2016 తర్వాత మూడోసారి.. స్వదేశంలో రెండోసారి

21 Mar, 2021 10:30 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ విజయంతో టీమిండియా ఒక అరుదైన రికార్డు సాధించింది. 2016 టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య జరిగిన మూడు ద్వైపాక్షిక టీ20 టోర్నీల్లో మూడుసార్లు టీమిండియానే సిరీస్‌ ఎగరేసుకుపోవడం విశేషం. ఇందులో ఒక సారి ఇంగ్లండ్‌ గడ్డపై.. రెండుసార్లు స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ల్లో భారత్‌ విజేతగా నిలిచింది.

2017లో ఇండియాకు వచ్చిన ఇంగ్లండ్‌ టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌ ఆడింది. ఆ సిరీస్‌ను ఇండియా 2-1 తేడాతో నెగ్గింది. ఆ తర్వాత భారత జట్టు 2018లో ఇంగ్లండ్‌ పర్యటనలో 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. తాజాగా 2021లో ఐదు టీ20ల సిరీస్‌ను భారత జట్టు 3-2 తేడాతో గెలుచుకొని ఆ రికార్డును మరింత పదిలపరుచుకుంది. 2016 తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌పై గెలిచిన మూడు టీ20 సిరీస్‌ల్లోనూ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లినే ఉండడం మరో విశేషం.

ఇక చివరి టీ20లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (52 బంతుల్లో 80 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఓపెనర్‌గా దిగిన కోహ్లి ముగ్గురు సహచరులతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. 
చదవండి:
టాప్‌ 2కు దూసుకొచ్చిన రోహిత్‌.. మొదటి స్థానంలో కోహ్లి

'వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు భయపడాల్సిందే'

>
మరిన్ని వార్తలు