ఇంగ్లండ్‌తో సిరీస్‌పై‌ క్లారిటీ ఇచ్చిన దాదా

24 Aug, 2020 10:35 IST|Sakshi

ఫిబ్రవరిలో భారత్‌ రానున్న ఇంగ్లండ్‌

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటన

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్‌లో ఇంగ్లండ్‌ పర్యటన ఖాయమైంది. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించాడు. 2021 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో పూర్తిస్థాయి సిరీస్‌కు ఆతిథ్యమిస్తున్నట్లు ‘దాదా’ తెలిపాడు. వాస్తవానికి ఇంగ్లండ్‌ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లలో భారత్‌లో పర్యటించి మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సింది. అయితే కరోనా కారణంగా ఈ సిరీస్‌ వాయిదా పడింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌ సిరీస్‌తోనే సొంతగడ్డపై భారత అంతర్జాతీయ సీజన్‌ ప్రారంభమవుతుంది.

ఇక 2021లో ఐపీఎల్‌ టి20 టోర్నీ 14వ సీజన్‌ ఏప్రిల్‌లో మొదలవుతుందని... టి20 ప్రపంచకప్‌ (2021), ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ (2023)లను కూడా బీసీసీఐ నిర్వహించనున్నట్లు అనుబంధ క్రికెట్‌ సంఘాలకు పంపించిన మెయిల్‌లో గంగూలీ తెలిపాడు. ‘భవిష్యత్‌ పర్యటనల ప్రణాళిక (ఎఫ్‌టీపీ) ప్రకారం బీసీసీఐ, భారత క్రికెట్‌ నడుచుకుంటుంది. దీని ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. స్వదేశానికి వచ్చాక ఫిబ్రవరిలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఆడుతుంది. తర్వాత ఏప్రిల్‌లో ఐపీఎల్‌ను నిర్వహిస్తాం. 2021లో ఐసీసీ టి20 ప్రపంచకప్‌తో పాటు 2023లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిస్తాం. మహిళల క్రికెట్‌ జట్టు షెడ్యూల్‌పై చర్చలు జరుగుతున్నాయి’ అని భారత మాజీ కెప్టెన్‌ గంగూలీ వెల్లడించాడు.

కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే దేశవాళీ క్రికెట్‌ను ప్రారంభిస్తామని రాష్ట్ర సంఘాలకు హామీ ఇచ్చాడు. నవంబర్‌ చివరి వారంలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీతో దేశవాళీ క్రికెట్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ‘పరిస్థితులు సద్దుమణిగాక దేశవాళీ క్రికెట్‌ను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నాం. మ్యాచ్‌లతో పోలిస్తే ఆటగాళ్ల ఆరోగ్యమే మాకు ముఖ్యం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సీజన్‌ను ప్రారంభిస్తాం. సురక్షితంగా టోర్నీలను నిర్వహించేందుకు మీరు కూడా తోచిన సలహాలను బీసీసీఐతో పంచుకోవచ్చు’ అని గంగూలీ అనుబంధ సంఘాలకు తెలిపాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు