ICC ODI Rankings: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్థానం?

28 Jul, 2022 13:16 IST|Sakshi

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మ, కోహ్లి, బుమ్రా, షమీ లాంటి సీనియర్ల గైర్హాజరీలో ధావన్‌ నాయకత్వంలోని యువ జట్టు కరేబియన్‌ గడ్డపై అదరగొట్టింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి విండీస్‌ను సొంతగడ్డపై మట్టికరిపించిన తొలి టీమిండియా జట్టుగా చరిత్ర సృష్టించింది.  ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా మూడో స్థానానికి చేరుకుంది.

ఇంతకముందు 106 పాయింట్లతో పాకిస్తాన్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్న టీమిండియా.. విండీస్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా నాలుగు పాయింట్లు మెరుగుపరుచుకొని 110 పాయింట్లతో భారత్‌ మూడో స్థానానికి చేరుకోగా.. పాకిస్తాన్‌ 106 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. 101 పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఇక 128 పాయింట్లతో న్యూజిలాండ్‌ టాప్‌లో ఉండగా.. 119 పాయింట్లతో ఇంగ్లండ్‌ రెండో స్థానంలో ఉంది. 

ఇక విండీస్‌తో వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. ఆఖరి మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించినప్పటికి టీమిండియా స్పష్టమైన ఆధిక్యం చూపెట్టి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ సమయంలో వరుణుడు రెండుసార్లు అడ్డు తగలడంతో మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు. గిల్‌తో పాటు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ కూడా అర్థ సెంచరీ చేయడం.. శ్రేయాస్‌ అయ్యర్‌ 44 పరుగులతో ఆకట్టుకోవడంతో 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది. డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో భారత జట్టు నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 137 పరుగులకే విండీస్‌ జట్టు కుప్పకూలింది.

దీంతో టీమిండియా 119 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ ఆటగాళ్లలో బ్రాండన్‌ కింగ్‌ 42, నికోలస్‌ పూరన్‌ 42, హోప్‌ 22 పరుగులు చేశారు.  భారత బౌలర్లలో చహల్‌ 4, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో రెండు వికెట్లు, అక్షర్‌ పటేల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణా చెరో వికెట్‌ తీసుకున్నారు. ఇక వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ విజయంపై కన్నేసింది. జూలై 29 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్‌ జరగనుంది. 

చదవండి: IND Vs WI: ఆర్‌సీబీ అత్యుత్సాహం.. గిల్‌ విషయంలో తప్పుడు ట్వీట్‌

ODI Cricket: 'వన్డే క్రికెట్‌కు ముప్పు లేదు'.. కుండ బద్దలు కొట్టిన ఐసీసీ

మరిన్ని వార్తలు