IND Vs SL: 'సూర్యుడి' విధ్వంసం.. టీమిండియాదే సిరీస్‌

8 Jan, 2023 05:12 IST|Sakshi

రాజ్‌కోట్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంక కొట్టుకుపోయింది. టీమిండియా 91 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. టాస్‌ నెగ్గిన భారత్‌ మొదట 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ (51 బంతుల్లో 112 నాటౌట్‌; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించాడు. రాహుల్‌ త్రిపాఠి (16 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిశాడు. అనంతరం శ్రీలంక 16.4 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. కుశాల్‌ మెండిస్‌ (23), షనక (23) టాప్‌ స్కోరర్లు.  

సూర్య ది గ్రేట్‌ ఇన్నింగ్స్‌ 
నాలుగో బంతికి ఇషాన్‌ కిషన్‌ (1) వికెట్‌ తీసిన లంకకు ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కెరీర్‌లో రెండో మ్యాచ్‌ ఆడుతున్న రాహుల్‌ త్రిపాఠి  మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, శుబ్‌మన్‌ గిల్‌ (36 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మొదటి 9 బంతుల్లో సింగిల్‌ కూడా తీయలేకపోయాడు! తీక్షణ ఐదో ఓవర్లో 3 బౌండరీలు బాదిన త్రిపాఠి... కరుణరత్నే ఆరో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. అదే ఊపులో థర్డ్‌మ్యాన్‌ దిశగా షాట్‌ ఆడబోయి మదుషంక చేతికి చిక్కాడు.

‘పవర్‌ ప్లే’ ఆఖరి బంతికి సూర్య క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్ల పవర్ల ప్లేనే అయిపోయింది. మిగతా 14 ఓవర్ల పవర్‌ స్ట్రోక్స్‌ ఎలావుంటాయో ‘స్కై’ చూపెట్టాడు. కవర్‌ డ్రైవ్, ర్యాంప్‌ షాట్లతో టచ్‌లోకి వచి్చన సూర్యకుమార్‌ స్కోరు బోర్డును ఆద్యంతం పరుగు పెట్టించాడు. స్పిన్, పేస్, గూగ్లీ ఇలా ఏ బంతి వేసిన తన శైలి షాట్లతో చెలరేగిపోయాడు. పేస్‌తో ముఖం మీదికి వచ్చే బంతుల్ని విడిచి పెట్టలేదు. అదే పనిగా ర్యాంప్‌ షాట్లతో సిక్స్‌లు, ఫోర్లుగా దంచేస్తూ 26 బంతుల్లోనే ఫిఫ్టీని అవలీలగా పూర్తి చేసుకున్నాడు. అతని షాట్లకు ఆకాశమే హద్దయ్యింది.

ఫుట్‌ టాస్‌ బంతులను, యార్కర్‌ డెలివరీల్ని మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలకు తరలించాడు. ఎలా వేసినా దంచేశాడు. అతని ధాటికి మదుషంక 13వ ఓవర్లో 18 పరుగులు రాగా... తీక్షణ మరుసటి ఓవర్లో 2, 4, 6, 6, 1లతో సూర్య వేగం ఇంకాస్త పెంచాడు. ఆఖరి బంతిని ఆడిన గిల్‌ బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్లో 23 పరుగులొచ్చాయి. కేవలం ఈ రెండు ఓవర్లలోనే భారత్‌ 113/2 నుంచి 154/2కు చేరింది. హసరంగ 15వ ఓవర్లో గిల్‌ క్లీన్‌»ౌల్డయ్యాడు. కెపె్టన్‌ హార్దిక్‌ పాండ్యా (4), దీపక్‌ హుడా (4) స్వల్ప వ్యవధిలోనే 
ని్రష్కమించినా... సూర్య బాదుడుకు అదేమంతా ప్రభావమే చూపలేదు. ఆఖర్లో జతయిన అక్షర్‌ పటేల్‌ (9 బంతుల్లో 21 నాటౌట్‌; 4 ఫోర్లు) చకచకా బౌండరీలు బాదాడు. 18వ ఓవర్‌ చివరి బంతికి భారత్‌ స్కోరు 200కు చేరగా, 19వ ఓవర్‌ తొలి బంతికి సూర్యకుమార్‌ (45 బంతుల్లో; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ పూర్తయ్యింది. పొట్టి ఫార్మాట్‌లో అతనికిది మూడో సెంచరీ కావడం విశేషం. 

లంక గిలగిల 
భారీ లక్ష్యం చూడగానే శ్రీలంక బ్యాటర్స్‌ బెదిరినట్లున్నారు. క్రీజులోకి 11 మంది దిగినా... అందులో ఏ ఒక్కరు కనీసం పాతిక పరుగులైనా చేయలేకపోయారు. గత మ్యాచ్‌లో విమర్శలపాలైన భారత బౌలింగ్‌ ఒక్కసారిగా దెబ్బతిన్న పులిలా పంజా విసిరింది. నిసాంక (15; 3 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (1), ధనంజయ (14 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌), అసలంక (14 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టెన్‌ షనక, హసరంగ (9) ఎవరు వచి్చనా ఆడింది కాసేపే! భారీ లక్ష్యానికి తగ్గ భాగస్వామ్యం ఒక్కటంటే ఒక్కటైన నిలబడకుండా బౌలర్లు సమష్టిగా దెబ్బతీశారు. దీంతో కనీసం 17 ఓవర్లయినా పూర్తిగా ఆడలేక ఆలౌటైంది. 

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) ధనంజయ (బి) మదుషంక 1; గిల్‌ (బి) హసరంగ 46; త్రిపాఠి (సి) మదుషంక (బి) కరుణరత్నే 35; సూర్యకుమార్‌ నాటౌట్‌ 112; హార్దిక్‌  (సి) ధనంజయ (బి) రజిత 4; హుడా (సి) హసరంగ (బి) మదుషంక 4; అక్షర్‌ నాటౌట్‌ 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–3, 2–52, 3–163, 4–174, 5–189. బౌలింగ్‌: మదుషంక 4–0–55–2, రజిత 4–1–35–1, తీక్షణ 4–0–48–0, కరుణరత్నే 4–0–52–1, హసరంగ 4–0–36–1. 
శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (సి) మావి (బి) అర్‌‡్షదీప్‌ 15; మెండిస్‌ (సి) ఉమ్రాన్‌ (బి) అక్షర్‌ 23; ఫెర్నాండో (సి) అర్ష్‌దీప్‌ (బి) పాండ్యా 1; ధనంజయ (సి) గిల్‌ (బి) చహల్‌ 22; అసలంక (సి)  మావి (బి) చహల్‌ 19; షనక (సి) అక్షర్‌ (బి) అర్‌‡్షదీప్‌ 23; హసరంగ (సి) హుడా (బి) ఉమ్రాన్‌ 9; కరుణరత్నే (ఎల్బీ) (బి) పాండ్యా 0; తీక్షణ (బి) ఉమ్రాన్‌ 2; రజిత నాటౌట్‌ 9; మదుషంక (బి) అర్‌‡్షదీప్‌ 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (16.4 ఓవర్లలో ఆలౌట్‌) 137. 
వికెట్ల పతనం: 1–44, 2–44, 3–51, 4–84, 5–96, 6–107, 7–123, 8–127, 9–135, 10–137. బౌలింగ్‌: పాండ్యా 4–0–30–2, అర్‌‡్షదీప్‌ 2.4–0–20–3, శివమ్‌ మావి 1–0–6–0, అక్షర్‌ 3–0–19–1, ఉమ్రాన్‌ 3–0–31–2, చహల్‌ 3–0–30–2.  

మరిన్ని వార్తలు