయ్యర్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 68వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. న్యూజిలాండ్‌ కొత్త బంతి తీసుకున్నా... క్రీజులో పాగా వేసిన ఈ జోడీని ఏమీ చేయలేకపోయింది. స్పిన్నర్లు ఎజాజ్‌ పటేల్, సొమర్‌విల్లే బౌలింగ్‌లో అయ్యర్‌ భారీ సిక్సర్లు బాదాడు. వేగం పెరగడంతో 82వ ఓవర్లో భారత్‌ స్కోరు 250కి చేరింది. మరోవైపు జడేజా కూడా 99 బంతుల్లో (6 ఫోర్లు) టెస్టుల్లో 17వ అర్ధసెంచరీ పూర్తిచేశాడు. ఇద్దరు కలిసి అబేధ్యమైన ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించారు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌  (సి) బ్లండెల్‌ (బి) జేమీసన్‌ 13;  గిల్‌ (బి) జేమీసన్‌ 52; పుజారా (సి) బ్లండెల్‌ (బి) సౌతీ 26; రహానే (బి) జేమీసన్‌ 35; శ్రేయస్‌ (బ్యాటింగ్‌) 75; జడేజా (బ్యాటింగ్‌) 50; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (84 ఓవర్లలో 4 వికెట్లకు) 258.
వికెట్ల పతనం: 1–21, 2–82, 3–106, 4–145.
బౌలింగ్‌: సౌతీ 16.4–3–43–1, జేమీసన్‌ 15.2–6–47–3, ఎజాజ్‌ 21–6–78–0, సొమర్‌విల్లే 24–2–60–0, రచిన్‌ రవీంద్ర 7–1–28–0.  

శ్రేయస్‌ అయ్యర్‌ @ 303
భారత్‌ తరఫున 22 వన్డేలు, 32 టి20లు ఆడిన తర్వాత ముంబై బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు టెస్టు క్రికెట్‌ ఆడే అవకాశం దక్కింది. కాన్పూర్‌ టెస్టుతో అరంగేట్రం చేసిన అయ్యర్‌ ఈ ఫార్మాట్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 303వ ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు 54 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 52.18 సగటుతో పాటు ఏకంగా 81.53 స్ట్రైక్‌రేట్‌తో 4592 పరుగులు చేసిన ఘనత శ్రేయస్‌ సొంతం. ప్రస్తుత క్రికెటర్లలో 50కు పైగా సగటుతో కనీసం 4 వేలకు పైగా పరుగులు సాధించినవారిలో 80కి పైగా స్ట్రైక్‌ రేట్‌ ఉన్న ఆటగాడు అయ్యర్‌ ఒక్కడే కావడం విశేషం.  

మరిన్ని వార్తలు