Ind Vs Pak: ‘ఇండియా ఎవరి మాట వినదు.. మా దేశానికి రమ్మని పాక్‌ను బతిమాలేది లేదు..!’

20 Oct, 2022 15:43 IST|Sakshi

ఆసియా కప్‌ నిర్వహణ అంశంపై పాక్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చిన కేంద్ర క్రీడల మంత్రి

పాకిస్తాన్‌ వేదికగా వచ్చే ఏడాది జరుగబోయే ఆసియా కప్‌ వన్డే టోర్నీలో భారత్‌ పాల్గొనదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. జై షా చేసిన ఈ ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు) తీవ్రంగా స్పందించింది. ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత్‌.. పాకి​స్తాన్‌లో అడుగుపెట్టకపోతే, ఇండియాలో జరిగే 2023 వన్డే వరల్డ్‌కప్‌ను తాము బాయ్‌కాట్‌ చేస్తామని పీసీబీ బెదిరింపులకు దిగింది. 

ఈ ఉదంతంపై తాజాగా భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనమని ఎవరిని బతిమాలేది లేదని పాక్‌ను ఉద్దేశిస్తూ ఘాటుగా బదులిచ్చారు. వచ్చే వారికి భారత్‌ సాదరంగా స్వాగతం పలుకుతుందని.. రావడం, రాకపోవడం ఆయా జట్ల ఇష్టమని, ఈ విషయంపై స్పందించడం కూడా అనవసరమని పాక్‌కు సున్నితంగా మొట్టికాయలు వేశారు.  

భారత్‌ ఓ క్రీడా శక్తి అని, ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో బీసీసీఐకి అత్యున్నత హోదా ఉందని, ఇదివరకే భారత్‌ ఎన్నో ప్రపంచకప్‌లను సమర్ధవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు. పాక్‌ బెదిరింపులకు భారత ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని, భారత్‌ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి మాట వినదని అవాక్కులు చవాక్కులు పేలుతున్న పాక్‌కు గట్టిగా కౌంటరిచ్చారు. పాక్‌లో పర్యటించే అంశం కేంద్ర హోం శాఖ పరిధిలోని అంశమని, అక్కడ భద్రతాపరమైన సమస్యలున్నాయని నిఘా వర్గాల సమాచారం అందిందని మంత్రి వివరించారు. 

చదవండి: IND vs BAN: ఏడేళ్ల తర్వాత బం‍గ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా..!

Poll
Loading...
మరిన్ని వార్తలు