IND Vs BAN: టార్గెట్‌ 145.. 45 పరుగులకే నాలుగు వికెట్లు; టీమిండియా గెలిచేనా!

24 Dec, 2022 16:32 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికి టీమిండియా 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా టాపార్డర్‌ పూర్తిగా చేతులెత్తేసింది. కేఎల్‌ రాహుల్‌ 2 పరుగులు చేసి ఔటవ్వగా.. శుబ్‌మన్‌ గిల్‌ ఏడు పరుగులు, పుజారా ఆరు పరుగులు చేసి వికెట్‌ సమర్పించుకున్నారు. ఇక కోహ్లి 22 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. 

మూడో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నప్పటికి పిచ్‌ బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తుండడంతో టీమిండియా విజయంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్షర్‌ పటేల్‌(22 పరుగులు బ్యాటింగ్‌), నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన జయదేవ్‌ ఉనాద్కట్‌ 3 పరుగులుతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా విజయానికి మరో 100 పరుగుల దూరంలో ఉంది.

అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 231 పరుగులకు ఆలౌట్‌ అయింది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో లిటన్‌ దాస్‌ 71 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. జాకీర్‌ హసన్‌ 51 పరుగులు చేశాడు. ఇక నురుల్‌ హసన్‌, తస్కిన్‌ అహ్మద్‌లు తలా 31 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ మూడు వికెట్లు తీయగా.. మహ్మద్‌ సిరాజ్‌, అశ్విన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

మరిన్ని వార్తలు