పిస్టల్‌లో క్లీన్‌స్వీప్‌

25 Mar, 2021 01:06 IST|Sakshi
చింకీ యాదవ్‌, ప్రతాప్‌

మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు

నెగ్గిన చింకీ యాదవ్, రాహీ, మనూ భాకర్‌

న్యూఢిల్లీ: సొంతగడ్డపై ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. టోర్నీ ఆరో రోజు బుధవారం భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు అందుబాటులో ఉన్న మూడు పతకాలను నెగ్గి క్లీన్‌స్వీప్‌ చేశారు. ఈ ఫైనల్లో చింకీ యాదవ్‌కు స్వర్ణం దక్కగా... రాహీ సర్నోబత్‌ రజతం, మనూ భాకర్‌ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మనూ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది.

చింకీ యాదవ్, రాహీ 32 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూట్‌ ఆఫ్‌ నిర్వహిం చగా... చింకీ యాదవ్‌ 4 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. 3 పాయింట్లు స్కోరు చేసిన రాహీకి రజతం దక్కింది. ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ చరిత్రలో ఒకే ఈవెంట్‌లో ముగ్గురు భారత షూటర్లు క్లీన్‌స్వీప్‌ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే ఈ ముగ్గురు భారత మహిళా షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.  

ప్రతాప్‌ సింగ్‌ ఘనత
మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ విభాగంలో భారత యువ షూటర్‌ ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో భారత్‌ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా ప్రతాప్‌ సింగ్‌ ఘనత వహించాడు. 20 ఏళ్ల ప్రతాప్‌ సింగ్‌ 462.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ప్రపంచ నంబర్‌వన్‌ ఇస్తవన్‌ పెనీ (హంగేరి–461.6 పాయింట్లు) రజతంతో సరిపెట్టుకోగా... స్టీఫెన్‌ ఒల్సెన్‌ (డెన్మార్క్‌–450.9 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ క్వాలిఫయింగ్‌లో భారత షూటర్లు తేజస్విని సావంత్‌ 12వ స్థానంలో, అంజుమ్‌ మౌద్గిల్‌ 16వ స్థానంలో, సునిధి చౌహాన్‌ 17వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ఆరో రోజు పోటీలు ముగిశాక భారత్‌ 9 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.   
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు