ఒలింపిక్స్‌లో నారీ భేరీ: మువ్వన్నెల కీర్తి పతాకలు

22 Aug, 2021 09:17 IST|Sakshi

అమ్మాయిలకు ఆటలేంటి... ఈ మాట కాలమానాలకు అతీతంగా నాటి తరం నుంచి నేటి తరం వరకు వినిపిస్తూనే ఉంది. ఇలాంటి ఆలోచనకు దేశం, ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేదు... మీ ఇంట్లోనో, పక్కింట్లోనో, స్నేహితుల వద్ద, బంధువుల వద్ద ఎప్పుడో ఒకసారి,  ఇప్పుడు కూడా మీరు వినే ఉంటారు. ఆటతో ఆకాశపు అంచును అందుకున్నా... అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు చేసినా ఆడపిల్లకు అవసరమా అనే వాక్యం ఎక్కడినుంచో వెతుక్కుంటూనే వస్తుంది. అలా అని అమ్మాయి ఆగిపోలేదు. అలా ఆటల్లో  దూసుకుపోతూనే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారతనారి తన సత్తా చాటి మువ్వన్నెల కీర్తి పతాకను ఎగురవేసింది. అడ్డంకులు సృష్టించడం కాదు... అవకాశాలు ఇస్తే ఎంతటి ఘనతనైనా సాధించగలనని చూపించింది.


వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న మెగా స్పోర్టింగ్‌ ఈవెంట్‌ ఒలింపిక్స్‌ను ఈ సారి నిర్వహణ కమిటీ మహిళల కోణంలో కాస్త ప్రత్యేకంగా మార్చింది. జెండర్‌ ఈక్వాలిటీ పాటిస్తూ పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్ల సంఖ్య కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. మహిళలు కూడా ప్రముఖంగా కనిపించేలా... పురుషులు మాత్రమే ఇప్పటి వరకు పాల్గొన్న కొన్ని ఈవెంట్లలో సమానంగా మహిళలను కూడా చేర్చి మిక్స్‌డ్‌ ఈవెంట్లుగా మలచింది. ఇలాంటి ఈవెంట్ల సంఖ్య 18 కావడం విశేషం. అన్నింటికి మించి క్రీడల ప్రారంభోత్సవం రోజున తమ దేశ పతాకాన్ని తీసుకొని నడిచే అరుదైన గౌరవం కూడా స్త్రీలకే అందించింది. గతంలో ఒకే ఒక్క ఫ్లాగ్‌ బేరర్‌ ఉంటుండగా... టోక్యోలో ఒక దేశం నుంచి ఒక పురుష అథ్లెట్, ఒక మహిళా అథ్లెట్‌ జెండా పట్టుకొని నడిచే అవకాశం కల్పించడం ఒలింపిక్స్‌ స్థాయిని పెంచాయి.

పీవీ సింధు (బ్యాడ్మింటన్‌ సింగిల్స్, కాంస్యం) 
ఒకసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటే చాలు జీవితం ధన్యమైనట్లుగా భావించి∙ఒలింపియన్‌ అనే గుర్తింపుతో తిరిగేవారు ఎంతో మంది. కానీ రెండు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటే రెండు సార్లూ పతకంతో తిరిగి రావడం అసాధారణం. అలాంటి ఘనతను తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు సాధించింది. చాలా మంది క్రీడాకారుల కష్టాల నేపథ్యంతో పోలిస్తే... అలాంటివేమీ లేవు కాబట్టి సింధుకు అంతా పూలబాటే అనుకుంటే పొరపాటు. ఒక్కసారి బరిలోకి దిగిన తర్వాత ప్లేయర్ల ఆట మాత్రమే మాట్లాడుతుంది. వారి ఆర్థిక, సామాజిక అంశాలేవీ ప్రత్యర్థికి కనిపించవు.

అంటే ఒక పతకం గెలుపు వెనుక ఉండే ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల, అంకితభావమే ఆటగాళ్లను నడిపిస్తాయి. తొలిసారి 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు ఆ తర్వాత ఇక చాలంటూ ఆగిపోలేదు. మరో ఒలింపిక్‌ పతకానికి గురి పెట్టింది. టోక్యో క్రీడలకు కొన్ని నెలల ముందునుంచైతే ఒక్క రోజు కూడా ఆమె విరామం తీసుకోలేదు. ఆటతో పాటు ఫిట్‌నెస్‌ కోసం గంటల కొద్దీ కఠోర సాధన చేసింది. అవే ఆమెను ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమ మహిళా క్రీడాకారిణిగా తీర్చి దిద్దాయి. ఒలింపిక్‌ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత ప్లేయర్‌గా సింధు చరిత్ర సృష్టించింది. 

మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్‌ – రజతం, 49 కేజీల విభాగం) 
ప్రపంచ క్రీడల్లో అతి పెద్ద వేదికపై ఘోర వైఫల్యం తర్వాత ఒక క్రీడాకారిణి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తిరిగి కోలుకొని ఆటపై దృష్టి పెట్టాలంటే, అదీ పతకం కోసం పోరాడాలంటే ఎంతటి పట్టుదల ఉండాలి! మణిపురి మణిపూస మీరాబాయి చాను అలాంటి పోరాటతత్వం తనలో ఉందని నిరూపించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో చాను తన ఈవెంట్‌ను కూడా  పూర్తి చేయలేకపోయింది. ఆరు ప్రయత్నాల్లో ఒకే ఒక్కసారి మాత్రమే ఆమె నిర్ణీత బరువును ఎత్తగలిగింది. ఆ పోరు తర్వాత మొదలైన కన్నీటి ప్రవాహం ఎప్పుడో గానీ ఆగలేదు. అన్నీ మరచి ఆటపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని భావించిన చాను మళ్లీ పైకెగసింది.

అనూహ్యంగా దూసుకొచ్చిన స్టార్‌ ప్లేయర్‌ మాదిరిగా కాకుండా తన కెరీర్‌లో ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ మళ్లీ ఆటపై మెల్లగా తన ముద్ర చూపించింది. ఇప్పుడు టోక్యోలో అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్‌ పతకాన్ని అందుకుంది. ఊరికి సమీపంలో అడవినుంచి కట్టెలు కొట్టి తెచ్చే కుటుంబంలో ఒకరిగా ఉంటూ అవే కట్టెల మోపులను మోయడంతో మొదలైన ఆమె బరువులెత్తే ప్రస్థానం ఒలింపిక్‌ రజతం వరకు సాగింది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఏనాడూ వెనక్కి తగ్గని మీరాబాయి లాంటి అమ్మాయి 
ఎందరికో స్ఫూర్తి. 

లవ్లీనా బొర్గొహైన్‌ (బాక్సింగ్‌ – 69 కేజీలు, కాంస్యం)
ఇద్దరు అక్కలు కిక్‌ బాక్సింగ్‌ ఆడారు. వారిని చూసి తాను బాక్సింగ్‌ వైపు వచ్చింది. అయితే సహజంగానే చిరు వ్యాపారి అయిన తండ్రికి తమ ముగ్గురు అమ్మాయిలను ఆటల్లో పెట్టే స్తోమత లేదు. మొదటి ఇద్దరు జాతీయ స్థాయి ఆటతోనే ముగించారు. కానీ ఆ తండ్రి మూడో కూతురిని మాత్రం అంతర్జాతీయ స్థాయికి చేర్చాలని మనసులో గట్టిగా అనుకున్నాడు. లవ్లీనా కూడా తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఒలింపిక్స్‌లో ఆడి నా కల నెరవేర్చమ్మా అన్న నాన్నకు మాట ఇచ్చిన లవ్లీనా పాల్గొనడంతోనే సరి పెట్టలేదు. పతకం తెచ్చి మరీ మురిపించింది. అసోంలో వెనుకబడిన గోలాఘాట్‌ ప్రాంతంనుంచి వచ్చి లవ్లీనా ఒలింపిక్‌ పతకాన్ని గెలుచుకోవడం వెనుక అద్భుతాలు ఏమీ లేవు. అడుగడుగునా ఆమె కష్టం మాత్రమే ఉంది.

