Legends League Cricket 2022: పఠాన్‌ బ్రదర్స్‌ విధ్వంసం.. ఇండియా మహారాజాస్‌ ఘన విజయం

17 Sep, 2022 07:19 IST|Sakshi

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో భాగంగా బీసీసీఐ ఇండియా మహారాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ నిర్వహించింది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా  శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. పంకజ్‌ సింగ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్‌లో తన్మయ్‌ శ్రీవాత్సవ, యూసఫ్‌ పఠాన్‌లు హాఫ్‌ సెంచరీలతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన వరల్డ్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్‌ ఒబ్రెయిన్‌ 52, దినేశ్‌ రామ్‌దిన్‌(42 పరుగులు నాటౌట్‌), తిసార పెరీరా 23 పరుగులతో రాణించారు. ఇండియా మహారాజాస్‌ బౌలింగ్‌లో పంకజ్‌ సింగ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. హర్భజన్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, జోగిందర్‌ శర్మ తలా ఒక వికెట్‌ తీశారు.

అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వీరేంద్ర సెహ్వాగ్‌ 4 పరుగులు చేసి నిరాశ పరచగా.. తన్మయ్‌ శ్రీవాత్సవ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో పఠాన్‌ బ్రదర్స్‌.. యూసఫ్‌ పఠాన్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు. వరల్డ్‌ జెయింట్స్‌ బౌలింగ్‌లో టిమ్‌ బ్రెస్నన్‌ 3 వికెట్లు తీయగా.. ఫిడెల్‌ ఎడ్‌వర్డ్స్‌ ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: ఫెదరర్‌ ఆస్తి విలువ ఎంతో తెలుసా?

>
మరిన్ని వార్తలు