శతకాలతో శుభారంభం

16 Feb, 2024 03:54 IST|Sakshi

రోహిత్, జడేజా సెంచరీలు

భారత్‌ 326/5

అరంగేట్రంలోనే అర్ధ సెంచరీతో అదరగొట్టిన సర్ఫరాజ్‌ 

బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌పై టాస్‌ గెలిచిన భారత్‌ ఒక దశలో 33/3 స్కోరు వద్ద నిలిచింది. ఈ స్థితిలో రోహిత్, జడేజా 204 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే గురువారం ఆటలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆటగాడు మాత్రం సర్ఫరాజ్‌ ఖాన్‌.

సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ తన అవకాశం కోసం ఎదురు చూస్తున్న అతను ఎట్టకేలకు భావోద్వేగాల నడుమ భారత క్రికెటర్‌గా అరంగేట్రం చేశాడు. అంచనాలకు తగినట్లుగా చూడచక్కటి షాట్లతో అలవోకగా అర్ధ సెంచరీని అందుకున్నాడు.

జోరు మీదున్న దశలో దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగినా...తానేంటో అతను నిరూపించుకున్నాడు. ఇక మిగిలిన ఐదు వికెట్లతో రెండో రోజు భారత్‌ ఇంకా ఎన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం.  

రాజ్‌కోట్‌: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో భారత్‌కు శుభారంభం లభించింది. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.

రోహిత్‌ శర్మ (196 బంతుల్లో 131; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (212 బంతుల్లో 110 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించగా... సర్ఫరాజ్‌ ఖాన్‌ (66 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి.
 
ద్విశతక భాగస్వామ్యం... 
అండర్సన్‌ వేసిన మ్యాచ్‌ తొలి బంతిని యశస్వి (10) ఫోర్‌గా మలచడంలో భారత్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. అయితే వుడ్‌ జోరులో భారత్‌ రెండు పరుగుల తేడాతో యశస్వి, గిల్‌ (0) వికెట్లు కోల్పోయింది. హార్ట్‌లీ బంతిని ఆడలేక రజత్‌ పటిదార్‌ (5) కూడా సునాయాస క్యాచ్‌ ఇచ్చాడు. ఈ దశలో సర్ఫరాజ్‌ వస్తే ఒత్తిడిలో మరో వికెట్‌ పోయేదేమో! కానీ జట్టు వ్యూహాత్మకంగా కుడి, ఎడమ కాంబినేషన్‌ కోసం ఐదో స్థానంలో జడేజాను పంపించడం అద్భుతంగా పని చేసింది.

రోహిత్, జడేజా కలిసి జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. 29 పరుగుల వద్ద స్లిప్‌లో రూట్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్‌ లంచ్‌కు ముందు 71 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరామం తర్వాత పూర్తిగా భారత్‌ హవా సాగింది. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రోహిత్, జడేజా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. 97 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తయింది.

ఈ సెషన్‌లో భారత్‌ 27 ఓవర్లలో  92 పరుగులు చేసింది. ఈ జోడీని విడదీయలేక ఇంగ్లండ్‌ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ సిరీస్‌లో ఒక్క వికెట్‌ కూడా పడని తొలి సెషన్‌ ఇదే కావడం విశేషం. టీ తర్వాత తొలి ఓవర్లోనే రోహిత్‌ 157 బంతుల్లో తన కెరీర్‌లో 11వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పార్ట్‌నర్‌íÙప్‌ 200 పరుగులు దాటాక ఎట్టకేలకు ఇంగ్లండ్‌కు వికెట్‌ దక్కింది. షార్ట్‌ బంతులకు వరుసగా పరుగులు రాబట్టిన రోహిత్‌ చివరకు అదే షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు.  

