IND Historic Series Win Vs AUS 2020-21: బిగ్‌స్క్రీన్‌పై చారిత్రక టెస్టు సిరీస్‌.. రోమాలు నిక్కబొడుచుకునేలా ట్రైలర్‌

2 Jun, 2022 13:06 IST|Sakshi

భారత క్రికెట్‌ చరిత్రలో ఎన్నో మైలురాళ్లు దాగున్నాయి. ఐసీసీ ట్రోపీలు గెలవడంతో పాటు పలు చారిత్రక సిరీస్‌ల్లో విజయాలు సాధించిన కోట్ల మంది అభిమానుల గుండెలు ఉప్పొంగేలా చేసింది. 1983లో ఐసీసీ టోర్నీ అయిన వరల్డ్‌కప్‌ గెలవడం ఒక చరిత్ర. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్‌ డెవిల్స్‌ లార్డ్స్‌ బాల్కనీలో నుంచొని వరల్డ్‌కప్‌ అందుకుంటే మన నరాల్లో దేశభక్తి పొంగిపోయింది. అప్పటి వరల్డ్‌కప్‌ విజయాన్ని దేశంలో ప్రజలు పెద్ద పండుగగా నిర్వహించుకున్నారు.

ఆ తర్వాత సచిన్‌ టెండూల్కర్‌ భారత క్రికెట్లో ఒక పెను సంచలనం. అతన్ని భారతీయులు ఒక క్రికెట్‌గాడ్‌గా అభివర్ణించారు. ఇక 2007 టి20 ప్రపంచకప్‌ను యువ రక్తంతో నిండిన జట్టు సొంతం చేసుకోవడం.. 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ధోని ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ దేశానికి రెండోసారి వరల్డ్‌కప్‌ అందించిన సంఘటన భారత్‌ క్రికెట్‌ బతికున్నంతవరకు నిలిచిపోతుంది. ఆ తర్వాత 2013లో చాంపియన్స్‌ ట్రోపీ, 2019లో వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 

అయితే ఇవన్నీ ఐసీసీ మేజర్‌ టోర్నమెంట్‌లు. వీటికున్న క్రేజ్‌ వేరుగా ఉంటుంది. సాధారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లను ప్రజలు పట్టించుకోరు. కానీ 2020-21లో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్‌ గావస్కర్‌ ట్రోపీని 2-1తో కైవసం చేసుకోవడం భారత క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోతుంది. భారత్‌ క్రికెట్‌ గురించి ఇకపై ఎప్పుడు మాట్లాడినా ఈ సిరీస్‌కు గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిందే.. కాదు చర్చించుకునేలా చేసింది.

తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్‌ నిరూపించింది. 2018-19లోనూ టీమిండియా ఆసీస్‌ గడ్డపై ట్రోపీ గెలిచినప్పటికి.. దానిని దీనితో పోల్చలేం. ఎందుకంటే ఈ సిరీస్‌ను భారత్‌ ఓటమితో ప్రారంభించింది. అడిలైడ్‌ వేదికగా జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో 36 పరుగులకే ఆలౌటై అవమానకర రీతిలో ఓడిపోయింది. కోహ్లి కెప్టెన్సీలో ఆడిన తొలి టెస్టు టీమిండియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ఆ తర్వాత కోహ్లి పెటర్నిటీ సెలవుపై స్వదేశం వెళ్లడం.. బుమ్రా, షమీలు గాయాలతో ఇబ్బంది పడడంతో ఒక్కసారిగా టీమిండియాకు కష్టాలు చుట్టుముట్టాయి. ఈ పరిస్థితులో రహానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఓటమితో దెబ్బతిన్న జట్టును తన నాయకత్వ పటిమతో రహానే తిరిగి నిలబెట్టాడు. అడిలైడ్‌ టెస్ట్‌లో ఓటమి అనంతరం, రహానే సారధ్యంలో టీమిండియా మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-1తో సిరీస్‌ను సమం చేసింది. అనంతరం సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ డ్రా కాగా, సిరీస్‌ డిసైడర్‌ అయిన కీలక నాలుగో టెస్ట్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి 4 టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. గబ్బాలో ఓటమెరుగని ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన టీమిండియా అద్భుత విజయంతో సిరీస్‌ను ముగించింది.

వాస్తవానికి ఓటమి దెబ్బలు తిని మళ్లీ గెలుపు ఎలా దక్కించుకోవాలో టీమిండియాను చూస్తే అర్థమవుతుంది. అందుకే ఈ చారిత్రక సిరీస్‌ను బిగ్‌స్క్రీన్‌పై డాకుమెంట్‌ రూపంలో చూపించాలనుకున్నాడు దర్శకుడు నీరజ్‌ పాండే. నీరజ్‌ పాండే.. స్పెషల్‌ 26, బేబీ, ఎంఎస్‌ ధోని లాంటి మంచి అభిరుచి ఉన్న సినిమాలకు దర్శకత్వం వహించాడు. మాములుగానే తన సినిమాలో భావోద్వేగాలను తారాస్థాయిలో చూపించే ఈ దర్శకుడు.. ఇలాంటి దానిని మాములుగా వదలిపెడతాడా.. సందేహం లేదు.


తాజాగా డాక్యమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను జూన్‌ 1న(బుధవారం) ఆ సిరీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన అజింక్యా రహానే, సిరాజ్‌​, హనుమ విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌, చతేశ్వర్‌ పుజారాలు విడుదల చేశారు. నీరజ్‌ పాండే 'బంధన్‌ మే తా ధమ్‌' పేరుతో సిరీస్‌ను నిర్మించాడు. సిరీస్‌లో జరిగిన సంఘటనలను ఒక అంశాలుగా తీసుకొచ్చి.. మధ్యమధ్యలో రహానే,సిరాజ్‌లు తమ అనుభవాలను పంచుకునేలా ఆసక్తికరంగా ట్రైలర్‌ను కట్‌చేశారు. మొత్తానికి రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న ట్రైలర్‌ను మించి డాక్యుమెంట్‌ ఉండబోతుందని అర్థమవుతుంది. కాగా జూన్‌ 16 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ప్లామ్‌ అయిన వూట్‌ సెలెక్ట్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. 

చదవండి: Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా!

Happy Birthday Dinesh Karthik: దినేశ్‌ కార్తిక్‌.. ఫెయిల్యూర్‌ మ్యారేజ్‌ టూ సక్సెస్‌ఫుల్‌ లవ్‌స్టోరీ

మరిన్ని వార్తలు