ఈ ఏడాది ఆరంభంలో సహచరులంతా ప్రత్యేక శిక్షణ కోసం విదేశాలకు వెళ్లిన సమయంలో లవ్లీనా కరోనా బారిన పడింది. దాంతో ఆ అవకాశం చేజారింది. అక్కడకు వెళ్లి తన ఆట అత్యుత్తమంగా మారేదని, కచ్చితంగా ఒలింపిక్‌ పతకం సాధించేదాన్నని ఆమె అనుకుంది. అయితే ఆ నిరాశను దూరం చేసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇక్కడే ఉండి తన పంచ్‌లకు పదును పెట్టింది. ఇప్పుడు అసోం గర్వపతాకగా నిలిచింది. పతకం సాధించిన రోజునుంచి ఇప్పటి వరకు లవ్లీనా తన పురోగతిలో లెక్క లేనన్ని సార్లు నాన్న గురించి చెప్పడం చూస్తేనే ఆమెను ప్రోత్సహించడంలో తండ్రి పాత్ర ఏమిటో అర్థమవుతుంది. 

మేరీ కోమ్‌ (బాక్సింగ్‌ – 51 కేజీలు, క్వార్టర్‌ ఫైనల్‌) 
బాక్సింగ్‌లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి విజయం వెనుక ఎంత శ్రమ దాగి ఉంటుందో ఊహించడం కష్టం. మణిపూర్‌లోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మేరీ కోమ్‌ భారత బాక్సింగ్‌కు పర్యాయపదంగా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లోనే కాంస్యం సాధించి మేరీకోమ్‌ మరో పతకం కోసం ఈ సారీ పోరాడినా దురదృష్టవశాత్తూ చేజారింది. అయితే ఏం... మేరీకోమ్‌ క్రీడా పటిమను ఆ పతకంతో తూచలేం కదా! ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, తాను నమ్మిన ఆటలో తనపై నమ్మకంతో ఆమె సాగించిన ప్రయాణం అసాధారణం. టోక్యోలో పతకం గెలవకపోయినా తన ఆటతో మేరీకోమ్‌ అందరికీ ప్రేరణనిచ్చింది. 

అదితి అశోక్‌ (గోల్ఫ్‌ – నాలుగో స్థానం) 
గోల్ఫ్‌లో భారతదేశం మొత్తం  పతకం కోసం ఆసక్తిగా ఎదురు చూసిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. కానీ 23 ఏళ్ల అమ్మాయి ఒక్కసారిగా మన క్రీడాభిమాల దృష్టినంతా తన వైపు తిప్పుకునేలా చేయగలిగింది. బెంగళూరుకు చెందిన అదితి అశోక్‌ తన అసాధారణ ఆటతో టోక్యో ఒలింపిక్స్‌లో చివరి వరకు పోరాడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 200వ స్థానంలో ఉన్నా... ఆమె పట్టుదల ముందు ఆ అంకె బాగా చిన్నదైపోయింది. ఒక్క స్ట్రోక్‌...ç Üరిగ్గా చెప్పాలంటే కొన్ని మిల్లీ మీటర్ల తేడాతో అదితి కాంస్య పతకాన్ని కోల్పోయింది. అయినా సరే ఆటపై తన ముద్ర చూపించి అందరి మనసులు గెలుచుకోగలిగింది. గోల్ఫ్‌పై అందరూ చర్చించేలా చేయగలిగింది. 

భవానీ దేవి (ఫెన్సింగ్‌) 
ఎవ్వరూ నడవని దారిలో నడవడమే ఆమెకు తెలిసిన ఆట.. ఆమె స్పోర్ట్స్‌ ఫిలాసఫీ కూడా. అందుకే అరుదైన క్రీడ ఫెన్సింగ్‌లోకి అడుగు పెట్టింది భవానీ దేవి. ఖరీదైన క్రీడే అయినా కత్తితో సహవాసం చేయడంలో ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆ ఆటకు సంబంధించి ఏమాత్రం సౌకర్యాలు లేని పరిస్థితులు, ఫలితాలు అసలే కనిపించని చోట తన ముద్ర చూపించడం కోసం ఎంతో కష్టపడింది. చివరకు పురుషుల విభాగంలోనూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఒలింపిక్స్‌లోకి ప్రవేశించిన తొలి భారత ఫెన్సర్‌గా కీర్తి గడించింది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆమె, రెండో పోరులో తగ్గింది. అయితే భవాని ఎదిగిన తీరును చూస్తే ఈ ఓటమి అసలు లెక్కలోనిదే కాదు. కొత్త ఆలోచనలతో, ధైర్యంతో ముందుకు సాగాలని భావించే ప్రతీ అమ్మాయికి ఫెన్సర్‌ భవానీ ఒక ఆదర్శం. 

