సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌.. టీమిండియాలోకి యువ పేసర్‌

29 Dec, 2023 15:04 IST|Sakshi

జనవరి 3 నుంచి సౌతాఫ్రికాతో జరుగనున్న రెండో టెస్ట్‌ కోసం టీమిండియా ఓ మార్పు చేసింది. టెస్ట్‌ సిరీస్‌ కోసం తొలుత ఎంపిక చేయబడిన మొహమ్మద్‌ షమీ.. ఫిట్‌నెస్‌ క్లియెరెన్స్‌ లభించని కారణంగా సిరీస్‌ మొత్తానికే దూరం కాగా.. 27 ఏళ్ల మధ్యప్రదేశ్‌ పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌ షమీ స్థానంలో రెండో టెస్ట్‌ కోసం టీమిండియాలోకి వచ్చాడు. ఈ విషయాన్ని భారత సెలెక్టర్లు ఇవాళ (డిసెంబర్‌ 29) అధికారికంగా ప్రకటించారు.

ఆవేశ్‌ ఖాన్‌ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 6 వికెట్లతో రాణించిన కారణంగా రెండో టెస్ట్‌ కోసం అతన్ని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు చెప్పారు. ఆవేశ్‌ ఖాన్‌ భారత టెస్ట్‌ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఆవేశ్‌.. టీమిండియా తరఫున ఇప్పటివరకు 8 వన్డేలు, 19 టీ20లు ఆడి ఓవరాల్‌గా 27 వికెట్లు పడగొట్టాడు. 

కాగా, సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైన భారత్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మరింత దారణంగా విఫలమై 131 పరుగులకే కుప్పకూలింది.

తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించగా.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి (76) ఒంటరిపారాటం చేశాడు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో విరాట్‌తో పాటు కేవలం శుభ్‌మన్‌ గిల్‌ (26) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్‌ (3/50).. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బర్గర్‌ (4/33), జన్సెన్‌ (3/36) కుప్పకూల్చారు.

సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్‌ (56), మార్కో జన్సెన్‌ (84 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్‌ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో  బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్‌ 2, శార్దూల్‌ ఠాకూర్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, అశ్విన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. వచ్చే ఏడాది (2024) జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌ వేదికగా రెండో టెస్ట్‌ ప్రారంభంకానుంది. 

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్‌ భరత్ (వికెట్‌కీపర్‌), అభిమన్యు ఈశ్వరన్, అవేష్ ఖాన్

>
మరిన్ని వార్తలు