ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్‌.. విండీస్‌కు కూడా..!

4 Aug, 2023 16:44 IST|Sakshi

5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విండీస్‌తో నిన్న (ఆగస్ట్‌ 3) జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి నుంచి తేరుకోక ముందే ఐసీసీ భారత జట్టుకు మరో షాకిచ్చింది. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ఐసీసీ టీమిండియా మ్యాచ్‌ ఫీజ్‌లో 5 శాతం, విండీస్‌ మ్యాచ్‌ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది. నిర్దిష్ట సమయానికి భారత్‌ ఒక ఓవర్‌, విండీస్‌ రెండు ఓవర్లు వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఇరు జట్లకు జరిమానా విధించింది. 

కాగా, ట్రినిడాడ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్‌ 145 పరుగులకే పరిమితమైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో పూరన్‌ (41), కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ (48) రాణించగా.. భారత్‌ ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ (39) ఒక్కడే పర్వాలేదనిపించాడు.

భారత బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, చహల్‌ తలో 2 వికెట్లు, హార్దిక్‌, కుల్దీప్‌ చెరో వికెట్‌ పడగొట్టగా.. విండీస్‌ బౌలర్లు జేసన్‌ హోల్డర్‌, ఓబెద్‌ మెక్‌కాయ్‌, రొమారియో షెపర్డ్‌ తలో 2 వికెట్లు, అకీల్‌ హొసేన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. రెండో టీ20 ఆగస్ట్‌ 6న గయానాలో జరుగనుంది.

మరిన్ని వార్తలు