కమల్‌ప్రీత్‌ కౌర్‌ (డిస్కస్‌ త్రో – ఆరో స్థానం) 
పంజాబ్‌లోని కబర్‌వాలా గ్రామంలో కమల్‌ కుటుంబానికి 26 ఎకరాల పొలం ఉంది. పాడి గేదెలు, ఇతర పశుసంపదకు లోటు లేదు. హాయిగా పెళ్లి చేసుకొని దర్జాగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు కోరుకుంటే నేను ఆటలు ఆడతానని కమల్‌ చెప్పింది. అయినా సరే, దేనికి లోటు లేదు కాబట్టి సరదాగా ఆడుతుందేమో అనుకున్నారు కానీ ఎంతో శ్రమ దాగి ఉండే అథ్లెటిక్స్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకుంటుందని వారు ఊహించలేదు.  కమల్‌ ఏకంగా డిస్కస్‌ త్రోను విసరడాన్నే  సాధన చేసింది. పట్టుదలగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తన త్రోతో ఒలింపిక్స్‌ వరకు చేరింది. టోక్యో పోటీలకు ముందు ఆమెపై పెద్దగా అంచనాలు లేవు కానీ క్వాలిఫయింగ్‌లో కమల్‌ జోరు ఆశలను పెంచింది.

చివరకు ఆరో స్థానంతో సరిపెట్టుకున్నా... డిస్కస్‌ త్రోలో ఒక భారత త్రోయర్‌ సాధించిన ఈ ఘనత చాలా గొప్పదే. అందుకే ఆమె ఈవెంట్‌ జరిగిన రోజు ఫలితంతో సంబంధం లేకుండా ఆ ఊర్లో సంబరాలు జరిగాయి.  కమల్‌ ఇంట్లో మిఠాయి తినందే ఊళ్లోవాళ్లెవ్వరూ ఆ ఇంటి గుమ్మం దాటలేదు. డబ్బుకు కొదవ లేకున్నా... ప్లేయర్‌గా ఆమె కూడా సగటు అథ్లెట్‌గానే పలు ఇబ్బందికర పరిస్థితులను అధిగమించి ఈ స్థాయికి చేరింది. ఒక దశలో కమల్‌ను సహచర మహిళా అథ్లెట్లు మగాడు అంటూ, పాల్గొనే అర్హత లేదంటూ ఫిర్యాదుల వరకు వెళ్లినా అన్నీ తట్టుకొని నిలిచింది. ఆమె పోరాటం నిజంగా అందరిలో స్ఫూర్తి నింపేదే.

ఆ 16 మంది...
ఒలింపిక్స్‌లో గెలుపు ఒక్కటే గొప్పతనాన్ని నిర్దేశించదు. పతకాల పట్టికలో తమ పేరు లిఖించుకోలేకపోయినా... ఆటపై బలమైన ముద్ర వేయగలగడం వారు సాధించిన విజయం. అలా చూస్తే భారత మహిళల హాకీ సాధించిన ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే. 1980 తర్వాత ఎనిమిది ఒలింపిక్స్‌లలో అసలు అర్హతే సాధించలేకపోయింది. ఎట్టకేలకు 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నా దక్కింది 12వ స్థానమే. అక్కడినుంచి ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానంలో నిలవగలిగిందంటే మన మహిళల ప్రస్థానం ఎలా సాగిందో అర్థమవుతుంది. కాంస్యపతక పోరులోనూ అద్భుతంగా ఆడినా దురదృష్టవశాత్తూ జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే మన అమ్మాయిల ఆటను చూసినవారు మాత్రం స్థానంతో సంబంధం లేకుండా జేజేలు పలకకుండా ఉండలేకపోయారు. 

