LLC 2022: కొంప ముంచిన వికెట్‌ కీపర్‌ హెల్మెట్‌

17 Sep, 2022 08:04 IST|Sakshi

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శుక్రవారం ఇండియా మహారాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వికెట్‌ కీపర్‌ హెల్మెట్‌ ఇండియా మహారాజాస్‌ కొంపముంచింది.

వరల్డ్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఇది చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ అశోక్ దిండా వేశాడు. ఓవర్‌ మూడో బంతిని ఫుల్‌లెంగ్త్‌తో వేశాడు. క్రీజులో ఉన్న పెరీరా టచ్‌ చేయాలని చూశాడు. కానీ బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొని కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ వైపు వెళ్లింది. అయితే పార్థివ్‌ బంతిని అడ్డుకోలేకపోయాడు. దీంతో బౌండరీ వెళుతుందని మనం అనుకునేలోపే కీపర్‌ హెల్మెట్‌కు తాకిని బంతి అక్కడే ఆగిపోయింది. దీంతో నిబంధనల ప్రకారం అంపైర్‌ బైస్‌ రూపంలో ఇండియా మహారాజాస్‌కు ఐదు పరుగుల ఫెనాల్టీ విధించారు.ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఇండియా మహారాజాస్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వరల్డ్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్‌ ఒబ్రెయిన్‌ 52, దినేశ్‌ రామ్‌దిన్‌(42 పరుగులు నాటౌట్‌), తిసార పెరీరా 23 పరుగులతో రాణించారు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.తన్మయ్‌ శ్రీవాత్సవ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో పఠాన్‌ బ్రదర్స్‌.. యూసఫ్‌ పఠాన్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు.

మరిన్ని వార్తలు