ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే టోర్నీకి భారత్‌ దూరం

29 Apr, 2021 05:56 IST|Sakshi

భారత్‌ నుంచి నెదర్లాండ్స్‌ ప్రభుత్వం విమానాలు రద్దు చేసిన ఫలితం

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ అయిన ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే టోర్నమెంట్‌ నుంచి భారత అథ్లెటిక్స్‌ జట్టు వైదొలిగింది. పోలాండ్‌లోని సిలెసియా నగరంలో మే 1, 2 తేదీల్లో ఈ టోర్నీ జరుగుతుంది. భారత మహిళల 4గీ100 మీటర్ల రిలే, పురుషుల 4గీ400 మీటర్ల రిలే జట్టు సభ్యుల కోసం భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) నెదర్లాండ్స్‌కు చెందిన కేఎల్‌ఎమ్‌ రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా గురువారం ఉదయం న్యూఢిల్లీ నుంచి అమ్‌స్టర్‌డామ్‌ వరకు విమానం టికెట్లను బుక్‌ చేసింది. అమ్‌స్టర్‌డామ్‌ నుంచి కనెక్టింగ్‌ ఫ్లయిట్‌లో భారత జట్లు పోలాండ్‌కు వెళ్లాల్సింది. అయితే కరోనా కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ నుంచి తమ దేశానికి వచ్చే విమానాలను నెదర్లాండ్స్‌ ప్రభుత్వం సోమవారం రాత్రి నుంచి రద్దు చేసింది.

భారత్‌ నుంచి నేరుగా పోలాండ్‌కు విమానాలు లేకపోవడంతో ఏఎఫ్‌ఐ ముందుగా అమ్‌స్టర్‌డామ్‌కు టికెట్లు బుక్‌ చేసి అక్కడి నుంచి పోలాండ్‌కు పంపించే ఏర్పాట్లు చేసింది. ‘యూరప్‌లోని ఇతర నగరాల నుంచి పోలాండ్‌కు వెళ్లేందుకు ఏమైనా ఫ్లయిట్స్‌ ఉన్నాయా అని తీవ్రంగా ప్రయత్నించాం. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దాంతో ఈ టోర్నీ నుంచి భారత జట్లు వైదొలగక తప్పలేదు’ అని ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు అదిలె సుమరివల్లా తెలిపారు.  భారత మహిళల 4గీ100 రిలే జట్టులో హిమ దాస్, ద్యుతీ చంద్, ధనలక్ష్మీ, అర్చన, ధనేశ్వరి, హిమశ్రీ రాయ్‌ సభ్యులుగా ఉన్నారు. వరల్డ్‌ రిలే టోర్నీలో టాప్‌–8 లో నిలిచిన జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి.   

మరిన్ని వార్తలు