సంయుక్త విజేతలుగా భారత్, రష్యా

31 Aug, 2020 02:23 IST|Sakshi

ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌

చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ వివాదాస్పద రీతిలో ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌ ముగిసింది. భారత్, రష్యా జట్లను సంయుక్త విజేతలుగా అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. రెండు మ్యాచ్‌లతో కూడిన ఫైనల్లో తొలి మ్యాచ్‌లో ఆరు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇరు జట్లూ 3–3తో సమంగా నిలిచాయి. ఫైనల్లోని రెండో మ్యాచ్‌ సందర్భంగా ఇద్దరు భారత క్రీడాకారులు నిహాల్‌ సరీన్, దివ్య దేశ్‌ముఖ్‌లకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పోవడం.... చివరకు సమయాభావం వల్ల వారు గేమ్‌లను వదులుకోవాల్సి జరిగింది. దాంతో రష్యా 4.5–1.5తో ఈ మ్యాచ్‌ను గెలిచింది. మ్యాచ్‌లో విజయానికి 2 పాయింట్లు, ‘డ్రా’ అయితే చెరో పాయింట్‌ ఇస్తారు. ఫలితంగా రష్యా ఓవరాల్‌గా 3–1తో విజయం సాధించినట్లయింది. అయితే విజయావకాశాలు ఉన్నదశలో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పోయిన కారణంగానే తాము గేమ్‌లు కోల్పోవాల్సి వచ్చిందని ‘ఫిడే’ అప్పీల్‌ కమిటీకి భారత్‌ అప్పీల్‌ చేసింది.

అప్పీల్‌ను విచారించిన అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) అధ్యక్షడు అర్కాడీ ద్వోర్‌కోవిచ్‌ (రష్యా) అన్ని అంశాలను పరిశీలించి, భారత అప్పీల్‌ సరైనదేనని భావిస్తూ రెండో మ్యాచ్‌ ఫలితాన్ని పూర్తిగా రద్దు చేశారు. తొలి మ్యాచ్‌ సమంగా ముగియడంతో రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. స్వర్ణం గెలిచిన భారత బృందంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ ఉన్నారు. టోర్నీ మొత్తంలో హంపి, హారిక నిలకడగా ఆడి భారత్‌కు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించారు. పోలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హంపి టైబ్రేక్‌ గేమ్‌లో గెలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. ప్రపంచ మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్, విదిత్‌ సంతోష్‌ గుజరాతి, నిహాల్‌ సరీన్, అరవింద్‌ చిదంబరం, ప్రజ్ఞానంద, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, భక్తి కులకర్ణి, వంతిక అగర్వాల్‌ మిగతా సభ్యులుగా ఉన్నారు.  

రష్యాతో జరిగిన ఫైనల్‌ తొలి మ్యాచ్‌లో విదిత్‌–నెపోమ్‌నియాచి (37 ఎత్తులు); హరికృష్ణ–అర్తెమీవ్‌ (54 ఎత్తులు); హంపి–కాటరీనా లాగ్నో (48 ఎత్తులు); హారిక–అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (48 ఎత్తులు); ప్రజ్ఞానంద–అలెక్సీ సరానా (56 ఎత్తులు); దివ్య–షువలోవా (51 ఎత్తులు) గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. రెండో మ్యాచ్‌లో విశ్వనాథన్‌ ఆనంద్‌–నెపోమ్‌నియాచి; విదిత్‌–దుబోవ్‌; హారిక–కొస్టెనిక్‌ గేమ్‌లు ‘డ్రా’గా ముగియగా... హంపి 88 ఎత్తుల్లో గోర్యాచిక్నా చేతిలో; దివ్య 25 ఎత్తుల్లో షువలోవా చేతిలో; నిహాల్‌ సరీన్‌ 25 ఎత్తుల్లో ఎసిపెంకో చేతిలో ఓడిపోయారు. దివ్య గెలిచే స్థితిలో, నిహాల్‌ ‘డ్రా’ చేసుకునే స్థితిలో ఉన్నపుడు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పోవడం, ఇంటర్నెట్‌ పునరుద్ధరణ జరిగేసరికి గేమ్‌ నిర్ణీత సమయం అయిపోవడంతో వారిద్దరు ఓడిపోయినట్లు ప్రకటించారు. కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో ముఖాముఖిగా ఈ ఏడాదే రష్యా రాజధాని మాస్కోలో ఆగస్టు 5 నుంచి 17 వరకు జరగాల్సిన చెస్‌ ఒలింపియాడ్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. దాని స్థానంలో  ఆన్‌లైన్‌లో చెస్‌ ఒలింపియాడ్‌ను నిర్వహించారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అభినందన...
తొలిసారి నిర్వహించిన ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులైన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు