ధవన్‌ సేన బి టీమ్‌ కాదు.. భారత్‌కు ఒకేసారి నాలుగైదు జట్లను ఆడించే సత్తా ఉంది..!

8 Oct, 2022 17:53 IST|Sakshi

IND VS SA 2nd ODI: రాంచీ వేదికగా టీమిండియాతో రేపు (అక్టోబర్‌ 9) జరుగబోయే రెండో వన్డేకి ముందు దక్షిణాఫ్రికా స్టార్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ల గైర్హాజరీలో తమతో వన్డే సిరీస్‌ ఆడుతున్న శిఖర్‌ ధవన్‌ సేనను భారత-బి టీమ్‌ అంటే అస్సలు ఒప్పుకోనని అతను వ్యాఖ్యానించాడు. భారత ఆటగాళ్లలో చాలా టాలెంట్‌ ఉందని, ఒకేసారి నాలుగైదు అంతర్జాతీయ స్థాయి జట్లను బరిలోకి దించే సత్తా వారికి ఉందని టీమిండియా ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. 

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి జట్టులో లేనంత మాత్రాన ధవన్‌ సేనను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదని పేర్కొన్నాడు. తమతో వన్డే సిరీస్‌ ఆడుతున్న భారత జట్టులో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారని, వారితో ఏమరపాటుగా ఉంటే అసలుకే మోసం వస్తుందని సఫారీ ప్లేయర్లను పరోక్షంగా హెచ్చరించాడు. ధవన్‌ సేనలో చాలా మంది కుర్రాళ్లకు ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉందని, వారంతా ప్రపంచ స్థాయి ఆటగాళ్లేనని సంజూ శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను ఉద్దేశించి కామెంట్‌ చేశాడు. 

టీమిండియాతో ఆడటం ఎంతటి జట్టుకైనా సవాలుతో కూడుకున్న పనేనని, వారు ఒకేసారి నాలుగైదు జట్లను బరిలోకి దించినా వారి బ్యాటింగ్‌ లైనప్‌ దుర్భేద్యంగానే ఉంటుందని కొనియాడాడు. టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన తమ జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉందని, ఈ సిరీస్‌ను తామ తప్పక చేజిక్కించుకుని ఆస్ట్రేలియాకు (టీ20 వరల్డ్‌కప్‌ వేదిక) బయల్దేరుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

ఇదిలా ఉంటే, లక్నో వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో సఫారీ జట్టు 9 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ (86 నాటౌట్‌) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను చివరి నిమిషం వరకు ఆసక్తికరంగా మార్చాడు. అయితే ఆఖర్లో టెయిలెండర్‌ ఆవేశ్‌ ఖాన్‌ చేసిన పొరపాట్ల వల్ల శాంసన్‌కు స్ట్రయిక్‌ రాకపోవడంతో భారత్‌ ఓటమిపాలైంది. 40 ఓవర్ల పాటు సాగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు 4 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో టీమిండియా 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయగలిగింది. 
 

>
మరిన్ని వార్తలు