WTC 2021-23: చిన్న టార్గెట్‌కే కిందా మీదా .. ఇలాగైతే డబ్ల్యూటీసీ గెలిచేదెలా?

25 Dec, 2022 13:46 IST|Sakshi

బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌ గెలిచినప్పటికి టీమిండియా ఆటతీరు అభిమానులకు ఏమాత్రం నచ్చలేదని చెప్పొచ్చు. తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన టీమిండియా.. రెండోటెస్టులో మాత్రం దారుణ ఆటతీరు కనబరిచింది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తున్నప్పటికి చిన్నజట్టైన బంగ్లాదేశ్‌ చేతిలో దాదాపు ఓడినంత పనయింది. ఇవాళ అశ్విన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు నిలదొక్కుకోకుంటే టీమిండియా కచ్చితంగా బంగ్లా చేతిలో ఓటమి పాలయ్యేదే.

ఈ ఓటమి టీమిండియాపై విమర్శల వర్షం కురిపించడమేగాక డబ్ల్యూటీసీ పాయింట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపేది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా చేధించాల్సింది తక్కువ టార్గెట్‌ కాబట్టి టీమిండియా బతికిపోయింది. అప్పటికే 74 పరుగులకే ఏడు వికెట్ల కోల్పోయిన టీమిండియాను శ్రేయాస్‌ అయ్యర్‌, అశ్విన్‌లు గట్టెక్కించారు. ఎనిమిదో వికెట్‌కు 71 పరుగులు జోడించి టీమిండియాకు విజయం అందించారు.

అయితే ఇలాంటి ప్రదర్శనతో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలవడం కష్టమని అభిమానులు పేర్కొంటున్నారు. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లే అవకాశమున్నప్పటికి.. ఇలాంటి ఆటతీరుతో టైటిల్‌ కొట్టడం కష్టమే. బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్టుపై తక్కువ టార్గెట్‌ను చేధించడానికే కిందామీద పడుతున్న టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో పెద్ద జట్లు విధించే లక్ష్యాన్ని ఎలా చేధిస్తుందనేది అంతుచిక్కడం లేదు.

ముఖ్యంగా టీమిండియా టాపార్డర్‌ బలహీనంగా తయారైంది. స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ నాయకుడిగా సక్సెస్‌ అయినప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండు టెస్టులు కలిపి కేఎల్‌ రాహుల్‌ చేసిన పరుగులు 57 మాత్రమే. ఒక్క హాఫ్‌ సెంచరీ నమోదు చేయని కేఎల్‌ రాహుల్‌పై వేటు పడే అవకాశాలున్నాయి. ఇక గిల్‌ తొలి టెస్టులో మంచి ప్రదర్శన చేసినప్పటికి రెండో టెస్టులో మాత్రం తోక ముడిచాడు.

ఇక కోహ్లి ఫామ్‌ ఆందోళన పరుస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడని సంతోషపడేలోపే బంగ్లాతో టెస్టుల సిరీస్‌లో విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక పుజారా మాత్రం ఈ సిరీస్‌లో చక్కగా రాణించాడు. తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన పుజారా ఓవరాల్‌గా 222 పరుగులతో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

రిషబ్‌ పంత్‌ పర్వాలేదనిపించగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ మరోసారి తన టాలెంట్‌ను చూపించాడు. తొలి టెస్టులో 87 పరుగులు చేసిన అయ్యర్‌.. రెండో టెస్టులోనూ హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకోవడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బౌలింగ్‌ విభాగం ఇప్పటికైతే బాగానే ఉంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇలాంటి ప్రదర్శన సరిపోదు. ఏ ఒక్క ఆటగాడిపైనే ఆధారపడితే మ్యాచ్‌ను గెలవలేం అన్న సంగతి బంగ్లాతో జరిగిన రెండో టెస్టులో నిరూపితమైంది. అందుకే టెస్టు చాంపియన్‌షిప్‌కు మరో ఆరు నెలలు మిగిలిఉన్న నేపథ్యంలో వీలైనన్ని టెస్టులు గెలవడంతో బ్యాటింగ్‌ విషయంలో మరింత మెరుగవ్వాల్సిన పరిస్థితి ఉంది.

చదవండి: WTC: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. రెండో స్థానానికి దూసుకొచ్చిన టీమిండియా

హమ్మయ్య గెలిచాం.. భారత్‌ను గెలిపించిన అ‍య్యర్‌, అశ్విన్‌

మరిన్ని వార్తలు