Uber Cup: 11 ఏళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్స్‌కు

14 Oct, 2021 07:30 IST|Sakshi

అర్హుస్‌ (డెన్మార్క్‌): థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో 11 ఏళ్ల తర్వాత భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. తాహితి జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘సి’ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0తో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండో గెలుపుతో ఈ టోర్నీలో 2010 తర్వాత భారత్‌కు నాకౌట్‌ బెర్త్‌ ఖరారైంది. ఇదే గ్రూప్‌ నుంచి చైనా కూడా క్వార్టర్స్‌కు చేరింది. నేడు భారత్, చైనా మధ్య జరిగే మ్యాచ్‌ విజేత గ్రూప్‌ టాపర్‌గా నిలుస్తుంది.

తాహితి జట్టుతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో సాయిప్రణీత్‌ 21–5, 21–6తో లూయిస్‌ బిబోయిస్‌ను ఓడించాడు. రెండో మ్యాచ్‌లో సమీర్‌ వర్మ 21–12, 21–12తో రెమి రోస్‌పై, మూడో మ్యాచ్‌లో కిరణ్‌ జార్జి 21–4, 21–2తో మౌబ్లాంక్‌పై గెలవడంతో భారత్‌ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తర్వాత రెండు డబుల్స్‌ మ్యాచ్‌ల్లో కృష్ణప్రసాద్‌–విష్ణువర్ధన్‌ గౌడ్‌; సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జోడీలు తమ ప్రత్యర్థి జంటలపై గెలుపొందాయి. మరోవైపు ఉబెర్‌ కప్‌లో ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత మహిళల జట్టు గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 0–5తో థాయ్‌లాండ్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌తో భారత్‌ ఆడనుంది.  

మరిన్ని వార్తలు