LLC 2022: విధ్వంసం సృష్టించిన టేలర్‌.. లెజెండ్స్‌ లీగ్‌ ఛాంపియన్స్‌గా గంభీర్‌ సేన

6 Oct, 2022 10:39 IST|Sakshi

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌-2022 ఛాంపియన్స్‌గా గౌతం గంభీర్‌ సారథ్యంలోని ఇండియా క్యాపిటిల్స్‌ నిలిచింది. బుధవారం జైపూర్‌ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. ఇండియా క్యాపిటిల్స్‌ టైటిల్‌ కైవసం చేసుకోవడంలో ఆ జట్టు ఆటగాళ్లు రాస్ టేలర్,  మిచెల్ జాన్సన్ కీలక పాత్ర పోషించారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా.. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాస్‌ టేలర్‌,  జాన్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టేలర్‌ 41 బంతుల్లో 82 , జాన్సెన్‌ 35 బంతుల్లో 62 పరుగులు సాధించారు. కాగా టేలర్‌ ఇన్నింగ్స్‌లో 4 పోర్లు, 8 సిక్స్‌లు ఉండటం గమానార్హం.

ఇక అఖరిలో నర్స్‌(19 బంతుల్లో 42) మెరుపులు మెరిపించడంతో ఇండియా క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. భిల్వారా కింగ్స్‌ బౌలర్లలో రాహుల్‌ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పనేసర్‌ రెండు, బ్రెస్నెన్‌ ఒక్క వికెట్‌ సాధించారు.  

అనంతరం 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన  భిల్వారా కింగ్స్‌.. 18.2 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. భిల్వారా బ్యాటర్లలో షేన్‌ వాట్సన్‌ 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా క్యాపిటల్స్‌ బౌలర్లలో పంకజ్‌ సింగ్‌, ప్రవీణ్ తాంబే, పవన్‌ సయాల్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్‌, ప్లంకెట్‌, భాటియా చెరో వికెట్‌ సాధించారు.


చదవండి: T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు బయలు దేరిన టీమిండియా.. ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు