Team India: వన్డే, టి20ల్లో మనమే.. ఇక టెస్టులే బాకీ

25 Jan, 2023 08:34 IST|Sakshi

టీమిండియా సూపర్‌ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. స్వదేశంలో ఎప్పటికి మనం పులులమే అని మరోసారి కివీస్‌తో సిరీస్‌ రుజువు చేసింది. న్యూజిలాండ్‌ జట్టులో సీనియర్లు లేకపోవచ్చు.. కానీ తొలి వన్డేలో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ చేశాకా తీసిపారేయాల్సిన జట్టులా కనిపించలేదు. అందుకే మన జట్టు వారితో పోలిస్తే బలంగా కనిపించినప్పటికి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయడం పెద్ద విషయమే. వరుసగా రెండు వన్డే సిరీస్‌లు క్లీన్‌స్వీప్‌ చేయడం అంటే ఏ జట్టుకైనా కష్టసాధ్యమే.

కానీ టీమిండియా మొదట శ్రీలంకను.. తాజాగా న్యూజిలాండ్‌ను అవలీలగా క్లీన్‌స్వీప్‌ చేసి పారేసింది. ప్రస్తుతం టి20ల్లో, వన్డేల్లో టీమిండియా నెంబర్‌వన్‌గా ఉంది.. ఇక టెస్టుల్లోనూ అగ్రస్థానం అందుకుంటే.. ముచ్చటగా మూడు ఫార్మాట్లలోనూ ఏకకాలంలో నెంబర్‌వన్‌గా నిలిచిన అరుదైన జట్టుగా నిలవనుంది. బహుశా ఇంతకముందెన్నడూ మూడు ఫార్మాట్లలో ఒకే జట్టు నెంబర్‌వన్‌గా లేదన్నది సమాచారం.

తాజాగా ఆ అవకాశం టీమిండియాకు లభించనుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో మొదలుకానున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలిస్తే గనుక టెస్టుల్లో నెంబర్‌వన్‌ ర్యాంకును పొందుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా రెండో స్థానంలో ఉంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయకపోయినా.. 2-1 తేడాతో నెగ్గినా టీమిండియా అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ప్రస్తతం ప్రపంచనెంబర్‌వన్‌గా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియాకు సవాలే. కానీ టెస్టు సిరీస్‌ మన దగ్గర జరగడం సానుకూలాంశమనే చెప్పొచ్చు.

ఎంత పెద్ద జట్టైనా స్వదేశంలో టీమిండియా ముందు తోక ముడవాల్సిందే. 2017లో ఆస్ట్రేలియా టీమిండియా పర్యటనకు వచ్చినప్పుడు కూడా తొలి టెస్టు మ్యాచ్‌లో నెగ్గిన ఆసీస్‌.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో ఓడి.. ఒక మ్యాచ్‌ డ్రా చేసుకుంది. అలా టీమిండియా 2-1తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరి ఈసారి కూడా టీమిండియా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించి టెస్టు సిరీస్‌ గెలవడంతో పాటు నెంబర్‌వన్‌ స్థానాన్ని అందుకుంటుందేమో చూడాలి. నెంబర్‌వన్‌ కావడంతో పాటు పనిలో పనిగా ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడే అవకాశం కూడా టీమిండియాకు రానుంది.

చదవండి: 'ర్యాంకులు పట్టించుకోం.. ఆసీస్‌తో సిరీస్‌ అంత ఈజీ కాదు'

>
మరిన్ని వార్తలు