ఇండియా విజయం; మనసు కుదుటపడింది!

30 Dec, 2020 04:07 IST|Sakshi

ఎంత వద్దనుకున్నా ‘36’ జ్ఞాపకాలు ఒకవైపు వెంటాడుతూనే ఉంటాయి... అటు ఆటతో, ఇటు మాటతో కూడా జట్టును నడిపించే నాయకుడు వెళ్లిపోయాడు... మ్యాచ్‌కు ముందు ప్రధాన పేసర్‌ దూరమైతే, మ్యాచ్‌ మధ్యలో మరో పేసర్‌ బంతి వేయలేని పరిస్థితి... బరిలో ఇద్దరు కొత్త ఆటగాళ్లు... ఆపై టాస్‌ కూడా ముఖం చాటేసింది... ఇలాంటి ప్రతికూలతలకు ఎదురీది భారత జట్టు మెల్‌బోర్న్‌లో మరపురాని విజయాన్ని అందుకుంది. గత 20 ఏళ్లలో విదేశీ గడ్డపై భారత్‌ పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది.

పెర్త్‌ (2007), జొహన్నెస్‌బర్గ్‌ (2006), హెడింగ్లీ (2002), డర్బన్‌ (2010), అడిలైడ్‌ (2018), ట్రెంట్‌బ్రిడ్జ్‌ (2007)... వాటిలో కొన్ని. వాటితో పోలిస్తే తాజా విజయం ఏ స్థానంలో నిలుస్తుంది, దీని ప్రత్యేకత ఏమిటి?  గత ఘనతలతో సరిగ్గా పోల్చి చూడటం సరైంది కాకపోవచ్చు. ఏ మ్యాచ్‌ గొప్పతనం దానిదే. కానీ ప్రస్తుతం జట్టు ఉన్న స్థితిని చూస్తే ఇది చెప్పుకోదగ్గ ఘనతగానే కనిపిస్తుంది. గత మ్యాచ్‌ పరాభవాన్ని మరచి ఇలాంటి గెలుపు సాధించడం అంటే ఆట మాత్రమే ఉంటే సరిపోదు. అంతకుముందు మానసిక దృఢత్వం, పోరాటతత్వం కూడా ఉండాలి.

రహానే సేన దానిని ఇప్పుడు సరిగ్గా ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌కు ముందు గత 50 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై ఒక విదేశీ జట్టు 0–1తో వెనుకబడి తర్వాతి మ్యాచ్‌లో నెగ్గడం రెండుసార్లు మాత్రమే జరిగింది. ఇప్పుడు టీమిండియా దానిని చేసి చూపించింది. ప్రత్యర్థి స్కోరును రెండుసార్లు కూడా 200 దాటకుండా కట్టడి చేయడంలోనే మన బౌలింగ్‌ సత్తా కనిపించింది. బుమ్రా ఎప్పటిలాగే శుభారంభం అందిస్తే విదేశీ గడ్డపై మనకు కొత్త అశ్విన్‌ కనిపించాడు.

అనుభవంకొద్దీ రాటుదేలిన ఈ స్పిన్నర్‌ కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. విదేశీ గడ్డపై గత 14 టెస్టుల్లో కేవలం 25.8 సగటుతో అశ్విన్‌ 54 వికెట్లు తీయడం అతని బౌలింగ్‌ పదునెక్కిన తీరు ఏమిటో చెబుతుంది. ఇక అశ్విన్‌కు సరి జోడీగా జడేజా చూపించిన ఆట కూడా ఆసీస్‌ను దెబ్బ కొట్టింది. విదేశాల్లో మూడేళ్ల తర్వాత వీరిద్దరు ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడి జట్టును గెలిపించారు. ఇక బ్యాటిం గ్‌లో జడేజా ఇచ్చే అదనపు విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుజారా రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమైనా... రహానే మొత్తం భారాన్ని మోసి శతకం సాధించడంతో పాటు ఫీల్డింగ్‌ వ్యూహాల్లో కెప్టెన్‌ జట్టును నడిపించిన తీరుపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిశాయి.

ఎవరి గురించి ఎంత చెప్పినా మెల్‌బోర్న్‌ టెస్టు గిల్, సిరాజ్‌లకు అందరికంటే ప్రత్యేకంగా నిలుస్తుంది. వీరిద్దరి ఆట చూస్తే తొలి టెస్టు ఆడుతున్నట్లుగా ఏమాత్రం కనిపించలేదు. మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడమే కాకుండా... ఆసాం తం అదే జోష్‌ను ప్రదర్శించిన హైదరాబాదీ సిరాజ్‌ అందరి మనసులు గెలుచుకు న్నాడు. ఇక గిల్‌ ఆడిన క్లాసికల్‌ షాట్లు అతనికి మంచి భవిష్యత్తు ఉందని చూపించాయి. సిరీస్‌ తుది ఫలితం ఎలాగైనా ఉండ వచ్చు కానీ తాజా ప్రదర్శన మాత్రం భారత అభిమానుల్లో సంతోషం నింపిందనేది వాస్తవం.

కొసమెరుపు... మ్యాచ్‌ గెలిచిన తర్వాత భారత జట్టు ఏమైనా సంబరాలు చేసుకున్నట్లు కనిపించిందా... గాల్లోకి పంచ్‌లు విసురుతూ డగౌట్‌లోని ఆటగాళ్లు కూడా ఉత్సాహం ప్రదర్శించడం చూశామా... అసలు ఏమీ జరగనట్లు, ఏదో ఒక రొటీన్‌ మ్యాచ్‌ ఆడినట్లు, ఇలా గెలవడం తమకు కొత్త కాదన్నట్లు, ఇకపై ఆస్ట్రేలియాలో గెలవడం అద్భుతంగా భావించరాదని, మున్ముందు చాలా వస్తాయన్నట్లుగా మనోళ్ల స్పందన కనిపించింది. సిరీస్‌కు ముందు కోహ్లి చెప్పినట్లుగా ‘న్యూ ఇండియా’ అంటే ఇదే కావచ్చేమో! (చదవండి: రహానే అన్ని ప్రశంసలకు అర్హుడు: రవిశాస్త్రి)

మరిన్ని వార్తలు