రాణి రాంపాల్‌ (హరియాణా) 
26  ఏళ్ల రాణి జీవితంలో దాదాపు సగభాగం అంతర్జాతీయ హాకీకే అంకితం కావడం విశేషం. 14 ఏళ్లకే  తొలి మ్యాచ్‌ ఆడిన రాణి చాలా మందిలాగే విరిగిన హాకీ స్టిక్‌తో ఆట మొదలు పెట్టి ఆపై దూసుకుపోయింది. 

నిక్కీ ప్రధాన్‌ (జార్ఖండ్‌) 
నక్సలైట్లకు అడ్డాలాంటి ప్రాంతంనుంచి వచ్చి దేశానికి హాకీలో ప్రాతినిధ్యం వహించి తొలి హాకీ క్రీడాకారిణిగా నిలిచింది. ఆటపై పిచ్చితో హాకీ స్టిక్‌ కొనడం కోసమే కార్మికురాలిగా కూడా పని చేసింది. రాంచీ అకాడమీలో చేరిన తర్వాతే తొలిసారి ఆమెకు హాకీ స్టిక్, షూ లభించాయి.

నిషా వార్సి (హరియాణా) 
టైలర్‌గా పని చేస్తున్న తండ్రి హాకీ ఆడేందుకు ప్రోత్సహించాడు. ఆటలో వేగంగా ఎదుగుతున్న సమయంలో 2015లో పక్షవాతంతో తండ్రి కుప్పకూలడంతో తల్లితో పాటు ఒక ఫోమ్‌ ఫ్యాక్టరీలో పని చేయాల్సి రావడంతో కీలక సమయంలో అవకాశం కోల్పోయింది. అయితే పట్టుదలగా తిరిగొచ్చి ఆటలో సత్తా చాటింది. 

సుశీలా చాను (మణిపూర్‌) 
భారత జట్టులో సీనియర్‌ క్రీడాకారిణి. 2016 రియో ఒలింపిక్స్‌లో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. 

దీప్‌ గ్రేస్‌ ఎక్కా (ఒడిశా) 
అన్న దినేశ్‌ ఎక్కా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో స్ఫూర్తి పొందిన దీప్‌ తాను అదే స్థాయికి ఎదిగేందుకు చాలా కష్టపడింది.  ఇంట్లో పనులు చేసుకోకుండా ఆటలేంటి అంటూ ఊరంతా వెక్కిరించినా... కుటుంబ సభ్యుల మద్దతుతో ఆమె ముందుకు ఉరికింది. 

నేహా గోయల్‌ (హరియాణా)
ఇంట్లో తాగుబోతు తండ్రితో బాధలు పడలేక ఎక్కువ సమయం బయట గడిపే క్రమంలో నేçహాకు హాకీ పరిచయమైంది. సైకిల్‌ చక్రంలో ఒక పుల్లను బిగిస్తే ఐదు రూపాయలు ఇచ్చే ఫ్యాక్టరీలో తల్లితో కలసి పని చేసిన ఆమె, రెండు పూటలా మంచి భోజనంపై ఆశతో హాకీ హాస్టల్‌లో చేరి తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది.

ఉదితా దుహన్‌ (హరియాణా)
తండ్రి హ్యండ్‌ బాల్‌ క్రీడాకారుడు కావడంతో ఆటలపై ఆసక్తి పెంచుకున్న ఉదిత... హాకీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. జూనియర్‌ స్థాయిలో రాణించి సీనియర్‌ టీమ్‌లోకి ఎదిగింది. 

లాల్‌రెమ్‌సియామి (మిజోరం)
తన రాష్ట్రం నుంచి హాకీ జాతీయ జట్టుకు ఆడిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సియామి... కెరీర్‌ ఆరంభంలో హిందీ, ఇంగ్లీష్‌లలో ఏదీ రాకపోవడంతో చాలా కాలం సైగల భాషతోనే సహచరులతో సంభాషించేది. 

