IND Vs SL: ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిస్తేనే..

7 Jan, 2023 04:53 IST|Sakshi

సిరీస్‌ విజయంపై భారత్‌ దృష్టి 

నేడు శ్రీలంకతో చివరి టి20  

టీమిండియాపైనే ఒత్తిడి 

రా.గం.7 నుంచి ‘స్టార్‌స్పోర్ట్స్‌–1’లో ప్రసారం  

రాజ్‌కోట్‌: టి20 సిరీస్‌లో ఆఖరి పోరుకు భారత్, శ్రీలంక సిద్ధమయ్యాయి. ఇరు జట్ల లక్ష్యం ఒక్కటే... సిరీస్‌ వశం చేసుకోవడం. దీంతో నిర్ణాయక పోరు మరింత ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌ ఫలితం, ప్రదర్శన చూస్తే ఆతిథ్య జట్టు కంటే శ్రీలంక జట్టే మేటిగా ఉంది. టీమిండియా గతి తప్పిన బౌలింగ్, టాపార్డర్‌ వైఫల్యం ఏమాత్రం కొనసాగినా మ్యాచే కాదు... సిరీస్‌నే మూల్యంగా చెల్లించుకోవాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఒత్తిడంతా భారత శిబిరంపైనే ఉంది. పొట్టి సిరీస్‌ గెలుచుకోవాలంటే గట్టి పోరాటం చేయాల్సిందే! 

ఓపెనర్లు మెరిపించాలి 
గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇషాన్‌ కిషన్, శుబ్‌మన్‌ గిల్‌ నిరాశపరిచారు. వీరిద్దరు శుభారంభం ఇవ్వలేకపోయారు. తొలి మ్యాచ్‌లో కిషన్‌ రాణించినా పెద్దగా మెరిపించలేకపోయాడు. కీలకమైన ఆఖరి పోరులో ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. లేదంటే అది ఇన్నింగ్స్‌పై కచి్చతంగా ప్రభావం చూపిస్తుంది. సూర్యకుమార్‌ ఫామ్‌లో ఉన్నాడు. అతనిపై జట్టు మేనేజ్‌మెంట్‌కు ఏ బెంగా లేదు. అక్షర్‌ పటేల్‌ రూపంలో అదనపు బ్యాటింగ్‌ బలం కనిపిస్తున్నప్పటికీ రెగ్యులర్‌ బ్యాటర్లు హార్దిక్‌ పాండ్యా, దీపక్‌ హుడా బ్యాట్లకు పనిచెబితేనే లంక బౌలింగ్‌పై పట్టు సాధించవచ్చు. అప్పుడే పోరాడే స్కోరైనా... ఛేదించే లక్ష్యమైనా సాకారమవుతుంది.  

బెంగంతా బౌలింగ్‌పైనే... 
ఈ సిరీస్‌లో భారత బౌలింగ్‌ తీసికట్టుగానే ఉంది. ప్రధాన బౌలర్లే ఓవర్‌కు పది పైచిలుకు పరుగులు ఇవ్వడం జట్టును ఆందోళన పరుస్తోంది. అర్‌‡్షదీప్‌ గత మ్యాచ్‌ ‘నోబాల్స్‌’ను మరిచి లయ అందుకోవాల్సి ఉంది. ఉమ్రాన్‌ మలిక్‌ నిప్పులు చెరుగుతున్నప్పటికీ వైవిధ్యం కొరవడటంతో ధారాళంగా పరుగులు సమరి్పంచుకుంటున్నాడు. చహల్‌ మ్యాజిక్‌ కరువైంది. మొత్తంగా నిలకడలేని బౌలింగ్‌ జట్టుకు ప్రతికూలంగా పరిణమించింది. నిర్ణాయక పోరులో సమష్టి బాధ్యత కనబరిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. లేదంటే కష్టాలు తప్పవు. 

ఆత్మవిశ్వాసంతో లంక సేన 
గత మ్యాచ్‌ ఫలితమే కాదు... ఆటతీరు కూడా శ్రీలంక జట్టులో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. బ్యాటింగ్‌లో మెరుపులు, ఆరంభంలో వికెట్లు షనక సేనను పైచేయిగా నిలబెట్టింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్‌ మెండిస్‌లతో పాటు అసలంక, షనక ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కసున్‌ రజిత, మదుషంక, షనక సమష్టిగా భారత బ్యాటర్స్‌ను వణికించారు. సిరీస్‌ను తేల్చే ఈ మ్యాచ్‌లోనూ తమ జోరు కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌కు స్వర్గధామమైన రాజ్‌కోట్‌ పిచ్‌పై మరోసారి తమ బ్యాటింగ్‌ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.

మరిన్ని వార్తలు