మనదే పైచేయి...

9 Jan, 2021 05:09 IST|Sakshi
జడేజాకు సహచరుల అభినందన

నేడు పట్టు బిగిస్తే పండగే...

ప్రస్తుతం భారత్‌ 96/2

శుబ్‌మన్‌ గిల్‌ అర్ధ సెంచరీ

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 338 ఆలౌట్‌

స్టీవ్‌ స్మిత్‌ శతకం

రవీంద్ర జడేజాకు 4 వికెట్లు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో రెండో రోజు భారత్‌ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (101 బంతుల్లో 50; 8 ఫోర్లు), రోహిత్‌ శర్మ (26) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించి వెనుదిరగ్గా... ప్రస్తుతం పుజారా (9 బ్యాటింగ్‌), రహానే (5 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ మరో 242 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 166/2తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (226 బంతుల్లో 131; 16 ఫోర్లు) శతకం పూర్తి చేసుకోగా, లబ్‌షేన్‌ (196 బంతుల్లో 91; 11 ఫోర్లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా...బుమ్రా, సైనీ చెరో 2 వికెట్లు తీశారు.  

జడేజా జోరు...
భారీ స్కోరు లక్ష్యంగా రెండో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా స్మిత్‌ మినహా మిగతా వారంతా పరుగులు చేయడానికి ఇబ్బంది పడి ఒత్తిడిలో వికెట్లు చేజార్చుకున్నారు. శుక్రవారం 11 ఓవర్ల ఆట తర్వాత వానతో స్వల్ప విరామం వచ్చింది. అయితే ఆ తర్వాత సెంచరీ దిశగా సాగుతున్న లబ్‌షేన్‌ను చక్కటి బంతితో అవుట్‌ చేసి జడేజా 100 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. కొద్దిసేపటికే జడేజా బౌలింగ్‌లోనే ముందుకొచ్చి ఆడబోయి వేడ్‌ (13) వెనుదిరిగాడు. ఈ దశలో వర్షం కారణంగా మళ్లీ 23 నిమిషాలు ఆట సాగలేదు. అనంతరం కొత్త బంతితో బుమ్రా చెలరేగిపోయాడు. గ్రీన్‌ (0)ను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్న అతను... కెప్టెన్‌ పైన్‌ (1) స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. కమిన్స్‌ (0) కూడా పెవిలియన్‌ చేరడంతో ఆసీస్‌ కష్టాలు పెరిగాయి. ఈ దశలో మిషెల్‌ స్టార్క్‌ (30 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొంత దూకుడుగా ఆడి స్మిత్‌కు సహకరించాడు. అయితే స్టార్క్‌ను షార్ట్‌ బంతితో సైనీ అవుట్‌ చేసిన తర్వాత ఆసీస్‌ ఆలౌట్‌ అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.  

రోహిత్‌ వర్సెస్‌ లయన్‌
సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ జాగ్రత్తగా ఆడాడు. ముఖ్యంగా ఆఫ్‌స్పిన్నర్‌ లయన్‌తో అతని పోరు ఆసక్తికరంగా సాగింది. లయన్‌ తొలి ఆరు ఓవర్లను పూర్తిగా రోహిత్‌ ఒక్కడే ఎదుర్కొన్నాడు. ఈ 42 బంతుల్లో ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించగా... 4 మెయిడిన్‌ ఓవర్లు వేసిన లయన్‌ 14 పరుగులు ఇచ్చాడు. లయన్‌ రెండో ఓవర్లోనే ముందుకు దూసుకొచ్చి లాంగాన్‌ మీదుగా రోహిత్‌ భారీ సిక్సర్‌ కొట్టాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై రోహిత్‌కు 100వ సిక్సర్‌ కావడం విశేషం. అదే ఓవర్లో రోహిత్‌ మరో ఫోర్‌ కూడా కొట్టాడు. రోహిత్‌ స్కోరు 24 వద్ద అంపైర్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడంతో లయన్‌లో ఆనందం కనిపించింది. అయితే రివ్యూలో అది నాటౌట్‌గా తేలింది. చివరకు హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో అతనికే సునాయాస క్యాచ్‌ ఇచ్చి భారత ఓపెనర్‌ వెనుదిరిగాడు. శుక్రవారం 30వ పుట్టిన రోజు జరుపుకున్న హాజల్‌వుడ్‌కు ఇది 300వ అంతర్జాతీయ వికెట్‌.  

గిల్‌ వర్సెస్‌ కమిన్స్‌  
తన తొలి టెస్టులోనే చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న శుబ్‌మన్‌ గిల్‌ దానిని ఇక్కడా కొనసాగించాడు. ముఖ్యంగా వరల్డ్‌ నంబర్‌వన్‌ బౌలర్‌ కమిన్స్‌ను అతను సమర్థంగా ఎదుర్కొన్న తీరు అభినందనీయం. కమిన్స్‌ తొలి 7 ఓవర్లను గిల్‌ ఒక్కడే ఆడాడు. ముఖ్యంగా ఆఫ్‌ సైడ్‌లో పడిన షార్ట్‌ బంతిని చివరి క్షణంలో పాయింట్‌ దిశగా ఆడి అతను బౌండరీగా మలచిన షాట్‌ ఇన్నింగ్స్‌కే ఆకర్షణగా నిలిచింది. స్టార్క్, లయన్‌ బౌలింగ్‌లలో కూడా గిల్‌ చూడచక్కటి ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో 100 బంతుల్లో అతను తన కెరీర్‌ తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే కమిన్స్‌ బౌలింగ్‌లోనే గిల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఇద్దరూ ఓపిగ్గా...
శుభారంభం తర్వాత 15 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోవడంతో భారత్‌ ఆత్మ రక్షణలో పడింది. మరో వికెట్‌ చేజార్చుకుంటే జట్టు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉండటంతో పుజారా, రహానే చాలా జాగ్రత్తగా ఆడారు. పరుగులు తీయడంకంటే వికెట్‌ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా 12.5 ఓవర్లలో వీరిద్దరు 11 పరుగులు మాత్రమే జోడించగలిగారు! ఆసీస్‌ బౌలర్లు కూడా చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను కొనసాగిస్తూ ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం కూడా దీనికి కారణం.

స్మిత్‌ సూపర్‌...!
‘స్టీవ్‌ స్మిత్‌కు నేను కోచింగ్‌ ఇవ్వడం ఏమిటి... తనకు తానే అతను కోచింగ్‌ ఇచ్చుకుంటాడు. అదే అన్నింటికంటే బాగా పని చేస్తుంది చూడండి’... సిడ్నీ టెస్టు ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ చేసిన వ్యాఖ్య ఇది. నిజానికి స్మిత్‌ గొప్పతనం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అతను సాధించిన పరుగులు, రికార్డులు దానిని చూపిస్తాయి. అయితే తొలి రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యంతో ఒక్కసారిగా అతనిపై విమర్శలు మొదలయ్యాయి.

ముఖ్యంగా అశ్విన్‌ బౌలింగ్‌లో అతను అవుటైన తీరు ఆశ్చర్యం కలిగించింది. అయితే గొప్ప ఆటగాళ్లు తమ తప్పులు సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరని స్మిత్‌ తన ఇన్నింగ్స్‌తో నిరూపించాడు.  మొదటి రోజున ఆత్మవిశ్వాసంతో ఆడి 31 పరుగులతో ముగించిన అతను... శుక్రవారం బుమ్రా బౌలింగ్‌లో చూడచక్కటి కవర్‌ డ్రైవ్‌ బౌండరీతో మొదలు పెట్టాడు. ఆకట్టుకునే డ్రైవ్‌లు, తనదైన ట్రేడ్‌మార్క్‌ ఫ్లిక్‌ షాట్‌లతో చకచకా దూసుకుపోయాడు. భారత్‌ కొత్త బంతి తీసుకునే సమయానికి 142 బంతులు ఎదుర్కొన్న స్మిత్‌ 7 బంతులను మాత్రమే అవీ ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా వెళుతున్న వాటినే వదిలేశాడంటే అతను ఎంత సాధికారికంగా ఆడాడో చెప్పవచ్చు.

సైనీ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఆడి మూడు పరుగులు తీయడంతో 201 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. ఈ మాజీ కెప్టెన్‌ కెరీర్‌లో ఇది 27వ శతకం కాగా, భారత్‌పై ఎనిమిదోది. సెంచరీ మార్క్‌ చేరగానే అతను భావోద్వేగాలు దాచుకోలేకపోయాడు. గాల్లోకి బ్యాట్‌కు పంచ్‌లు విసురుతూ సింహనాదం చేయడం చూస్తే అతని దృష్టిలో ఈ ఇన్నింగ్స్‌ విలువేమిటో అర్థమవుతుంది. సెంచరీ తర్వాతా స్మిత్‌ జోరు చూస్తే అతడిని అవుట్‌ చేయడం ఇక ఏ భారత బౌలర్‌ వల్ల కాదనిపించింది. చివరకు అదే జరిగినట్లు రనౌట్‌తో మాత్రమే అతను వెనుదిరగాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా నాలుగో వికెట్‌ కోల్పోయిన తర్వాత 106 పరుగులు చేస్తే అందులో స్మిత్‌ చేసినవే 71 పరుగులు ఉండటం విశేషం.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: పకోవ్‌స్కీ (ఎల్బీ) (బి) సైనీ 62; వార్నర్‌ (సి) పుజారా (బి) సిరాజ్‌ 5; లబ్‌షేన్‌ (సి) రహానే (బి) జడేజా 91; స్మిత్‌ (రనౌట్‌) 131; వేడ్‌ (సి) బుమ్రా (బి) జడేజా 13; గ్రీన్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 0; పైన్‌ (బి) బుమ్రా 1; కమిన్స్‌ (బి) జడేజా 0; స్టార్క్‌ (సి) గిల్‌ (బి) సైనీ 24; లయన్‌ (ఎల్బీ) (బి) జడేజా 0; హాజల్‌వుడ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్‌) 338  
వికెట్ల పతనం: 1–6, 2–106, 3–206, 4–232, 5–249, 6–255, 7–278, 8–310, 9–315, 10–338.
బౌలింగ్‌: బుమ్రా 25.4–7–66–2, సిరాజ్‌ 25–4–67–1, అశ్విన్‌ 24–1–74–0, సైనీ 13–0–65–2, జడేజా 18–3–62–4.  

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి అండ్‌ బి) హాజల్‌వుడ్‌ 26; గిల్‌ (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 50; పుజారా (బ్యాటింగ్‌) 9; రహానే (బ్యాటింగ్‌) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (45 ఓవర్లలో 2 వికెట్లకు) 96  
వికెట్ల పతనం: 1–70, 2–85.
బౌలింగ్‌: స్టార్క్‌ 7–4–19–0, హాజల్‌వుడ్‌ 10–5–23–1, కమిన్స్‌ 12–6–19–1, లయన్‌ 16–7–35–0

మరిన్ని వార్తలు