‘స్లెడ్జింగ్‌ మొదలు పెట్టగానే విషయం తెలిసింది’

23 Jan, 2021 05:00 IST|Sakshi

249 సార్లు శభాష్‌..!

సిడ్నీ టెస్టులో రవిశాస్త్రి ఉత్కంఠ

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో భారత జట్టు పోరాటపటిమ, అద్భుత ప్రదర్శన ఎప్పటికీ మరిచిపోలేనిది. ముఖ్యంగా సిడ్నీ టెస్టును అశ్విన్, విహారి కలిసి కాపాడుకున్న తీరు అసమానం. ఈ పర్యటనలో తాను ఆడిన తొలి మూడు టెస్టులకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్, జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌తో కలిసి పంచుకున్నాడు. మైదానంలో అశ్విన్, విహారి పోరాడుతున్న సమయంలో కోచ్‌లుగా తమ పరిస్థితి ఎలా ఉందో శ్రీధర్‌ గుర్తు చేసుకున్నాడు.

‘పుజారా అవుటయ్యాక ఆందోళన పెరిగిపోయింది. విహారికి కండరాలు పట్టేయడం కూడా రవిశాస్త్రికి ఆగ్రహం తెప్పించింది. ఒక్క సింగిల్‌ తీస్తేనే ఇలా జరుగుతుందా అని అతను కోప్పడ్డాడు. ఇక అశ్విన్, విహారి డిఫెన్స్‌ మొదలయ్యాక ప్రతీ బంతికి అతనిలో ఉత్కంఠ కనిపించింది. ఒక్క బంతి ఆడగానే సీట్‌లోంచి లేవడం, శభాష్‌ అంటూ మళ్లీ కూర్చోవడం...ఇలా ఇలా 249 బంతుల పాటు సాగింది. మ్యాచ్‌ ముగిసేవరకు ఈ భావోద్వేగాలు కొనసాగాయి’ అని శ్రీధర్‌ చెప్పాడు. అశ్విన్‌ కూడా విహారితో తన భాగస్వామ్యం గురించి చెప్పుకొచ్చాడు.

‘నేను స్పిన్‌ను సమర్థంగా ఆడతాను కాబట్టి లయన్‌ను ఎదుర్కోవాలని, పేసర్లను విహారి ఆడాలనేది ప్లాన్‌. అయితే ఒక దశలో సింగిల్‌ కారణంగా లెక్క మారిపోయింది.  కమిన్స్‌ బౌలింగ్‌లో దెబ్బలు తినకుండా ఆడటం అసాధ్యం. అదే నాకు జరిగింది. మధ్యలో శార్దుల్‌ ఠాకూర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి పరుగెత్తుకొచ్చాడు. ఏదో సందేశం ఉందని మేం భావిస్తే... హెడ్‌ కోచ్‌ మీకు ఏవేవో సూచనలు ఇవ్వమని నాకు చెప్పి పంపించాడు. అయితే నేను మాత్రం అవేమీ మీకు చెప్పను. మీరు ఎలా ఆడుతున్నారో అలాగే ఆడండి అని చెప్పి వెళ్లిపోయాడు. ఇది చెప్పడానికి నువ్వు రావాలా అన్నాను. ఆసీస్‌ పేలవ వ్యూహాలు కూడా మాకు మేలు చేశాయి.

నేను వంగడం కష్టమై నిటారుగా నిలబడుతుంటే నాకు బౌన్సర్లు వేశారు. అదే ముందుకొచ్చి ఆడేలా చేస్తే నేను బాగా ఇబ్బంది పడేవాడిని. పైన్‌ స్లెడ్జింగ్‌ మొదలు పెట్టగానే మమ్మల్ని అవుట్‌ చేసే విషయంలో వారు చేతులెత్తేశారని మాకు అర్థమైపోయింది’ అని అశ్విన్‌ వివరించాడు. అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత అదే రోజు అర్ధరాత్రి సమావేశంలోనే మెల్‌బోర్న్‌ టెస్టు కోసం వ్యూహరచన చేశామని శ్రీధర్‌ వెల్లడించాడు. 36కు ఆలౌట్‌ అయిన తర్వాత బ్యాటింగ్‌ను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టకుండా అదనపు బౌలర్‌ను తీసుకోవాలనే ఆలోచన బాగా పని చేసిందని, జడేజా అద్భుతంగా ఆడాడని అతను కితాబునిచ్చాడు. పైగా ఆసీస్‌ బౌలర్లు ఒకే లైన్‌లో బంతులు వేస్తున్న విషయంపై చర్చించి ఎడమ చేతివాటం ఆటగాడు ఉంటే బాగుంటుందని భావించి పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు.  

జూలైలోనే వ్యూహరచన
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆఫ్‌సైడ్‌ వైపు ఆడే అవకాశాలు బాగా తగ్గిస్తే తాము పైచేయి సాధించవచ్చనే ప్రణాళికను సిరీస్‌కు చాలా రోజుల ముందుగా వేసినట్లు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ వెల్లడించాడు. సిరీస్‌లో లెగ్‌ సైడ్‌ ఆడబోయి కీలక ఆటగాళ్లు స్మిత్, లబ్‌షేన్‌ వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు పట్టు చిక్కింది. ‘స్మిత్, లబ్‌షేన్‌ ఎక్కువగా కట్, పుల్‌ షాట్లతో పాటు ఆఫ్‌ సైడ్‌ పరుగులు సాధించే బ్యాట్స్‌మెన్‌. అయితే న్యూజిలాండ్‌ పేసర్‌ వాగ్నర్‌ కొద్ది రోజుల ముందు లెగ్‌ సైడ్‌ బౌలింగ్‌ చేసి స్మిత్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. ఇది చూసి పన్నిన వ్యూహం అద్భుతంగా పని చేసింది’ అని అరుణ్‌ వివరించారు. ఆస్ట్రేలియా పర్యటనలో లభించిన ఆణిముత్యం సిరాజ్‌ అని హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత బాధను దిగమింగి అతను జట్టు కోసం చేసిన ప్రదర్శనను ఎంత ప్రశంసించినా తక్కువేనని అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం అశ్విన్, వాషింగ్టన్‌ సుందర్‌ స్వస్థలం చెన్నై చేరుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటైన్‌కు వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు