మంచి ఫలితాలు చూపడమే కీలకం

19 Jul, 2021 02:31 IST|Sakshi

సైనా నెహ్వాల్‌

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ తమదైన ప్రత్యేక ముద్ర వేయగలదని అంతా నమ్ముతున్నారు. ముఖ్యంగా వేర్వేరు క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం కూడా అందుకు కారణం. ఇప్పుడు క్రికెట్‌కు మాత్రమే కాకుండా ఇతర క్రీడలకూ గుర్తింపు లభిస్తుండటాన్ని మనం చూడవచ్చు. నాకు తెలిసి గత దశాబ్దకాలంలో భారత్‌లో వచ్చిన ప్రధాన మార్పు ఇది. ఇకపై మంచి ఫలితాలు సాధించి చూపడమే కీలకం. క్రీడాకారిణిగా ఎక్కువ సమయం ఆటపైనే దృష్టి పెట్టాల్సి రావడంతో వ్యవస్థ పనితీరు గురించి మరో కోణంలో చూడలేకపోయాను. అయితే కొన్నేళ్లుగా సానుకూల మార్పులు వస్తున్నాయనేది నాకు అర్థమైంది.

పోటీల కోసం విదేశాలకు వెళ్లేందుకు గతంలో ప్రభుత్వం ఆర్థికంగా సహకరించాల్సిన పరిస్థితి ఉండగా... కొత్తగా ఏర్పాటు చేసిన టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం (టాప్స్‌) పథకం ఎంతో మేలు చేసింది. గతంలో క్రీడా పరికరాలు కావాల్సిన ఉంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థను అడగాల్సి వచ్చేది. ఇప్పుడు ‘టాప్స్‌’ నుంచి సహాయం పొందడం ఆటగాళ్లకు ఎంతో సులువుగా మారింది. ప్రతీ నెలా ఇస్తున్న పాకెట్‌ అలవెన్స్‌ కారణంగా క్రీడాకారులు మంచి సౌకర్యాలు పొందేందుకు అవకాశం కలిగింది. అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడే క్రమంలో నిరంతరం క్రీడాకారులకు అందుబాటులో ఉంటూ వారు సరైన రీతిలో సన్నద్ధమయ్యేలా ప్రోత్సహిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. నా దృష్టిలో ఈ వ్యవస్థ మరింత మెరుగవుతూ ఆటగాళ్లకు ఈ విషయంలో ఎలాంటి బెంగ లేకుండా చేస్తోంది.

గత 10–15 ఏళ్లలో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు రావడం మన అదృష్టం. అయితే భారత బ్యాడ్మింటన్‌కు ‘మార్గదర్శి’గా నిలిచానని, ఆ తర్వాత మన స్థాయి పెరిగి ఎంతో మంది టాప్‌–50లోకి వచ్చారని నా గురించి చెప్పినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది.

నిజం చెప్పాలంటే నేను అనాసక్తితోనే ఆటల్లోకి వచ్చాను. అసలు ఒలింపిక్స్‌ ప్రాధాన్యత ఏమిటో కూడా తెలీదు. అయితే 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌కు తొలిసారి ఎంపిౖకైనప్పుడే దాని విలువ తెలుసుకున్న నేను, టీనేజర్‌గానే భారత్‌కు ఏదైనా చేయగలనని భావించాను. అక్కడే నేను పతకం సాధించగలిగేదానిని. ఇండోనేసియాకు చెందిన మారియా యులియాంటితో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మూడో గేమ్‌లో 11–3తో ఆధిక్యంలో ఉండి కూడా ఓడిపోయానంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నా. 2008లో నాపై పెద్దగా అంచనాలు కూడా లేవు. అయితే 2012లో కాంస్యం గెలిచి పోడియం మీద నిలబడినప్పుడు భారత త్రివర్ణపతాకం ఎగురుతుంటే దాని విలువేమిటో అర్థమైంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు