‘ఆఖరి’ పరీక్షలో గెలుపెవరిది?

4 Mar, 2021 05:07 IST|Sakshi
రూట్, కోహ్లి

నేటి నుంచి భారత్, ఇంగ్లండ్‌ నాలుగో టెస్టు

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌

ఫైనల్‌పై టీమిండియా గురి

‘డ్రా’  చేసుకున్నా అవకాశం

సిరీస్‌ సమంపై ఇంగ్లండ్‌ ఆశలు

ఉదయం గం. 9:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

తొలి టెస్టులో అనూహ్య పరాజయం తర్వాత కోలుకొని వరుసగా రెండు మ్యాచ్‌లలో ను చిత్తు చేసిన భారత జట్టు అదే జోరులో మరో విజయంతో సిరీస్‌ను ముగించాలని పట్టుదలగా ఉంది. బలాబలాలు, పరిస్థితులు చూస్తే అన్నీ మన జట్టుకే అనుకూలంగా కనిపిస్తుండటంతో 3–1పై టీమిండియా గురి నిలిచింది. మ్యాచ్‌ గెలిచినా, కనీసం ‘డ్రా’ చేసుఇంగ్లండ్‌కున్నా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే స్థితిలో భారత్‌ నిలవగా... ఇప్పటికే ఆ అవకాశాలు కోల్పోయిన ఇంగ్లండ్‌ మాత్రం మొదటి మ్యాచ్‌ తరహాలో అసాధారణ ప్రదర్శనతో సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిస్తే ఆ జట్టు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.

అహ్మదాబాద్‌: 317 పరుగులు... 10 వికెట్లు... గత రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపు తేడా ఇది! మూడో టెస్టు మ్యాచ్‌ అయితే రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు సిరీస్‌లో ఆఖరి పోరుకు సన్నద్ధమయ్యాయి. నేటి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే నాలుగో టెస్టులో భారత్, ఇంగ్లండ్‌ తలపడతాయి. మరో గెలుపుతో స్వదేశంలో తమ సత్తా ఏమిటో చూపించాలని కోహ్లి సేన భావిస్తుండగా... గత ఫలితాలు మరచి మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే పట్టుదలతో ఈ మ్యాచ్‌కు రూట్‌ సేన సిద్ధమైంది.  

ఉమేశ్‌కు చాన్స్‌!
గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఒక మార్పు మినహా మిగిలిన భారత ఆటగాళ్లంతా బరిలోకి దిగే అవకాశం ఉంది. గెలుపు బాటలో ఉన్న జట్టును మార్చాల్సిన అవసరం కూడా కనిపించడం లేదు. విశ్రాంతి కోరుకున్న బుమ్రా స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ ఆడతాడు. సిరాజ్‌ కూడా అందుబాటులో ఉన్నా... సీనియర్‌గా, భారత గడ్డపై అద్భుత రికార్డు ఉన్న ఉమేశ్‌కు ప్రాధాన్యత లభించనుంది. అశ్విన్, అక్షర్‌ పటేల్‌ మరోసారి తమ స్పిన్‌తో ఇంగ్లండ్‌ను ఎంత తొందరగా పడగొడతారనేది ఆసక్తికరం. బ్యాటింగ్‌ బలాన్ని చూస్తున్నామని కోహ్లి కూడా స్పష్టంగా చెప్పడంతో బౌలర్‌గా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నా సరే, వాషింగ్టన్‌ సుందర్‌కు మరో అవకాశం ఖాయమైంది. అయితే స్పిన్నర్ల జోరుకు రెండు వరుస విజయాలు దక్కడంతో మన బ్యాటింగ్‌ వైఫల్యాన్ని ఎవరూ పట్టించుకోలేదనేది వాస్తవం. సొంతగడ్డపై పరుగుల వరద పారించే మన ఆటగాళ్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉండటం ఆశ్చర్యపరచింది. సిరీస్‌లో భారత్‌ తరఫున రోహిత్‌ శర్మ (296) ఎక్కువ పరుగులు చేయగా, అతనికి, రెండో స్థానంలో ఉన్న అశ్విన్‌ (176)కు మధ్య ఎంతో అంతరం ఉంది. కోహ్లి రెండు అర్ధసెంచరీలు చేసినా వాటిలో అతని ప్రత్యేకత కనిపించలేదు. ఇక రహానే, పుజారా, శుబ్‌మన్‌ గిల్‌లనుంచి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ రాలేదు. సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లోనైనా వీరంతా తమ స్థాయికి తగినట్లుగా ఆడాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. అయితే ఓవరాల్‌గా మాత్రం ఇంగ్లండ్‌తో పోలిస్తే మన జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.  

బ్యాటింగ్‌ తీరు మారేనా...
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 578 పరుగుల తర్వాత ఇంగ్లండ్‌ వరుసగా 178, 134, 164, 112, 81 స్కోర్లు చేసింది. ఈ స్కోర్లతో భారత గడ్డపై గెలుపు కోరుకోవడం అత్యాశే అవుతుంది. మూడో టెస్టులో భారత్‌ను 145కు ఆలౌట్‌ చేసిన తర్వాత కూడా ఘోరంగా ఓడిపోవడం జట్టు పరిస్థితిని సూచిస్తోంది. చివరి టెస్టులోనైనా స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఆ జట్టు ఏదైనా ప్రత్యేకంగా సాధన చేసిందా అనేది బరిలోకి దిగితే కానీ తెలీదు. రూట్‌ 333 పరుగులు చేసినా... అందులో 218 ఒకే ఇన్నింగ్స్‌లో వచ్చాయి. ఆ తర్వాత అతను స్పిన్‌ ఉచ్చులోనే చిక్కాడు. ఇక టాప్‌ ఆల్‌రౌండర్‌ అయిన స్టోక్స్‌ ఒక అర్ధ సెంచరీ మినహా బ్యాటింగ్‌లో ప్రభావం చూపలేకపోగా... బౌలింగ్‌లో వేసింది 15 ఓవర్లే. వీరిద్దరిని మినహాయిస్తే పెద్దగా అనుభవం లేని ఇతర బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడం రొటీన్‌గా మారింది. ఈ స్థితిలో ఇంగ్లండ్‌ తమ బ్యాటింగ్‌లో ఏమాత్రం నిలబడగలదనేది చూడాలి. బౌలింగ్‌లో ఒక్క లీచ్‌ మాత్రమే పిచ్‌ను వాడుకొని 16 వికెట్లు తీయగలిగినా, అతని స్థాయి కూడా అంతంత మాత్రమే. రెండు టెస్టుల్లో కలిపి ఒక్క వికెట్‌ కూడా తీయని బ్రాడ్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, గిల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, సుందర్, అక్షర్, ఉమేశ్, ఇషాంత్‌ శర్మ.  
ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), క్రాలీ, సిబ్లీ, బెయిర్‌స్టో, స్టోక్స్, పోప్, ఫోక్స్, బెస్, ఆర్చర్‌/స్టోన్, లీచ్, అండర్సన్‌.

పిచ్, వాతావరణం
మరోసారి స్పిన్‌కు బాగా అనుకూలించే పిచ్‌ను ఉపయోగిస్తారని స్పష్టంగా తేలిపోయింది. అయితే ఈసారి డే మ్యాచ్, ఎరుపు బంతి కాబట్టి బ్యాట్స్‌మెన్‌ పట్టుదలగా నిలబడితే పరుగులకు అవకాశం ఉంటుంది. వర్షసూచన ఏమాత్రం లేదు.

స్పిన్‌ పిచ్‌లపై ఇంకా అనవసరపు రచ్చ సాగుతోంది. అవతలి దేశం మీడియా విమర్శలకు మన మీడియా కూడా సరైన రీతిలో జవాబిస్తే చర్చ సరైన దిశలో జరుగుతుంది. కానీ అలా చేయకుండా వారి బాటలోనే వెళ్లి విమర్శలు చేస్తున్నారు. మరోవైపు సరైన డిఫెన్స్‌ ఆడటం చేతకాక ఇలా జరుగుతోంది. వరుసగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆడుతూ టెస్టులకు కావాల్సిన నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. గత కొన్నేళ్లుగా మా వరుస విజయాలు కారణం పిచ్‌లు ఎలాంటివో పట్టించుకోకుండా సరైన విధంగా సన్నద్ధం కావడమే. ఇక నిజాయితీగా చెప్పాలంటే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ అనేది మాలాంటి జట్లకు అవసరం లేదు. అలాంటివి లేకపోయినా టెస్టులు ఆడే ప్రేరణ మా జట్టుకు ఉంది. టెస్టులపై పెద్దగా ఆసక్తి చూపని ఇతర టీమ్‌లకు డబ్ల్యూటీసీ లాంటి అవసరం ఉండవచ్చు. మాకు ఏ టెస్టు మ్యాచ్‌ అయినా ఒకటే.
    –విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌
 

మరిన్ని వార్తలు