వందనా కటారియా (ఉత్తరాఖండ్‌)
ఒలింపిక్స్‌ సమయంలో ఎక్కువగా చర్చలోకి వచ్చిన పేరు. ఆమె ఆటను బట్టి కాకుండా కులం పేరుతో వందన దూషణకు గురైంది.  హరిద్వార్‌లో చుట్టుపక్కల వాళ్లంతా వెక్కిరించినా తండ్రి అండగా నిలబడి హాకీ నేర్పించాడు. ఆమె ఆటలో ఎదిగేందుకు తాను చేయగలిగినంతా చేసిన ఆయన మూడు నెలల క్రితం వందన... జాతీయ శిబిరంలో ఉన్న సమయంలో చనిపోయాడు. దురదృష్టవశాత్తు అంత్యక్రియలకు వెళ్లలేకపోయిన వందన... దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో హ్యట్రిక్‌ సాధించి కన్నీళ్లపర్యంతమైంది. 

సలీమా టెటె (జార్ఖండ్‌)
హాకీ ఆటకు సంబంధించి ఎలాంటి కనీస సౌకర్యాలు లేకుండా... రాళ్లు, రప్పలను కాస్త జరిపి మట్టి మైదానాన్ని సిద్ధం చేసుకుంటే తప్ప ఆడలేని పరిస్థితిలో సలీమా హాకీకి ఆకర్షితురాలు కావడం విశేషం. పొలంలో పని చేసి సంపాదించిన డబ్బుతో ఆమె స్టిక్‌ కొనుక్కుంది. 

నవనీత్‌ కౌర్‌ (హరియాణా)
2013నుంచి భారత జట్టులో రెగ్యులర్‌గా ఆడుతున్న కొందరిలో నవనీత్‌ కూడా ఉంది. రియో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న కౌర్‌... జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. 

మోనికా మలిక్‌ (హరియాణా)
భారత జట్టులో ఉన్నత విద్యావంతురాలు. పోలీస్‌ అయిన తండ్రి ప్రోత్సాహంతో హాకీలోకి వచ్చి సత్తా చాటిన మోనికా ఎంబీఏ పూర్తి చేసింది. 

షర్మిలా దేవి (హరియాణా)
జాతీయ స్థాయి హాకీ ఆటగాడైన తాతతో కలసి తొలిసారి మైదానానికి వెళ్లిన షర్మిలలో ఆటపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. అన్ని వైపులనుంచి దక్కిన ప్రోత్సాహంతో పూర్తిగా హాకీపైనే దృష్టి పెట్టింది. 

సవితా పూనియా (హరియాణా)
తాత ప్రోత్సాహం, తండ్రి సహకారంతో సవితా హాకీలోకి అడుగు పెట్టింది. అయితే గోల్‌కీపర్‌కు ఉండే భారీ కిట్‌తో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం బాగా ఇబ్బందిగా మారి ఒక దశలో ఆటను వదిలేద్దామని అనుకుంది. అయితే అప్పటికే స్థానిక పోటీల్లో గోల్‌ కీపర్‌గా వచ్చిన గుర్తింపునకు తగిన ప్రోత్సాహం కూడా దక్కడంతో ఆటను కొనసాగించింది. సుదీర్ఘ కాలంగా భారత గోల్‌కీపర్‌గా జట్టు విజయాల్లో ప్రధాన భాగంగా మారింది.

గుర్జీత్‌ కౌర్‌ (పంజాబ్‌)
తాను చదువుతున్న హాస్టల్‌ సమీపంలో హాకీ గ్రౌండ్‌ ఉండటంతో ఆటకు ఆకర్షితురాలైన గుర్జీత్‌... ఒక్కసారి హాకీ స్టిక్‌ తీసుకున్న తర్వాత వెనుదిరిగిచూడలేదు. ఆసీస్‌పై విజయంలో ఆమె చేసిన గోల్‌ కీలక పాత్ర పోషించింది. 

నవజోత్‌ కౌర్‌ (హరియాణా)
మెకానిక్‌ అయిన తండ్రి తన పిల్లల్లో ఒక్కరైనా క్రీడల్లో ఉండాలని కోరుకున్నాడు. ఆయన కల నెరవేర్చే క్రమంలో నవజోత్‌ హాకీ స్టిక్‌ అందుకుంది. 2012 నుంచి టీమ్‌లో ఆమె కీలక సభ్యురాలు.

>
మరిన్ని వార్తలు