Wrestler Gurpreet Singh: గుర్‌ప్రీత్‌కు కాంస్యం

10 May, 2021 04:11 IST|Sakshi

సోఫియా (బల్గేరియా): వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌ను భారత్‌ కాంస్య పతకంతో ముగించింది. టోర్నీ చివరి రోజు ఆదివారం పురుషుల గ్రీకో రోమన్‌ 77 కేజీల విభాగంలో గుర్‌ప్రీత్‌ సింగ్‌ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. కాంస్య పతక బౌట్‌లో గుర్‌ప్రీత్‌ 4–2 పాయింట్ల తేడాతో విక్టర్‌ నెమిస్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌కు ఇదే చివరి అర్హత టోర్నీకాగా... ఈ టోర్నీ ద్వారా భారత్‌ రెండు ఒలింపిక్‌ బెర్త్‌లను ఖరారు చేసుకుంది.

పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో సుమిత్‌ మలిక్‌ (125 కేజీలు) రజతం నెగ్గి, మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో సీమా బిస్లా (50 కేజీలు) స్వర్ణ పతకం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కేవలం ఫైనల్‌కు చేరిన రెజ్లర్లే ఒలింపిక్‌ బెర్త్‌లు దక్కించుకున్నారు. గ్రీకో రోమన్‌ విభాగం 77 కేజీల విభాగంలో గుర్‌ప్రీత్‌ సింగ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఓడిపోయాడు. అయితే గుర్‌ప్రీత్‌ సింగ్‌ను ఓడించిన రఫీగ్‌ హుసెనోవ్‌ (అజర్‌బైజాన్‌) ఫైనల్‌కు చేరుకోవడంతో గుర్‌ప్రీత్‌ సింగ్‌కు ‘రెపిచాజ్‌’ పద్ధతిలో కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం దక్కింది. 

మరిన్ని వార్తలు