సర్ఫరాజ్‌ రనౌట్‌... 
కొత్త ఆటగాడు సర్ఫరాజ్, జడేజా భాగస్వామ్యం జట్టును నడిపించింది. ముఖ్యంగా తన కెరీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ ఇంగ్లండ్‌ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్వీప్, లాఫ్టెడ్‌ షాట్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. సర్ఫరాజ్‌ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు జడేజా స్కోరు 84 కాగా... సర్ఫరాజ్‌ వెనుదిరిగే సమయానికి 99 మాత్రమే! 77 పరుగుల ఈ ఐదో వికెట్‌ భాగస్వామ్యంలో జడేజా 15 పరుగులు చేయగా, సర్ఫరాజ్‌ 62 పరుగులు చేశాడంటేనే అతని జోరు అర్థమవుతుంది.

93 పరుగుల వద్ద హార్ట్‌లీ బంతి జడేజా ప్యాడ్‌ను ముందుగా తగిలినా... ఇంగ్లండ్‌ బలంగా అప్పీల్‌ చేయలేదు. రీప్లేలో అతను అవుటయ్యేవాడని తేలింది! ధాటిగా ఆడిన సర్ఫరాజ్‌ 48 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ జడేజాతో సమన్వయ లోపం అతని ఆటను ముగించింది.

జడేజా 99 వద్ద అండర్సన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ కోసం ముందుకు వచ్చి మళ్లీ వెనక్కి తగ్గాడు. అప్పటికే ముందుకు వెళ్లిన సర్ఫరాజ్‌ వెనక్కి వచ్చేలోగా వుడ్‌ డైరెక్ట్‌ హిట్‌ వికెట్లను తాకింది. తర్వాతి బంతికే సింగిల్‌తో జడేజా టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తయింది. 

భావోద్వేగ క్షణాలు... 
రాజ్‌కోట్‌ టెస్టు ద్వారా ఇద్దరు ఆటగాళ్లు సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. సర్ఫరాజ్‌కు అనిల్‌ కుంబ్లే, జురేల్‌కు దినేశ్‌ కార్తీక్‌ టెస్టు క్యాప్‌లు అందించారు. రెండేళ్ల వ్యవధిలో 15 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల తర్వాత అవకాశం లభించిన వికెట్‌ కీపర్‌ జురేల్‌తో పోలిస్తే సర్ఫరాజ్‌ ప్రస్థానం భావోద్వేగభరితమైంది. అందుకే మ్యాచ్‌కు ముందు మైదానంలో అలాంటి దృశ్యాలు కనిపించాయి.

ఎనిమిదేళ్ల ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో దేశవాళీలో 70 సగటుతో భారీగా పరుగులు సాధించిన సర్ఫరాజ్‌ భారత్‌ తరఫున ఆడేందుకు ఎంతో కాలంగా ఎదురు చూశాడు. పలుమార్లు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అందుకే అరంగేట్రం ఖాయమైన క్షణాన కోచ్, మెంటార్‌ అయిన తండ్రి నౌషాద్‌ ఖాన్‌ తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.

చిన్నప్పటినుంచి అన్నీ తానే అయి సర్ఫరాజ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దిన ఆయన టెస్టు క్యాప్‌ను ముద్దాడి తన కొడుకును హత్తుకున్నాడు. సర్ఫరాజ్‌ అర్ధసెంచరీ పూర్తయినప్పుడు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. జడేజా కూడా ఆట ముగిసిన తర్వాత రనౌట్‌లో తనదే తప్పంటూ బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు!   

స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: యశస్వి (సి) రూట్‌ (బి) వుడ్‌ 10; రోహిత్‌ (సి) స్టోక్స్‌ (బి) వుడ్‌ 131; గిల్‌ (సి) ఫోక్స్‌ (బి) వుడ్‌ 0; పటిదార్‌ (సి) డకెట్‌ (బి) హార్ట్‌లీ 5; జడేజా (బ్యాటింగ్‌) 110; సర్ఫరాజ్‌ (రనౌట్‌) 62; కుల్దీప్‌ (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (86 ఓవర్లలో 5 వికెట్లకు) 326. వికెట్ల పతనం: 1–22, 2–24, 3–33, 4–237, 5–314. 
బౌలింగ్‌: అండర్సన్‌ 19–5–51–0, వుడ్‌ 17–2–69–3, హార్ట్‌లీ 23–3–81–1, రూట్‌ 13–1–68–0, రేహన్‌ 14–0–53–0. 

whatsapp channel

మరిన్ని వార్తలు