నిప్పులు చెరిగిన పేసర్లు.. కివీస్‌ను మట్టికరిపించిన భారత్‌, సిరీస్‌ కైవసం

22 Jan, 2023 05:15 IST|Sakshi

108 పరుగులకే కుప్పకూలిన కివీస్‌

8 వికెట్లతో భారత్‌ ఘనవిజయం

2–0తో వన్డే సిరీస్‌ సొంతం

మంగళవారం ఇండోర్‌లో చివరి వన్డే   

ఎలాంటి సంచలన ప్రదర్శనలు, ఎలాంటి ప్రతిఘటన, పోరాటాలు లేవు... అంతా ఏకపక్షమే, భారత్‌ పక్షమే.. తొలి వన్డేలో మన జట్టును వణికించిన న్యూజిలాండ్‌ రెండో పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక 108 పరుగులకే ఆట కట్టేసి ముందే ఓటమికి సిద్ధమైంది. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ ఛేదన పూర్తి చేసిన భారత్‌ మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.   

రాయ్‌పూర్‌: తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో రాయ్‌పూర్‌ అభిమానులకు తగిన ఆనందం దక్కలేదు. మొత్తం మ్యాచ్‌ 54.4 ఓవర్లలోనే ముగిసిపోయింది. శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. భారత్‌పై ఆ జట్టుకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (52 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షమీ (3/18) కివీస్‌ను దెబ్బ తీశాడు. అనంతరం భారత్‌ 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. రోహిత్‌ శర్మ (50 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (53 బంతుల్లో 40 నాటౌట్‌; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. భారత్‌కు సొంతగడ్డపై ఇది వరుసగా ఏడో వన్డే సిరీస్‌ విజయం. చివరిదైన మూడో వన్డే మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది.  

సమష్టి వైఫల్యం...
ఇన్నింగ్స్‌ ఐదో బంతికి అలెన్‌ (0)ను షమీ బౌల్డ్‌ చేయడంతో కివీస్‌ పతనం మొదలైంది. ఆ తర్వాత పరుగు తేడాతో నికోల్స్‌ (2), మిచెల్‌ (1) వెనుదిరగ్గా... ఆరు బంతుల వ్యవధిలో కాన్వే (7), లాథమ్‌ (1) అవుటయ్యారు. దాంతో కేవలం 15 పరుగుల స్కోరు వద్దే కివీస్‌ సగం బ్యాటర్లు పెవిలియన్‌ చేరారు. ఈ దశలో ఫిలిప్స్‌తో కలిసి గత మ్యాచ్‌ హీరోలు బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్‌ పోరాడారు.

ఫిలిప్స్‌... ఆరో వికెట్‌కు బ్రేస్‌వెల్‌తో 41 పరుగులు, ఏడో వికెట్‌కు సాన్‌ట్నర్‌తో 47 పరుగులు జోడించాడు. షమీ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన బ్రేస్‌వెల్‌ తర్వాతి బంతికి అవుట్‌ కాగా, కుల్దీప్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన సాన్‌ట్నర్‌ను పాండ్యా వెనక్కి పంపించాడు. స్కోరు 100 దాటాక తర్వాతి రెండు వికెట్లు సుందర్‌ ఖాతాలో చేరగా, కుల్దీప్‌ చివరి వికెట్‌ పడగొట్టాడు.  

స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, గిల్‌ చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో స్కోరు 52/0కు చేరింది. 47 బంతుల్లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాక టిక్నర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. కోహ్లి (11) విఫలంకాగా... అప్పటికే కుదురుకున్న గిల్‌... ఇషాన్‌ కిషన్‌ (8 నాటౌట్‌)తో కలిసి మ్యాచ్‌ను ముగించాడు. 

స్కోరు వివరాలు
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (బి) షమీ 0; కాన్వే (సి అండ్‌ బి) పాండ్యా 7; నికోల్స్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 2; మిచెల్‌ (సి అండ్‌ బి) షమీ 1; ఫిలిప్స్‌ (సి) సూర్యకుమార్‌ (బి) సుందర్‌ 36; బ్రేస్‌వెల్‌ (సి) ఇషాన్‌ (బి) షమీ 22; సాన్‌ట్నర్‌ (బి) పాండ్యా 27; షిప్లీ (నాటౌట్‌) 2; ఫెర్గూసన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) సుందర్‌ 1; టిక్నర్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (34.3 ఓవర్లలో ఆలౌట్‌) 108.
వికెట్ల పతనం: 1–0, 2–8, 3–9, 4–15, 5–15, 6–56, 7–103, 8–103, 9–105, 10–108.
బౌలింగ్‌: షమీ 6–1–18–3, సిరాజ్‌ 6–1–10–1, శార్దుల్‌ 6–1–26–1, హార్దిక్‌ పాండ్యా 6–3–16–2, కుల్దీప్‌ 7.3–0–29–1, వాషింగ్టన్‌ సుందర్‌ 3–1–7–2.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) (బి) షిప్లీ 51; గిల్‌ (నాటౌట్‌) 40; కోహ్లి (స్టంప్డ్‌) లాథమ్‌ (బి) సాన్‌ట్నర్‌ 11; ఇషాన్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20.1 ఓవర్లలో 2 వికెట్లకు) 111. 
వికెట్ల పతనం: 1–72, 2–98.
బౌలింగ్‌: ఫెర్గూసన్‌ 5–0– 21–0, షిప్లీ 5–0–29–1, టిక్నర్‌ 4–0–19–0, సాన్‌ట్నర్‌ 4.1–0–28–1, బ్రేస్‌వెల్‌ 2–0–13–0.  


రోహిత్‌ మతిమరుపు...
టాస్‌ సమయంలో అనూహ్య ఘటన జరిగింది. టాస్‌ గెలిచిన రోహిత్‌ ఏం ఎంచుకోవాలో చెప్పకుండా కొన్ని క్షణాల పాటు తటపటాయించాడు. టాస్‌ గెలిస్తే ఏం చేయాలో తాను మరచిపోయానని అంటూ కొంత ఆలోచించి, ఆలోచించి చివరకు ఫీల్డింగ్‌ అంటూ చెప్పడం నవ్వు తెప్పించింది.  

మరిన్ని వార్తలు