India vs England: అద్భుతంనుంచి అగాధానికి...

26 Aug, 2021 05:08 IST|Sakshi
కోహ్లిని అవుట్‌ చేసిన అండర్సన్‌ గర్జన

హెడింగ్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 78 ఆలౌట్‌

నిప్పులు చెరిగిన అండర్సన్‌ 

ఇంగ్లండ్‌ 120/0

లార్డ్స్‌ టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతో అరుదైన విజయాన్ని అందుకున్న భారత జట్టు అంతలోనే అయ్యో అనిపించే ప్రదర్శన కనబర్చింది. ఇంగ్లండ్‌ పేసర్లు నిప్పులు చెరుగుతుండగా, ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే మన జట్టు ఆట ముగిసిపోయింది. ముఖ్యంగా గత మ్యాచ్‌ అనుభవం తాలూకు కసినంతా ప్రదర్శిస్తూ అండర్సన్‌ టీమిండియా ను దెబ్బకొట్టాడు. అనంతరం వికెట్‌ కోల్పోకుండా మన స్కోరును దాటేసిన ఇంగ్లండ్‌ తొలి రోజును ఘనంగా ముగించింది.

లీడ్స్‌: తొలి రోజు భారత్‌ బ్యాటింగ్‌ను చూస్తే... లార్డ్స్‌లో గెలిచిన జట్టు ఇదేనా అన్న అనుమానం కలగక మానదు. అంత నిర్లక్ష్యం టీమిండియా ఆటతీరులో కనిపించింది. బుధవారం మొదలైన మూడో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 40.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. రోహిత్‌ శర్మ (105 బంతుల్లో 19; 1 ఫోర్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, అండర్సన్‌ (8–5–6– 3) నిప్పులు చెరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఓపెనర్లతోనే భారత ఇన్నింగ్స్‌ స్కోరును అధిగమించేసింది. ఆట నిలిచే సమయానికి 42 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. బర్న్స్‌ (52 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), హమీద్‌ (60 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 42 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఐదో బంతి నుంచి ఆలౌట్‌ దాకా...
సిరీస్‌లో ఆధిక్యం... జట్టులో ఆత్మవిశ్వాసం... ఇంకేం మూడో టెస్టులోనూ పైచేయి సాధించేయొచ్చులే అన్న ధీమా ఐదో బంతికే డీలా పడింది. తొలి ఓవర్‌ వేసిన అండర్సన్‌ ఐదో బంతికే రాహుల్‌ (0)ను డకౌట్‌ చేశాడు. మళ్లీ తనే ఐదో ఓవర్లో చతేశ్వర్‌ పుజారా (1), కొంత విరామం తర్వాత 11వ ఓవర్లో కెప్టెన్‌ కోహ్లి (7)ని పెవిలియన్‌ చేర్చాడు. లంచ్‌ విరామానికి ముందు రాబిన్సన్‌ బౌలింగ్‌లో రహానే కూడా బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 56/4 స్కోరు వద్ద లంచ్‌బ్రేక్‌కు వెళ్లింది.

67/5.... 67/9
జరిగిందేదో జరిగింది! రెండో సెషన్‌లో భారత్‌ చక్కబడదా! పైగా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ ఉండనే ఉన్నాడు. అని సరిపెట్టుకున్న స్థైర్యం చెల్లాచెదురయ్యేందుకు... భారత్‌ ఆలౌట్‌ అయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. లంచ్‌ అయిన వెంటనే రిషభ్‌ పంత్‌ (2) అవుటయ్యాడు. 36 ఓవర్లలో భారత్‌ స్కోరు 67/5. ఇంగ్లీష్‌ పేస్‌ తుఫాను ఇంకా ముగిసిపోలేదు. ఓవర్టన్‌ (37వ ఓవర్‌), స్యామ్‌ కరన్‌ (38వ ఓవర్‌) ఇద్దరు ఒక్కో ఓవర్లో రెండేసి వికెట్లను పడేశారు. దెబ్బకు 67/9...‘సున్నా’ పరుగుల వ్యవధిలో 12 బంతుల్లో భారత్‌ 4 వికెట్లు కోల్పోయింది. మిగిలిపోయిన ఆఖరి వికెట్‌ లాంఛనాన్ని ఓవర్టనే సిరాజ్‌ను అవుట్‌ చేయడం ద్వారా పూర్తి చేశాడు. లంచ్‌ తర్వాత 14.5 ఓవర్లు ఆడిన భారత్‌ 22 పరుగులు చేసి మిగిలిన 6 వికెట్లను సమర్పించుకుంది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) రాబిన్సన్‌ (బి) ఓవర్టన్‌ 19; రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 0; పుజార (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 1; కోహ్లి (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 7; రహానే (సి) బట్లర్‌ (బి) రాబిన్సన్‌ 18; పంత్‌ (సి) బట్లర్‌ (బి) రాబిన్సన్‌ 2; జడేజా (ఎల్బీ) (బి) కరన్‌ 4; షమీ (సి) బర్న్స్‌ (బి) ఓవర్టన్‌ 0; ఇషాంత్‌ నాటౌట్‌ 8; బుమ్రా (ఎల్బీ) (బి)  కరన్‌ 0; సిరాజ్‌ (సి) రూట్‌ (బి) ఓవర్టన్‌ 3; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (40.4 ఓవర్లలో ఆలౌట్‌) 78.
వికెట్ల పతనం: 1–1, 2–4, 3–21, 4–56, 5–58, 6–67, 7–67, 8–67, 9–67, 10–78.
బౌలింగ్‌: అండర్సన్‌ 8–5–6–3, రాబిన్సన్‌ 10–3–16–2, స్యామ్‌ కరన్‌ 10–2–27–2, మొయిన్‌ అలీ 2–0–4–0, ఓవర్టన్‌ 10.4–5–14–3.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ బ్యాటింగ్‌ 52; హమీద్‌ బ్యాటింగ్‌ 60; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా) 120.
బౌలింగ్‌: ఇషాంత్‌ 7–0–26–0, బుమ్రా 12–5–19–0, షమీ 11–2–39–0, సిరాజ్‌ 7–1–26–0, జడేజా 5–3–6–0.
 

మరిన్ని వార్తలు